Published : 24 Jun 2022 03:30 IST

సంక్షిప్త వార్తలు

వివాదాలకు స్వస్తి

స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌, పద్మజా రెడ్డి మధ్య కుదిరిన సర్దుబాటు  

ఈనాడు, హైదరాబాద్‌: స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, ఇటీవల వరకూ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన పద్మజా రెడ్డి మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కారం అయ్యాయి. దాదాపు ఏడు నెలల క్రితం ఎండీ పదవి నుంచి ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకున్నారు. తనను అక్రమంగా సాగనంపారని, తనకు సంబంధం లేని వ్యవహారాలు చేపట్టారని కంపెనీపై, కంపెనీ బోర్డు సభ్యులు, సంస్థాగత ఇన్వెస్టర్‌ అయిన కేదారా కేపిటల్‌పై పద్మజా రెడ్డి ఆరోపణలు చేశారు. ఎట్టకేలకు ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. పద్మజారెడ్డితో తలెత్తిన విభేదాలను పరిష్కరించుకున్నామని స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. కానీ ఏ విధమైన పరిష్కారం కుదిరిందనే విషయాన్ని తెలియజేయలేదు. ఇప్పటికీ కంపెనీలో పద్మజా రెడ్డి 15 శాతానికి పైగా వాటాతో, కీలక షేర్‌హోల్డర్లలో ఒకరుగా ఉన్నారు. ఇకపై సంస్థ పురోభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు స్పందన స్ఫూర్తి యాజమాన్యం పేర్కొంది. ఎండీ పదవి నుంచి తప్పుకున్న తర్వాత, పద్మజా రెడ్డి సొంతంగా మరొక మైక్రో ఫైనాన్స్‌ కంపెనీని స్ధాపించాలనే ఆలోచన చేశారు. కానీ తర్వాత కోల్‌కతాకు చెందిన ఒక నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని కొనుగోలు చేశారు. కీర్తన ఫైనాన్షియల్‌ పేరుతో ఆ కంపెనీ కింద బంగారం తనఖా రుణాల వ్యాపారాన్ని చేపట్టారు. పద్మజా రెడ్డితో విభేదాలు పరిష్కరించుకున్న విషయం వెల్లడి కాగానే స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ షేర్లకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలో కొనుగోలుదార్ల మద్దతు లభించింది. ఈ షేరు బీఎస్‌ఈలో దాదాపు 20 శాతం పెరిగి రూ.399.35 ముగింపు ధరను నమోదు చేసింది.


2025 నాటికి రూ.500 కోట్ల టర్నోవర్‌

బ్లూ వాటర్‌ లాజిస్టిక్స్‌ లక్ష్యం  

ఈనాడు, హైదరాబాద్‌: సరకు రవాణా సేవల రంగంలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్లూ వాటర్‌ లాజిస్టిక్స్‌ 2025 నాటికి రూ.500 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అప్పటికి పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీఓ) వెళ్లాలనే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ టర్నోవర్‌ రూ.200 కోట్లు. విశాఖపట్నం, కృష్ణపట్నం, చెన్నై, జైపూర్‌, ముంబయి, దిల్లీలలో బ్లూ వాటర్‌ లాజిస్టిక్స్‌ శాఖలున్నాయి. హైదరాబాద్‌లో బ్లూ వాటర్‌ లాజిస్టిక్స్‌ నూతన కార్పొరేట్‌ కార్యాలయాన్ని టర్కీ కాన్సుల్‌ జనరల్‌ ఒర్హాన్‌ యైమన్‌ ఒకా ప్రారంభించారు. సంస్థ సహ- వ్యవస్థాపకుడు, సీఓఓ ఎల్‌ఎన్‌ మిశ్రా మాట్లాడుతూ రెండేళ్లలో దేశంలో ఇరవైకి పైగా ప్రధాన నగరాల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా, గ్రానైట్‌, కన్ఫెక్షనరీస్‌, కెమికల్స్‌, ఇంజనీరింగ్‌, టెక్స్‌టైల్స్‌ రంగాల సంస్థలకు, తాము సరకు రవాణా సేవలు అందిస్తున్నట్లు వివరించారు.


పెగా సిస్టమ్స్‌ ఇండియా టీమ్‌ హెడ్‌ దీపక్‌ విశ్వేశ్వరయ్య  

ఈనాడు, హైదరాబాద్‌: పెగా సిస్టమ్స్‌లో నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. దీని  ప్రకారం పెగా ఇండియా లీడర్‌షిప్‌ టీమ్‌ (ఐఎల్‌టీ) హెడ్‌గా దీపక్‌ విశ్వేశ్వరయ్య బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం ఆయన ఈ సంస్థలోనే వైస్‌ ప్రెసిడెంట్‌ (ప్లాట్‌ఫామ్‌ ఇంజనీరింగ్‌), సైట్‌ ఎండీగా ఉన్నారు. ఇప్పటి వరకు పెగా ఇండియా ఎండీగా ఉన్న సుమన్‌ రెడ్డి వచ్చే నెలలో పెగా సిస్టమ్స్‌ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని కంపెనీ వెల్లడించింది. పెగా సిస్టమ్స్‌ ఇండియాలో ప్రస్తుతం 2,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన క్లయింట్లకు పెగా సిస్టమ్స్‌ అందించే ఆర్‌అండ్‌డీ ఇన్నోవేషన్‌, క్లౌడ్‌ సేవల్లో పెగా ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది.


ఫ్రెష్‌టుహోమ్‌ భారీ పెట్టుబడులు!

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో చేపలు, మాంసం విక్రయించే ఇ-కామర్స్‌ సంస్థ, ఫ్రెష్‌టుహోమ్‌, దశల వారీగా తెలంగాణ రాష్ట్రంలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో తమ వినియోగదార్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని చేపలు, మాంసం ప్రాసెసింగ్‌, శీతల నిల్వ, పంపిణీ సదుపాయాలపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. వచ్చే అయిదేళ్ల కాలానికి తమ పెట్టుబడుల ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఫ్రెష్‌టుహోమ్‌ సహ వ్యవస్థాపకుడు షాన్‌ కడవిల్‌ వెల్లడించారు.  


ఆదీశ్వర్‌ ఆటోతో మోటో మోరిని జట్టు

భారత విపణిలోకి పునఃప్రవేశం

ముంబయి: ఇటలీకి చెందిన మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌ మోటో మోరిని దేశీయ విపణిలో పునఃప్రవేశించి 4 వాహనాలను విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియాతో జట్టు కడుతున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం కింద, ఆదీశ్వర్‌ ఆటో, మోటో మోరినికి చెందిన ప్రీమియం శ్రేణి మోటార్‌సైకిళ్లను భారత్‌లో తయారు చేసి, పంపిణీ చేయనుంది. మోటో మోరిని బ్రాండ్‌ను 1937లో ఆల్ఫోన్సో మోరిని సృష్టించారు. ఐరోపా విపణిలో ఈ కంపెనీకి 119 విక్రయ కేంద్రాలున్నాయి.


కాగితపు స్ట్రాలు కావాల్సినన్ని చేయగలం

 వినియోగానికి గడువు పెంపు అక్కర్లేదు

 ఐపీఎమ్‌ఏ స్పష్టీకరణ

దిల్లీ: దేశంలో కాగితపు స్ట్రాలు, ఇదే తరహా ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యం, సాంకేతికత ఉందని భారత కాగితపు పరిశ్రమ పేర్కొంది. దేశంలో పేపరు స్ట్రాలు తగినన్ని అందుబాటులో లేనందున దిగుమతి చేసుకుంటున్నామని, గిరాకీకి తగ్గట్లుగా దేశీయ సామర్థ్యం చేరుకోవాలంటే సమయం పడుతుందని పలు ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు పేర్కొన్న నేపథ్యంలో కాగితపు పరిశ్రమ సంఘం ఐప్మా పైవిధంగా స్పందించింది. ప్లాస్టిక్‌ స్ట్రాలు సహా ఒకేసారి వాడే ప్లాస్టిక్స్‌పై జులై 1 నుంచి ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చిన్న ప్యాకెట్లలో పళ్ల రసాలు, డెయిరీ ఉత్పత్తులను విక్రయించే ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు మాత్రం ఈ గడువు తేదీని పొడిగించాలని కోరాయి. ఈ తరహా స్ట్రాలను దిగుమతి చేసుకోవడం ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తుందని, తగిన కాగితపు స్ట్రాలను తయారు చేసే మౌలిక వసతులను ఏర్పాటు చేసుకునేంత వరకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ వాదన ‘వాస్తవ విరుద్ధమ’ని ఇండియన్‌ పేపర్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌(ఐప్మా) అధ్యక్షుడు ఎ.ఎస్‌. మెహతా పేర్కొన్నారు. ఏ భారత పేపరు మిల్లూ కాగితనపు స్ట్రాలు తయారు చేయలేదన్న ‘తప్పుడు అభిప్రాయాన్ని’ ఇది కలిగిస్తుందంటూ.. గడువు పొడిగింపును వ్యతిరేకించారు. ‘ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలకు ఏటా 600 కోట్ల పేపరు స్ట్రాల అవసరం ఉంది. సగటున 2-3 గ్రాముల బరువుండే ఆ స్ట్రాలకు ఏటా 12,000-18,000 మెట్రిక్‌ టన్నుల పేపరు కావాలి. అంటే నెలకు 1000-1500 మెట్రిక్‌ టన్నులు కావాలి. భారత పేపరు మిల్లులు ఎటువంటి ఇబ్బంది లేకుండానే దీనిని సమకూర్చగలవ’ని ఐపీఎమ్‌ఏ పేర్కొంది.


రూ.8,837 కోట్ల ఏజీఆర్‌ బకాయిల చెల్లింపు నాలుగేళ్లు వాయిదా

దిల్లీ: సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాలకు (ఏజీఆర్‌) సంబంధించి రూ.8,837 కోట్ల అదనపు బకాయిల చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని వొడాఫోన్‌ ఐడియా నిర్ణయించింది. 2016-17 తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను ఏజీఆర్‌ బకాయిల కింద రూ.8837 కోట్లు  చెల్లించాల్సిందిగా టెలికాం విభాగం (డీఓటీ) నోటీసులు పంపినట్లు ఎక్స్ఛేంజీలకు వొడాఫోన్‌ ఐడియా తెలియజేసింది. ఈ బకాయిలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు వర్తించవని పేర్కొంది. అయితే వీటి చెల్లింపును నాలుగేళ్ల పాటు వాయిదా వేసే అవకాశాన్ని వాడుకునే ప్రతిపాదనకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని కంపెనీ వివరించింది. ‘2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఏజీఆర్‌ బకాయిలన్నింటికీ నాలుగేళ్ల మారటోరియం అవకాశాన్ని టెలికాం విభాగం మాకు కల్పించింది. టెలికాం విభాగం లేఖ తేదీ నుంచి 90 రోజుల్లోగా ఈ బకాయిలపై వడ్డీని ఈక్విటీ రూపంలో మార్చుకునేందుకు కూడా వీలు కల్పించింద’ని వొడాఫోన్‌ ఐడియా వివరించింది. డీఓటీ పంపిన లేఖలో ఏజీఆర్‌ బకాయిలు రూ.8,837 కోట్లుగా చెప్పారని.. వివిధ సంప్రదింపులు, కాగ్‌, ప్రత్యేక ఆడిట్‌, ఇతర కోర్టు ఆదేశాలు లాంటి పరిణామాలు ఏమైనా చోటుచేసుకుంటే ఈ బకాయిల విలువలో మార్పులకు అవకాశం ఉంటుందని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. తుది మొత్తాన్ని మారటోరియం సమయం పూర్తయ్యాక అంటే 2026 మార్చి 31 తర్వాత నుంచి ఆరు సమాన వార్షిక వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొంది. గత ఏజీఆర్‌ బకాయిలకు సంబంధించి కట్టాల్సిన రూ.16,000 కోట్ల వడ్డీని.. కంపెనీలో 33 శాతం వాటా రూపంలోకి మార్చేందుకు ఇప్పటికే వొడాఫోన్‌ ఐడియాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts