దుస్తుల రంగానికీ పీఎల్‌ఐ పథకం!

దేశీయ తయారీ, ఎగుమతులకు మద్దతునిచ్చేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకాన్ని దుస్తుల రంగానికీ అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. జౌళి

Updated : 26 Jun 2022 18:09 IST

కోయంబత్తూరు: దేశీయ తయారీ, ఎగుమతులకు మద్దతునిచ్చేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకాన్ని దుస్తుల రంగానికీ అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పీయూశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. జౌళి మంత్రిత్వ శాఖ; పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహకాల విభాగం(డీపీఐఐటీ); నీతి ఆయోగ్‌ మధ్య ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వివరించారు. ‘దుస్తుల తయారీ రంగానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరో పీఎల్‌ఐ పథకంతో ముందుకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. త్వరలోనే పథకానికి తుదిరూపునిచ్చి కేబినెట్‌ ముందుకు తీసుకొస్తామ’ని శనివారమిక్కడ విలేకర్లతో తెలిపారు. జౌళి  ఎగుమతులు మెరుగైన రీతిలో వృద్ధి చెందుతున్నాయని.. వచ్చే అయిదేళ్లలో ప్రస్తుతమున్న 44 బి. డాలర్ల స్థాయి నుంచి 100 బి. డాలర్ల(దాదాపు రూ.8 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. దేశీయ ఉత్పత్తి సైతం వచ్చే అయిదేళ్లలో రెట్టింపై రూ.20 లక్షల కోట్లకు చేరొచ్చన్నారు.


జీఎస్‌టీ పరిహార సెస్సు మరో నాలుగేళ్లు

మార్చి 2026 వరకు పొడిగింపు

దిల్లీ: జీఎస్‌టీ పరిహార సెస్సు విధింపు సమయాన్ని దాదాపు నాలుగేళ్ల పాటు అంటే మార్చి 31, 2026 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ నోటిఫై చేసిన వస్తువులు, సేవల పన్ను(సెస్సు వసూలు సమయం) నిబంధనలు, 2022 ప్రకారం.. పరిహార సెస్సు జులై 1, 2022 నుంచి మార్చి 31, 2026 వరకు కొనసాగుతుంది. జూన్‌ 30, 2022నే ఈ సెస్సు అమలు ముగియాల్సి ఉండగా.. జీఎస్‌టీ మండలి మార్చి 2026 వరకు పొడిగించాలని నిర్ణయించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో తీసుకున్న రుణాలను చెల్లించడానికి, జీఎస్‌టీ కారణంగా తగ్గిన ఆదాయ వసూళ్లు పూడ్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాట్‌ వంటి రాష్ట్రాలకు చెందిన పన్నులన్నీ జీఎస్‌టీలో కలవడం వల్ల ఆయా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాలకు పరిహారం చెల్లించే వ్యవస్థ జూన్‌ 30, 2022న ముగియనుందని గతేడాది సెప్టెంబరులో జీఎస్‌టీ మండలి సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. విలాసవంతమైన, ప్రతికూల విభాగాలపై మాత్రం పరిహార సెస్సును మార్చి 2026 వరకు వసూలు చేయనున్నారు. 2020-21; 2021-22లో తీసుకున్న రుణాలను చెల్లించడానికి, రాష్ట్రాల జీఎస్‌టీ ఆదాయ నష్టాలకు పరిహారం చెల్లించడానికి దీనిని వినియోగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని