లాభాలు కొనసాగే వీలు!

దేశీయ సూచీలు ఈ వారం లాభాలను కొనసాగించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే జూన్‌ డెరివేటివ్‌ సిరీస్‌ గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో కొంత ఊగిసలాటకు అవకాశం ఉంటుందని అంటున్నారు. నష్టాల అనంతరం

Published : 27 Jun 2022 03:24 IST
డెరివేటివ్‌ గడువుతో ఊగిసలాటకూ అవకాశం
బ్యాంకు, ఔషధ షేర్లకు సానుకూలతలు
రాబోయే నెలల్లో 16,600కు నిఫ్టీ
విశ్లేషకుల అంచనాలు

దేశీయ సూచీలు ఈ వారం లాభాలను కొనసాగించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే జూన్‌ డెరివేటివ్‌ సిరీస్‌ గడువు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో కొంత ఊగిసలాటకు అవకాశం ఉంటుందని అంటున్నారు. నష్టాల అనంతరం మార్కెట్లో ఇపుడు లాభాలు కనిపిస్తున్నాయని.. నిఫ్టీ 15,900-16,000 స్థాయికి వెళ్లొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నిఫ్టీకి 14,600-14,800 శ్రేణిలో బలమైన మద్దతు కనిపిస్తోందని చెబుతున్నారు. రాబోయే నెలల్లో నిఫ్టీ 16,600 పాయింట్ల స్థాయికి చేరొచ్చని  అంచనా వేస్తున్నారు. ముడి చమురు - కమొడిటీ ధరల చలనాలు కీలకమవుతాయి. రూపాయి విలువ, రుతుపవనాల విస్తరణ, ఎఫ్‌ఐఐల పెట్టుబడులూ ముఖ్యమే.   వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* వాహన కంపెనీల షేర్లు భారీగా పెరిగిన నేపథ్యంలో, ఈ వారం వాటిల్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవచ్చు. జూన్‌ వాహన టోకు విక్రయ గణాంకాలు శుక్రవారం (జులై 1న) వెలువడనున్నాయి. వీటి నుంచి సంకేతాలు అందుకోవచ్చు.

* ముడి చమురు ధర చలనాలను బట్టి ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా వంటి అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు కదలాడొచ్చు. పెట్రోల్‌, డీజిల్‌కు సంబంధించి రోజు వారీ ధరల సవరణ మొదలైతే రిఫైనరీలు, ఇంధన రిటైలర్లకు సానుకూలంగా మారొచ్చు.

* అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల గిరాకీపై ప్రభావం పడొచ్చన్న అంచనాల మధ్య ఐటీ కంపెనీల షేర్లు పెద్దగా రాణించకపోవచ్చు.

* సిమెంటు కంపెనీల షేర్లు ఇతర సైక్లికల్‌ రంగాల మాదిరిగానే ట్రేడవవచ్చు. వడ్డీ రేట్లు - కమొడిటీ ధరలు- నిర్వహణ వ్యయాలు పెరుగుతుండడం వల్ల, కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలపై ప్రభావం పడొచ్చు.

* టెలికం కంపెనీల షేర్లు ఊగిసలాటను కొనసాగించొచ్చు. వొడాఫోన్‌ ఐడియాలో ప్రభుత్వం తీసుకునే వాటాపై ఏదైనా ప్రకటన వస్తుందేమోనని మదుపర్లు ఎదురు చూస్తున్నారు. భారతీ ఎయిర్‌టెల్‌పై విశ్లేషకులు బులిష్‌గా ఉన్నారు.

* మార్కెట్‌తో పోలిస్తే ఔషధ రంగం వరుసగా నాలుగో వారమూ రాణించొచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మందగమనం, అధిక వడ్డీ రేట్ల నడుమ ఈ రంగం బలంగా కనిపిస్తోంది.  

* బ్యాంకు షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. ఇటీవలి అమ్మకాల వల్ల కొన్ని నాణ్యమైన బ్యాంకుల్లో మదుపర్లు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయమని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీ బ్యాంక్‌ 30,500-31,000 వద్ద మద్దతును అందిపుచ్చుకోగలదు.  

* లోహ కంపెనీల షేర్లు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చు. అంతర్జాతీయ మందగమనం వల్ల గిరాకీ తుడిచిపెట్టుకుపోతే ప్రాథమిక లోహ ధరలు పడిపోవచ్చన్న అంచనాలు ఇందుకు నేపథ్యం.  

* ఎటువంటి వార్తలూ లేనందున ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు కీలక సూచీల నుంచే సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు. హిందుస్థాన్‌ యునిలీవర్‌, ఐటీసీ సానుకూలంగా కనిపిస్తున్నాయి. స్వల్పకాలానికి ఈ రంగం తటస్థం నుంచి సానుకూలం దాకా ఉండొచ్చు.

* ప్రత్యేక వార్తలేమీ లేనందున యంత్ర పరికరాల షేర్లు మార్కెట్‌తో పాటే చలించొచ్చు. చాలా కంపెనీలు 52 వారాల కనిష్ఠాల నుంచి పైకి రావడంతో, స్వల్పంగా రాణించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని