Published : 29 Jun 2022 03:07 IST

అయ్యో రూపాయి

డాలర్‌ రూ.78.85కు చేరిక

సూచీలకు స్వల్ప లాభాలు

సమీక్ష

అంతర్జాతీయ మార్కెట్ల రికవరీ నేపథ్యంలో దేశీయంగా చమురు-గ్యాస్‌, ఐటీ, వాహన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మంగళవారం ప్రారంభ నష్టాల నుంచి కోలుకున్న సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.58% పెరిగి 116.9 డాలర్లకు చేరడం ఆందోళన కలిగించింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు పరుగులు తీశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 52,846.26 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. అనంతరం అదే ధోరణి కొనసాగిస్తూ.. ఇంట్రాడేలో 52,771.53 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. రోజులో ఎక్కువ భాగం నష్టాల్లోనే కదలాడిన సూచీ.. ఆఖర్లో లాభాల్లోకి వచ్చి 53,301.40 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 16.17 పాయింట్ల లాభంతో 53,177.45 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 18.15 పాయింట్లు పెరిగి 15,850.20 దగ్గర స్థిరపడింది.  

* బ్లింక్‌ కామర్స్‌ను కొనుగోలు చేయనుండటంతో జొమాటో షేర్ల క్షీణత రెండో రోజూ కొనసాగింది. ఇంట్రాడేలో 9.18% పడ్డ షేరు రూ.59.80 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 8.35% నష్టంతో రూ.60.35 వద్ద ముగిసింది. గత రెండు ట్రేడింగ్‌ రోజుల్లో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.7,861.49 కోట్లు తగ్గి రూ.47,517.51 కోట్లకు పరిమితమైంది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 మెరిశాయి. ఎం అండ్‌ ఎం 2.78%, రిలయన్స్‌ 1.49%, టెక్‌ మహీంద్రా 1.40%, టాటా స్టీల్‌ 1.34%, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.33%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.08%, ఎల్‌ అండ్‌ టీ 1.05%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.83% లాభపడిన వాటిలో ఉన్నాయి. టైటన్‌ 3.54%, ఏషియన్‌ పెయింట్స్‌ 3.25%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2%, కోటక్‌ బ్యాంక్‌ 1.32%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.02%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1% నష్టపోయాయి.  

* రుచి సోయా ఇండస్ట్రీస్‌ పేరు పతంజలి ఫుడ్స్‌గా మారింది. జూన్‌ 24 నుంచి పేరు మార్పు అమల్లోకి వచ్చింది. 2019లో దివాలా ప్రక్రియ ద్వారా రుచి సోయాను పతంజలి ఆయుర్వేద్‌ గ్రూప్‌ రూ.4350 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

* ఐపీఓ ద్వారా రూ.2000 కోట్లు సమీకరించేందుకు ఆఫీసర్స్‌ ఛాయిస్‌ విస్కీ తయారీ సంస్థ అలైడ్‌ బ్లెండర్స్‌ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.1000 కోట్ల తాజా షేర్లు జారీ చేయడంతో పాటు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో రూ.1000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.

48 పైసలు క్షీణించిన రూపాయి

డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కొనసాగుతోంది. మంగళవారం 78.53 వద్ద బలహీనంగా ప్రారంభమైన రూపాయి.. చివరకు 48 పైసలు కోల్పోయి తాజా జీవనకాల కనిష్ఠమైన 78.85 వద్ద ముగిసింది. విదేశీ మదుపర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగడం, ముడిచమురు ధరలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపాయి. రూపాయి విలువ క్షీణిస్తున్న సందర్భాల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రంగంలోకి దిగేది. ఈసారి అటువంటి చర్యలు ఆర్‌బీఐ చేపట్టడం లేదని, అందుకే రూపాయి రోజురోజుకు బలహీనపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని