Published : 01 Jul 2022 02:03 IST

రికవరీ బాటలో ఆర్థిక వ్యవస్థ

ఆర్‌బీఐ స్థిరత్వ నివేదిక

ముంబయి: భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో నడుస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పేర్కొంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక ముప్పులను జాగ్రత్తగా ఎదుర్కోవాలని, పరిస్థితిని సునిశితంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆర్‌బీఐ 25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో ఈ అంశాలను పేర్కొంది. ప్రతికూల పరిణామాలను తట్టుకునేందుకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) దగ్గర సరిపడా మూలధనం ఉందని వెల్లడించింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం, అధిక ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపులు, కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిస్తేజంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 2022 మార్చికి షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల సీఆర్‌ఏఆర్‌ కొత్త గరిష్ఠమైన 16.7 శాతానికి చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) ఆరేళ్ల కనిష్ఠమైన 5.9 శాతానికి తగ్గాయి.

* 2022 మార్చికి భారత విదేశీ రుణ భారం 47.1 బిలియన్‌ డాలర్లు పెరిగి 620.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. విదేశీ రుణాలు, జీడీపీ నిష్పత్తి 2021 మార్చిలో 21.2 శాతంగా ఉండగా.. ఈ ఏడాది మార్చికి 19.9 శాతానికి తగ్గింది.

క్రిప్టోకరెన్సీలు ప్రమాదకరం: శక్తికాంత దాస్‌

క్రిప్టోకరెన్సీలను ‘ప్రమాదకరమైనవి’గా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభివర్ణించారు. విలువ కలిగినవి మాత్రమే నమ్మకం కలిగిస్తాయని, అటువంటివి లేనప్పుడు ఒక పేరు కింద చలామణీ అవుతాయని అన్నారు. పలు సంస్థలు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత క్రిప్టోకరెన్సీలపై సంప్రదింపుల పత్రాన్ని ఖరారు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ పెరుగుతోందని, సైబర్‌ ముప్పు అధికమవుతున్నందున ప్రత్యేక చర్యలు అవసరమని దాస్‌ అభిప్రాయపడ్డారు.  

రూపాయి మెరుగ్గానే ఉంది: సీతారామన్‌

అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ కంటే రూపాయి మెరుగ్గానే ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వృద్ధిపై భయాలతో డాలర్‌తో పోలిస్తే వర్థమాన దేశాల కరెన్సీలు భారీగా క్షీణిస్తున్నాయి. అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపులు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ భాగమని, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మనపై ఉంటుందని నిర్మలా పేర్కొన్నారు.


ఈ ఏడాదంతా ప్రతికూలమే : మూడీస్‌

అంతర్జాతీయ రుణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయని, ఈ ఏడాది మొత్తం ఇదే పరిస్థితి కొనసాగవచ్చని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పేర్కొంది. రుణ వ్యయాలు పెరగడం, రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు, ఆర్థిక వృద్ధి నెమ్మదించడం ఇందుకు కారణాలుగా తెలిపింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితులతో ఇంధన, ఆహార ధరలు భారీగా పెరగడం, సరఫరా ఇబ్బందులు వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గిందని వెల్లడించింది. కంపెనీల తయారీ వ్యయాలు పెరగడమే కాకుండా మదుపర్ల సెంటిమెంట్‌ కూడా దెబ్బతిందని, స్టాక్‌ మార్కెట్ల ఒడుదొడుకులు పెరిగాయని అభిప్రాయపడింది. కొవిడ్‌-19 సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం వల్ల సార్వభౌమ రుణదాతలకు సైతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని వివరించింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts