జీఎస్‌టీ మినహాయింపు ఉన్నసేవల సంఖ్యకు కత్తెర!

జీఎస్‌టీ మినహాయింపు ఉన్న ఉత్పత్తుల సంఖ్యను తగ్గించే అంశంపై మరింత కసరత్తు జరగాల్సి ఉందని, ముఖ్యంగా సేవా రంగంలో అని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండు మూడేళ్లలో

Published : 06 Jul 2022 03:43 IST

ఆ దిశగా మరింత కసరత్తు అవసరం

రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌

దిల్లీ: జీఎస్‌టీ మినహాయింపు ఉన్న ఉత్పత్తుల సంఖ్యను తగ్గించే అంశంపై మరింత కసరత్తు జరగాల్సి ఉందని, ముఖ్యంగా సేవా రంగంలో అని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ తెలిపారు. సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండు మూడేళ్లలో జీఎస్‌టీ విధానంలో లోపాలను తొలగించాలన్నదే ఈ కసరత్తు ఉద్దేశమని తెలిపారు. జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ అంశాన్ని మంత్రుల బృందం పరిశీలిస్తోందని చెప్పారు. ఇందుకోసం కొంత కాలం వేచిచూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘మినహాయింపులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిల్లో చాలా వరకు సేవా రంగంలోనే ఉన్నాయి. వీటిని తగ్గించుకునేందుకు కసరత్తు చేయాల్సి ఉంద’ని బజాజ్‌ చెప్పారు. ఆసుపత్రుల్లో ఐసీయూ కానీ గదుల అద్దె రూ.5000 మించితే 5 శాతం జీఎస్‌టీ విధించడం.. అందుబాటు ధరకే ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే ఉద్దేశానికి వ్యతిరేకమంటూ వ్యక్తమవుతున్న అభిప్రాయాలపై స్పందించారు. ఆసుపత్రుల్లో రూ.5000కి మించి అద్దె ఉన్న గదుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. ‘నేను ఒక గదిపై రోజుకు రూ.5000 చెల్లించగలిగినప్పుడు.. రూ.250 జీఎస్‌టీ కూడా కట్టగలను. అందువల్ల ఈ స్థాయి గదులపై 5 శాతం జీఎస్‌టీ విధిస్తే, అందుబాటు ధరకే ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలన్న ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని చెప్పడానికి నాకు ఏవిధమైన కారణాలు కనిపించడం లేద’ని ఆయన అన్నారు. 28 శాతం పన్ను శ్లాబులో ఉన్న వస్తువుల వాటా జీఎస్‌టీ మొత్తం ఆదాయంలో 16 శాతమని పేర్కొన్నారు. 18 శాతం పన్ను రేటు శ్లాబు నుంచే అత్యధికంగా 65 శాతం జీఎస్‌టీ ఆదాయం వస్తోందని తెలిపారు. 5 శాతం, 12 శాతం పన్ను శ్లాబుల్లోని వస్తువుల ఆదాయం వాటా వరుసగా 10 శాతం, 7 శాతంగా ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని