Published : 26 Dec 2020 17:25 IST

‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ వీరి ఆలోచనే..

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుంది. అందుకు సరైన ఉదాహరణ ఫ్లిప్‌కార్ట్‌. భారత్‌లోని కోటానుకోట్ల మంది ప్రజల సమయాన్ని ఆదా చేసి.. నాణ్యమైన ఉత్పత్తుల్ని ప్రజల వద్దకు చేర్చాలనుకున్నారు ఆ సంస్థ వ్యవస్థాపకులు సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్సల్‌. స్వయంగా వారే డెలివరీ బాయ్‌లుగా మారి తమ కలని నిజం చేసుకున్నారు. భారత్‌లో పుట్టుకొస్తున్న అంకుర సంస్థలకు ఆదర్శంగా నిలిచారు. ఆలోచన మంచిదైతే భారతీయులు ఆదరిస్తారన్న భరోసా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కల్పించారు. 

ఇద్దరూ ఐఐటీయన్లే...

బిన్నీ, సచిన్‌ ఇరువురు చంఢీగఢ్‌కు చెందినవారే. ఐఐటీ దిల్లీలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. సచిన్‌ 2006లో అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరారు. అప్పటికే అక్కడ బిన్నీ సీనియర్‌ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా జరిపే చర్చలతో ఇరువురి మధ్య బంధం పెరిగింది. ఒకరి లక్ష్యాలు ఒకరు పంచుకున్నారు. ఆ క్రమంలో చిగురించిందే హోమ్‌ డెలివరీ ఆలోచన. అమెజాన్‌ విజయసూత్రాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేసిన వారు దాన్నే భారత్‌లో అమలుపరచాలనుకున్నారు.

వారే డెలివరీ బాయ్స్‌గా...

కేవలం రూ.4లక్షల పెట్టుబడితో ఫ్లిప్‌కార్ట్‌ని ప్రారంభించారు. బెంగళూరులోని ఓ అపార్టుమెంటు వారి తొలి కార్యస్థలం. పుస్తకాల హోం డెలివరీతో వారి బిజినెస్‌ ప్రారంభమైంది. విజయం ఊరికే వరించదు అనడానికి వీరి ప్రయాణమే నిదర్శనం. తొలినాళ్లలో స్వయంగా వారే స్కూటర్లపై బుక్స్‌ డెలివరీ చేసేవారు. అయితే ఫ్లిప్‌కార్ట్‌ని స్థాపించడానికి ముందు వారు ‘కంపారిజన్‌ సెర్చ్‌ ఇంజిన్‌’ని స్థాపించాలన్న ఆలోచన కూడా ఉండేదట. అప్పటికి భారత విపణిలో ఈ-కామర్స్‌కి ఉన్న ఆదరణ చాలా తక్కువ. అందుకే వారు ప్రత్యామ్నాయ ఆలోచనలను కూడా మదిలో ఉంచుకున్నారు.

ఈ-కామర్స్‌ని మలుపుతిప్పిన ఆలోచన...

ఒకసారి ఫ్లిప్‌కార్ట్‌ ప్రారంభించిన తర్వాత ఈ-కామర్స్‌ వృద్ధికి భారత్‌లో ఉన్న అడ్డంకులేంటో వారికి స్పష్టంగా అర్థమైంది. అప్పటికి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, కార్డు పేమెంట్లపై భారత్‌లో అవగాహన చాలా తక్కువ. మెట్రో నగరాలు మినహా మిగతా ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవల్ని చాలా తక్కువగా వినియోగించేవారు. ఈ క్రమంలో వారికి వచ్చిన ఓ ఆలోచన ఈ-కామర్స్‌ బిజినెస్‌ రూపురేఖల్నే మార్చేసింది. అదే ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ(సీవోడీ)’. ఈ కొత్త వ్యవస్థతో ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌ బిజినెస్‌ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. అమెజాన్‌ భారత విపణిలోకి వచ్చినా.. దాని పోటీని తట్టుకొని నిలిచింది. ఈ క్రమంలో సంస్థ మనుగడ.. దీనిపై ఆధారపడ్డ వేలాది మంది ఉద్యోగుల ఉపాధిని కాపాడడం కోసం ఈ-కామర్స్‌ రంగంలోకి ప్రవేశించిన ఇతర చిన్న సంస్థల్ని కొనుగోలు చేసింది. మొత్తానికి భారత్‌లో అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థగా పేరుగాంచింది.

వాల్‌మార్ట్‌ చేతికి...

అమెరికా రిటైల్‌ దిగ్గజం ‘వాల్‌మార్ట్‌’ 2018లో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాని కొనుగోలు చేసింది. దీంతో బన్సల్‌ ద్వయానికి దాదాపు రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.4 లక్షల పెట్టుబడితో వచ్చిన వీరు రూ.100 కోట్ల సంపదను సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో భారత విపణిలో అంకుర సంస్థలకు దిక్సూచిగా మారారు. మంచి ఆలోచనలతో వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచారు. సంస్థ సేవల్ని ప్రజలకు మరింత చేరువచేసేందుకు వాల్‌మార్ట్‌ కృషి చేస్తోంది. ప్రస్తుతం బన్సల్‌ ద్వయం వివిధ కారణాలతో ఫ్లిప్‌కార్ట్‌ నుంచి నిష్క్రమించారు. ఇతర బిజినెస్‌లను స్థాపించడంలో నిమగ్నమయ్యారు. 

ఏదేమైనా భారత అంకుర సంస్థలకు బలాన్నిచ్చింది ఫ్లిప్‌కార్ట్‌ విజయమే అనడంలో ఏమాత్రం సంశయం లేదు. ప్రజల సమస్యలకు నిజమైన పరిష్కారం చూపి.. వారికందించే సేవలకు విలువ జోడిస్తే ఎప్పటికీ ఆదరణ ఉంటుందని నిరూపించారు. అలాగే కలిసి పనిచేయడంలో ఉన్న స్ఫూర్తిని చాటిచెప్పారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని