మహిళల ఆర్థిక భరోసాకు అడుగులివే...

డబ్బుకు సంబంధించిన వ్యవహారం అంతా పురుషులే చూసుకోవాలనే ఆలోచనలకు కాలం చెల్లింది. కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఏలుతున్న మహిళలు.. ఆర్థికంగా ఇంటిని  సరిదిద్దడంలో ఎప్పుడూ కీలకమే. ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషించే మహిళలు.. ఆర్థిక ప్రణాళికల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తన భవిష్యత్తుకు భరోసా కల్పించుకునేందుకు ఏం చేయాలి? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Updated : 08 Mar 2021 09:17 IST

డబ్బుకు సంబంధించిన వ్యవహారం అంతా పురుషులే చూసుకోవాలనే ఆలోచనలకు కాలం చెల్లింది. కార్పొరేట్‌ ప్రపంచాన్ని ఏలుతున్న మహిళలు.. ఆర్థికంగా ఇంటిని  సరిదిద్దడంలో ఎప్పుడూ కీలకమే. ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషించే మహిళలు.. ఆర్థిక ప్రణాళికల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తన భవిష్యత్తుకు భరోసా కల్పించుకునేందుకు ఏం చేయాలి? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

పోటీ ప్రపంచంలో ఖర్చులు పెరిగాయి. దంపతులిద్దరూ సంపాదించడం నేటి రోజుల్లో తప్పనిసరి అయ్యింది. మహిళలు ఆర్జిస్తున్నప్పటికీ.. ఆర్థిక ప్రణాళికలు, తమ భవిష్యత్తు కోసం కొంత దాచుకోవాలనే విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపరు. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది ఒక ముఖ్యమైన అంశంగా చూడాల్సిందే.
అత్యవసర నిధితో..
అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు ఆదుకునేది అత్యవసర నిధి. ఉద్యోగం చేస్తున్నా.. వ్యాపారంలో ఉన్నా.. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. ప్రతి మహిళా తనకంటూ అత్యవసరాల కోసం కొంత నిధిని జాగ్రత్త చేసుకోవాలి. ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టం రావడం లేదా అనుకోని అనారోగ్యం, కొన్ని మంచి, చెడు సంఘటనలు.. ఏదైనా కావచ్చు. అప్పటికప్పుడు ఎవరిమీదా ఆధారపడకుండా మీరు ఖర్చు చేసుకునేందుకు అందుబాటులో డబ్బు ఉండాలి. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు కుటుంబానికీ ఈ నిధి అండగా నిలుస్తుంది. ఇంటి అద్దె, రుణాల ఈఎంఐ, బీమా ప్రీమియాలు, నెలవారీ ఖర్చులు.. ఇలా అన్నీ లెక్కవేసుకొని, కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. అత్యవసర నిధి ఉంటే.. అవసరం వచ్చినప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకోవాల్సిన పని తప్పుతుంది.
అత్యవసరం ఎప్పుడైనా రావచ్చు... కాబట్టి, ఈ నిధిని సులభంగా వెనక్కి తీసుకునే పథకాల్లో జమ చేయాలి. కాస్త ఎక్కువ వడ్డీనిచ్చే పొదుపు ఖాతాలను ఎంచుకొని, అందులో వేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లనూ ఎలాంటి రుసుములు లేకుండా వెనక్కి తీసుకునే వీలు కల్పిస్తున్నాయి. అలాంటి వాటినీ చూసుకోవచ్చు.


‘ సిప్‌’ బాటలో..

ర్థిక లక్ష్యాల సాధనలో పెట్టుబడులు ఎంతో కీలకం. చిన్న మొత్తమైనా క్రమం తప్పకుండా మదుపు చేసేందుకు ప్రయత్నించండి. మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా దీర్ఘకాలిక వ్యూహంతో మదుపు చేయండి. మీ పొదుపు ఖాతా నుంచి నేరుగా ఫండ్లలోకి పెట్టుబడి మొత్తం వెళ్లేందుకు ఏర్పాటు చేయండి. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. మార్కెట్‌ గురించీ అవగాహన పెంచుకోండి. మీ ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయించే మొత్తాన్నీ పెంచుకునేందుకు ప్రయత్నించండి.

- రాధికా బినాని, చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌, పైసాబజార్‌.కామ్‌


 ధీమాగా ఉండాలి...

ర్జించే వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు.. ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండేందుకు జీవిత బీమా ఉపయోగపడుతుంది. సాధారణంగా పురుషుల పేరుమీదే జీవిత బీమా పాలసీలు ఉంటాయి. కానీ, సంపాదించే మహిళలూ టర్మ్‌ పాలసీని తీసుకోవాల్సిన అవసరం ఉంది. వార్షికాదాయానికి కనీసం 15 రెట్ల వరకూ బీమా ఉండేలా చూసుకోవాలి. చాలామంది మహిళలు తమ పేరుమీద సంప్రదాయ పాలసీలు ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల ఎక్కువ ప్రీమియం చెల్లించినా.. తక్కువ బీమా రక్షణ ఉంటుంది.
ఉద్యోగం చేస్తున్న మహిళలు తప్పనిసరిగా టర్మ్‌ పాలసీని తీసుకోవాలి. యాజమాన్య సంస్థ బృంద బీమాను అందిస్తున్నా సొంతంగా ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దు. కొన్ని పాలసీల్లో మహిళలకు ప్రత్యేకంగా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఇలాంటి వాటిని పరిశీలించాలి.


ప్రణాళికే ప్రాణం..

మన డబ్బుతో మనం ఏం చేస్తున్నాం.. ఏం చేయబోతున్నాం.. అనే ఆలోచన ఉండాలి. దీనికోసం తప్పనిసరిగా ఆర్థిక ప్రణాళిక  రచించుకోవాలి.
* ఆర్థిక ప్రణాళిక ఉన్నప్పుడే.. ఆర్థిక స్వేచ్ఛ సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి. మీ ఆర్థిక పరిస్థితి, నష్టభయం భరించే సామర్థ్యం, వ్యవధిని బట్టి ఏ పథకాల్లో మదుపు చేయాలి అనేది నిర్ణయించుకోవాలి. చిన్న వయసు నుంచే పెట్టుబడులను ప్రారంభిస్తే.. ఫలితాలు అంత బాగుంటాయి.
* వివాహం తర్వాత, పిల్లల కోసం..  జీవిత భాగస్వామికి బదిలీ ఇలా పలు సందర్భాల్లో మహిళలు తమ ఉద్యోగానికి కొంతకాలం విరామం ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటప్పుడూ ఆర్థిక ప్రణాళిక ఎంతో కీలకంగా మారుతుంది. సంపాదించేటప్పుడే.. కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకునేందుకు సరైన ప్రణాళిక తోడ్పడుతుంది.
* పురుషులతో పోలిస్తే మహిళల జీవిత కాలం ఎక్కువనేది వాస్తవం. అందుకే, దీనికి అనుగుణంగా మనకు పదవీ విరమణ ప్రణాళిక ఉండాలి. ఉద్యోగంలో ఉన్నా.. గృహిణి అయినా.. ఇది తప్పకుండా ఉండాలి. ముందునుంచే దీనికోసం కొంత పెట్టుబడిని కేటాయిస్తే.. మలి సంధ్య వేళ ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
* బీమా రక్షణ కోసం.. టర్మ్‌ పాలసీలను తీసుకోవడంతోపాటు.. పెట్టుబడుల కోసం యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలను ఎంచుకునే ప్రయత్నం చేయొచ్చు.
* ప్రణాళికలను వేసుకునేటప్పుడు అనుమానాలుంటే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

- రేష్మా బంద, హెడ్‌-ఈక్విటీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని