ఫ్లెక్సీక్యాప్‌.. ఆటుపోట్లను తట్టుకునేలా..

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడంలో ప్రధాన లక్ష్యం పెట్టుబడులు వైవిధ్యంగా ఉండేలా చూసుకోవడమే. ఇందులోనూ ఇప్పుడు మరింత వైవిధ్యంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తున్నాయి ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లు.

Updated : 25 Jun 2021 16:54 IST

మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడంలో ప్రధాన లక్ష్యం పెట్టుబడులు వైవిధ్యంగా ఉండేలా చూసుకోవడమే. ఇందులోనూ ఇప్పుడు మరింత వైవిధ్యంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తున్నాయి ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లు. లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లలో మదుపు చేస్తుంటాయి. మొత్తం పెట్టుబడుల్లో 65శాతం వరకూ ఈక్విటీలకు ఈ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లు కేటాయిస్తాయి. అన్ని రకాల ఫండ్లలోనూ మదుపు చేస్తాయి కాబట్టి, ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లు కాస్త దూకుడుగానే ఉంటాయని చెప్పొచ్చు. కానీ.. అన్ని రకాల షేర్లలో విస్తరిస్తాయి కాబట్టి, మార్కెట్‌ ఒడిదొడుకులను చాలా మేరకు తట్టుకుంటాయి.

దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, మదుపు చేసేటప్పుడు ఈక్విటీలు కీలక పాత్ర పోషిస్తాయి. లక్ష్యం వ్యవధి కనీసం పదేళ్లకు మించి ఉన్నప్పుడు.. మదుపరులు స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. లార్జ్‌ క్యాప్‌లతో పోలిస్తే వీటిలో కొంత నష్టభయం ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో లార్జ్‌ క్యాప్‌లకు పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవు. మార్కెట్‌ పతనం అవుతున్నప్పుడు ముందుగా ప్రభావం పడేది స్మాల్‌ క్యాప్‌, ఆ తర్వాత మిడ్‌ క్యాప్‌లపైనే అని చెప్పొచ్చు.

ఇలాంటి సవాళ్ల నేపథ్యంలో అన్ని రకాల మార్కెట్‌   క్యాప్‌ల షేర్లలో మదుపు చేసే ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లు ఇప్పుడు అనుకూలంగా మారుతున్నాయి. ఈ ఫండ్‌ మేనేజర్లకు మార్కెట్‌ దశలను బట్టి, స్మాల్‌, మిడ్‌ క్యాప్‌లకు పెట్టుబడులు పెంచడం తగ్గించడంలాంటి వెసులుబాట్లు ఉంటాయి.  ఇది  ఈ విభాగానికి కలిసొచ్చే అంశమే.

ఎందుకు?
ప్రస్తుతం మన మార్కెట్లు ఆశాజనకంగానే ఉన్నాయి. ఇవి మరికొన్నాళ్లు ఇలాగే కొనసాగుతాయని అంచనాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ వృద్ధి, కార్పొరేట్‌ ఆదాయాలు పెరగడంలాంటి సానుకూలతలూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్‌ నుంచి మంచి ఫలితాలు పొందేందుకు ఈ ఫండ్లు అవకాశాన్ని కల్పిస్తాయనుకోవచ్చు. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లు వృద్ధికి అవకాశం కల్పిస్తే.. లార్జ్‌క్యాప్‌లు నష్టభయాన్ని పరిమితం చేస్తుంటాయి. మార్కెట్‌ వృద్ధిలో వీటివల్ల మంచి రాబడికి ఆస్కారం ఉంటుంది.

ఈ ఫండ్లను అన్ని రకాల మార్కెట్‌ దశలనూ  తట్టుకునే వాటిగా వర్గీకరించవచ్చు. కాస్త ఫండ్లలో కాస్త తక్కువ నష్టభయం ఉండాలని కోరుకునే వారు.. దీర్ఘకాలిక లక్ష్యంతో వీటిని పరిశీలించవచ్చు.

- నియేశ్‌ సంఘీ, ఫౌండర్‌, వెల్త్‌ మున్షీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని