Updated : 24 Jul 2021 10:25 IST

10 శాతం రాబడి వస్తుందా?

మా అమ్మాయి వయసు 9 ఏళ్లు. తన పేరుతో ఏదైనా పెట్టుబడి ప్రారంభించి, నెలకు రూ.15 వేల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నాం. దీనికోసం పిల్లల బీమా పాలసీలు బాగుంటాయని చెబుతున్నారు. నిజమేనా? మ్యూచువల్‌ ఫండ్లలోనూ పిల్లల కోసం ప్రత్యేక పథకాలు ఉన్నాయా

  - రాజేంద్ర

ముందుగా మీ అమ్మాయి భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ విలువైన టర్మ్‌ పాలసీని తీసుకోండి. పిల్లల బీమా పాలసీలను తీసుకోవడం కన్నా.. రూ.15వేలలో సుకన్య సమృద్ధి యోజనలో నెలకు రూ.5వేలు కేటాయించండి. ఆ తర్వాత మిగిలిన రూ.10వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి. మ్యూచువల్‌ ఫండ్లలో పిల్లల కోసం ప్రత్యేక పథకాలున్నాయి. కానీ, వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వీటికన్నా సాధారణ డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవడమే ఉత్తమం.


నా వయసు 24 ఏళ్లు. నెలకు రూ.19వేల వరకూ వస్తున్నాయి. ఇందులో నుంచి రూ.5వేలను మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. మరో మూడేళ్ల తర్వాత ఈ డబ్బును వెనక్కి తీసుకోవాలనుకుంటే ఏ పథకాల్లో  పెట్టుబడి పెట్టాలి?

- రమేశ్‌

 స్వల్పకాలిక పెట్టుబడుల కోసం ఈక్విటీల్లో మదుపు చేయడం శ్రేయస్కరం కాదు. మీకు మూడేళ్ల వ్యవధి మాత్రమే ఉందంటున్నారు కాబట్టి, పెట్టుబడి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాను ప్రారంభించండి. భవిష్యత్‌లో ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే.. ఈ డిపాజిట్‌ను రద్దు చేసుకొని, ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.


నా వయసు 63 ఏళ్లు. పింఛను వస్తోంది. ఇందులో నుంచి నెలకు రూ.8 వేల వరకూ ఏదైనా పెట్టుబడి  పెట్టాలని భావిస్తున్నా. కనీసం 9-10 శాతం వరకూ రాబడి వచ్చేలా ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి

 - కృష్ణారావు

న దేశంలో సురక్షితమైన పెట్టుబడులపైన వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిపై 6శాతం వరకూ వడ్డీ వచ్చే అవకాశమే ఉంది. మీకు 9-10 శాతం వరకూ రాబడి రావాలంటే.. నష్టభయంతో కూడిన పథకాలను పరిశీలించాలి. అయితే, వీటికి కనీసం 5-7 ఏళ్ల వ్యవధినివ్వాలి. ఒకవేళ మీకు ఇది సాధ్యమైతే.. హైబ్రీడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను  పరిశీలించవచ్చు.


ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌లను ఎంచుకోవడం మంచిదేనా? నేను ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద  రూ.95వేల వరకూ మదుపు చేయాల్సి ఉంది. దీనికోసం ఏ పథకాలు మంచివి

 - రాంబాబు

దాయపు పన్ను మినహాయింపు కోసం వెసులుబాటు ఉన్న అన్ని పథకాలను గమనిస్తే.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలకు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) మాత్రమే మూడేళ్ల లాకిన్‌ వ్యవధి ఉంటుంది. ఇందులో నష్టభయం ఉంటుందని గమనించండి. దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగిస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మూడేళ్లపాటు క్రమం తప్పకుండా మదుపు చేసి, నాలుగేళ్ల తర్వాత.. మొదటి నెల పెట్టుబడిని వెనక్కి తీసుకొని, మళ్లీ మదుపు చేయొచ్చు. దీన్ని ఇలా కొనసాగిస్తూనే ఉండాలి. దీనివల్ల మీ జేబు నుంచి కొత్తగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మంచి పనితీరు గల రెండు ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలను ఎంచుకొని, మదుపు చేయండి.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts