Updated : 20 Aug 2021 04:32 IST

పాలసీల పునరుద్ధరణ వేళ..

సాధారణ బీమా పాలసీలన్నీ ఒక పరిమిత కాలం ఒప్పందంతో తీసుకుంటాం. ఈ పాలసీలు అమల్లో ఉండాలంటే.. ఏటా ప్రీమియం చెల్లించి, వాటిని పునరుద్ధరణ చేయించుకోవాల్సిందే. ఇదే సమయంలో మన పాలసీని ఒకసారి సమీక్షించుకునే వీలూ ఉంటుంది. ముఖ్యంగా వాహన, ఆరోగ్య బీమా పాలసీల పునరుద్ధరణ సమయంలో కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

వాహన బీమా...

* విలువ చూడాలి: వాహన బీమాను పునరుద్ధరణ చేసే సమయంలో వాహన వాస్తవ బీమా విలువ (ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్‌ వ్యాల్యూ-ఐడీవీ) ఎంత ఉందో చూసుకోవాలి. ఈ ఐడీవీ ఆధారంగానే ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది బీమా సంస్థ. వాహనానికి పూర్తి స్థాయిలో నష్టం జరిగితే ఎంత పరిహారం వస్తుందో అదే ఐడీవీ. అందుకే, ఇది వీలైనంత అధికంగానే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రీమియం తగ్గుతుందనే ఆలోచనతో ఐడీవీని తగ్గించుకోవద్దు. బీమా సంస్థల ప్రీమియాన్ని పోల్చి చూసేటప్పుడు ఐడీవీ ఎంత ఉందనేది జాగ్రత్తగా గమనించాలి. తక్కువ ఉన్నా ఇబ్బంది లేదు అని అనుకుంటే.. తర్వాత అనుకోకుండా క్లెయిం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, పాలసీని పునరుద్ధరణ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని పరిశీలించండి.

* బోనస్‌ ఎంత?: ఒక పాలసీ ఏడాదిలో ఎలాంటి క్లెయిం చేసుకోకపోతే.. నో క్లెయిం బోనస్‌ (ఎన్‌సీబీ)కి అర్హత ఉంటుంది. వరుసగా అయిదేళ్లపాటు ఎలాంటి క్లెయింలూ చేసుకోకపోతే.. బీమా సంస్థలు గరిష్ఠంగా 50శాతం వరకూ దీన్ని అందిస్తుంటాయి. మీరు చెల్లించే ప్రీమియంలో ఈ ఎన్‌సీబీని మినహాయిస్తారు. కాబట్టి, క్లెయిం లేని సంవత్సరంలో ఎన్‌సీబీని బీమా సంస్థ వర్తింపు చేస్తుందా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ గమనించాల్సిందేమింటే.. ఎన్‌సీబీ ఓన్‌ డామేజీ (ఓడీ) ప్రీమియంపైనే వర్తిస్తుంది. మొత్తం ప్రీమియం మీద రాయితీ కాదు. ఉదాహరణకు మీ మొత్తం ప్రీమియం రూ.1,000 ఉందనుకుందాం. ఇందులో థర్డ్‌ పార్టీ ప్రీమియం రూ.200. మిగతా రూ.800లు ఓన్‌ డామేజీ ప్రీమియం. అంటే.. రూ.800ల పైనే మీకు వచ్చే నో క్లెయిం బోనస్‌ వర్తిస్తుంది. చాలామంది ఈ ఎన్‌సీబీ మొత్తం ప్రీమియంపై వర్తిస్తుంది అని భావిస్తుంటారు. ఇది నిజం కాదు.

* అదనంగా: ప్రామాణిక బీమా పాలసీతోపాటు మోటార్‌ ఇన్సూరెన్స్‌లో కొన్ని అనుబంధ పాలసీలూ ఉంటాయి. ఇందులో కొన్ని వాహనానికి సంబంధించి పూర్తి రక్షణ కల్పిస్తాయి. ఇంజిన్‌ ప్రొటెక్టర్‌ కవర్‌, సున్నా తరుగుదల, నో క్లెయిం బోనస్‌ ప్రొటెక్టర్‌లాంటివి ఎంచుకోవచ్చు. అయితే, ఇందులో కొన్ని వాహనం వయసును బట్టి రాకపోవచ్చు. అనుబంధ పాలసీల వల్ల వాహనానికి అదనపు బీమా రక్షణ లభిస్తుంది.

బీమా పాలసీ ఏదైనా సరే... సకాలంలో ప్రీమియం చెల్లించడం ఎప్పుడూ ముఖ్యమే. లేకుండా కొన్ని ప్రయోజనాలు దూరం అయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాహన, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియంలో ఆలస్యం చేస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయి. నిబంధనల మేరకు వాహన బీమా ఒక్క నిమిషం కూడా బీమా పాలసీ లేకుండా రోడ్డు మీదకు రాకూడదు. ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం చెల్లించకపోతే.. నిబంధనల మేరకు కొన్ని రోజుల వ్యవధినిస్తాయి బీమా సంస్థలు. అప్పటికీ చెల్లించకపోతే.. ఆ పాలసీ రద్దవుతుంది. అప్పుడు పాలసీ మళ్లీ కొత్తగా తీసుకోవాల్సి రావచ్చు. దీనివల్ల వేచి ఉండే వ్యవధి తిరిగి ప్రారంభం అవుతుంది. కాబట్టి, ఈ విషయంలో నిర్లక్ష్యం తగదు. బీమా సంస్థలు పాలసీ పునరుద్ధరణకు సంబంధించి చాలా ముందు నుంచే సమాచారం ఇస్తుంటాయి. కాబట్టి, పాలసీదారుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి.


ఆరోగ్య బీమా...

* సరిపోతుందా?: ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు సరిపోతుందిలే అనుకున్న మొత్తం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువగా కనిపించవచ్చు. వైద్య చికిత్స ఖర్చులు పెరగడం, కరోనా తదితర కారణాల వల్ల ఇప్పుడు ఈ మొత్తాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. పాలసీని పునరుద్ధరణ సమయంలో దీన్ని మరోసారి ఆలోచించండి. బీమా సంస్థలు పాలసీ మొత్తాన్ని పెంచుకునే అవకాశం కల్పిస్తుంటాయి. మీ వీలును బట్టి, దీన్ని ఉపయోగించుకోండి.

* టాపప్‌ ప్లాన్‌తో..: మీ ఆరోగ్య బీమా పాలసీ సరిపోయేంత మొత్తం లేకపోతే.. టాపప్‌ ప్లాన్లను తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. తక్కువ మొత్తంతో ప్రాథమిక పాలసీకి అదనపు భరోసా ఈ పాలసీలతో పొందవచ్చు. ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల టాపప్‌ పాలసీలు లభిస్తున్నాయి. ప్రాథమిక పాలసీ విలువ పూర్తయ్యాక ఈ టాపప్‌ పాలసీలు ఉపయోగపడతాయి. ప్రాథమిక పాలసీ ఎక్కడ ఉంది అనేదానితో సంబంధం లేకుండా ఈ టాపప్‌ పాలసీలను వేరే బీమా సంస్థల నుంచీ కొనుగోలు చేసేందుకు వీలుంది.

* వివరాలు తెలియజేయండి: ఆరోగ్య బీమా పాలసీ పునరుద్ధరణ చేసుకునేటప్పుడు మీకు కొత్తగా ఏదైనా అనారోగ్యం వస్తే.. ఆ వివరాలు బీమా సంస్థకు తెలియజేయండి. ముఖ్యంగా బీపీ, మధుమేహంలాంటివి వచ్చినప్పుడు పాలసీ పునరుద్ధరణ సమయంలో చెప్పండి. దీనివల్ల క్లెయిం సమయంలో ఇబ్బంది రాకుండా ఉంటుంది.

- టీఏ రామలింగం, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts