నెలకు రూ.10వేలు.. ఎలా సాధ్యం?

నేను 10 ఏళ్ల క్రితం ఎండోమెంట్‌ పాలసీని తీసుకున్నాను. ఏడాదికి రూ.20వేలు ప్రీమియం. మూడేళ్ల నుంచి ఈ పాలసీకి ప్రీమియం చెల్లించడం లేదు. ఇప్పుడు ఈ పాలసీని పూర్తిగా రద్దు చేసుకోవచ్చా? ప్రీమియం చెల్లించి తిరిగి పునరుద్ధరించుకోవడం మంచిదా?

Updated : 11 Feb 2022 05:56 IST

నేను 10 ఏళ్ల క్రితం ఎండోమెంట్‌ పాలసీని తీసుకున్నాను. ఏడాదికి రూ.20వేలు ప్రీమియం. మూడేళ్ల నుంచి ఈ పాలసీకి ప్రీమియం చెల్లించడం లేదు. ఇప్పుడు ఈ పాలసీని పూర్తిగా రద్దు చేసుకోవచ్చా? ప్రీమియం చెల్లించి తిరిగి పునరుద్ధరించుకోవడం మంచిదా?

- మణి

సాధారణంగా ఎండోమెంట్‌ పాలసీలకు మూడేళ్ల తర్వాత స్వాధీన విలువ లభిస్తుంది. మీరు పాలసీ తీసుకొని ఏడేళ్లు అయ్యిందంటున్నారు కాబట్టి, దీన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. పాలసీని స్వాధీనం చేసినప్పుడు.. మీరు ఇప్పటివరకూ చెల్లించిన ప్రీమియం లేదా అంతకన్నా తక్కువా రావచ్చు. మీ బీమా సంస్థను సంప్రదించండి. జీవిత బీమా రక్షణ దూరం కాకుండా.. మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోండి. పెట్టుబడి కోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల బీమా రక్షణ, పెట్టుబడి ప్రయోజనం రెండూ లభిస్తాయి.

* నా వయసు 57. ప్రైవేటు ఉద్యోగిని. త్వరలో పదవీ విరమణ చేయబోతున్నాను. నేను ఇప్పుడు టర్మ్‌ పాలసీ తీసుకునేందుకు వీలవుతుందా? నెలకు రూ.10వేలు పింఛను వచ్చేలా ఎంత మొత్తం మదుపు చేయాల్సి ఉంటుంది?

- కృష్ణ

మీకు 57 ఏళ్లు ఉన్నప్పటికీ.. టర్మ్‌ పాలసీ తీసుకునే వెసులుబాటు ఉంది. దరఖాస్తు పూర్తి చేసేటప్పుడు మీరు మీ ఆరోగ్య, ఆర్థిక వివరాలను తప్పుల్లేకుండా పేర్కొనండి. ఆరోగ్య పరీక్షల అవసరం ఉంటుంది. ఆ నివేదికల ఆధారంగా బీమా సంస్థలు పాలసీ విషయంపై నిర్ణయం తీసుకోవచ్చు. ఇక పింఛను కోసం పదవీ విరమణ చేసిన తర్వాత పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను పరిశీలించవచ్చు. ఇందులో 7.4శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ మదుపు చేయొచ్చు. మూడు నెలలకోసారి రూ.27,750 వస్తాయి. దీని వ్యవధి అయిదేళ్లు. ఇక నెలకు రూ.10వేలు కచ్చితంగా రావాలి అనుకుంటే.. వెంటనే పింఛను అందించే ఇమ్మీడియట్‌ యాన్యుటీ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇందులో 6 శాతం యాన్యుటీ ఇచ్చే పథకాల్లో రూ.20లక్షలు మదుపు చేయాలి. 7 శాతం ఇచ్చే పథకాల్లో రూ.17,15,000 పెట్టుబడి పెట్టాలి.

* మా అమ్మాయి వయసు 14. తనకు ఆరేడేళ్ల తర్వాత ఉపయోగపడేలా ఒకేసారి రూ.5లక్షల వరకూ మదుపు చేయాలని ఆలోచన. డబ్బు రెట్టింపు అయ్యేలా ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

- ఉమాదేవి

మీరు పెట్టే పెట్టుబడి అమ్మాయి భవిష్యత్తుకు ఉపయోగపడాలి. దీనికోసం మార్కెట్‌ ఆధారిత పథకాలను ఎంచుకోవడం మేలు. ఇందులో కాస్త నష్టభయం ఉంటుంది. దీర్ఘకాలంలో మీ డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువ. దీనికి మీరు.. హైబ్రీడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించండి. మీరు రూ.5లక్షలను ఏడేళ్లపాటు మదుపు చేస్తే... సగటున 11 శాతం రాబడితో రూ.10,38,000 అయ్యేందుకు అవకాశం ఉంది. పథకాల పనితీరును అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండండి.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని