Published : 15 Apr 2022 01:16 IST

పొదుపు ఖాతా.. రుసుములు పట్టించుకోండి

ఆర్థికంగా మొదటి అడుగు పడేది పొదుపు ఖాతా ప్రారంభంతోనే. బ్యాంకింగ్‌ వ్యవస్థతో పరిచయం మొదలు.. పెట్టుబడులు.. ఇతర అన్ని ఆర్థిక లావాదేవీలూ ఇక్కడి నుంచే నిర్వహిస్తుంటాం. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం కార్డుల వాడకం, చెక్కు బుక్కులు.. ఇలా ఎన్నో అలవాటవుతాయి. కొంతమందికి నాలుగైదు బ్యాంకుల పొదుపు ఖాతాలూ ఉంటాయి. చాలామంది పొదుపు ఖాతాను ప్రారంభించేటప్పుడు ఆ బ్యాంకులో పొదుపు ఖాతాపై అందిస్తున్న వడ్డీ ఎంత, కనీస నిల్వ ఎంత ఉండాలి? ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి.. ఇలాంటివే చూస్తుంటారు. కానీ, బ్యాంకు అందించే సేవలపై విధించే రహస్య రుసుముల గురించి పట్టించుకోరు. పొదుపు ఖాతా నిర్వహించేటప్పుడు వీటినీ కాస్త చూసుకోవాలి.

నం బ్యాంకులో పొదుపు ఖాతా ప్రారంభించేటప్పుడే.. దానికి సంబంధించిన నియమ నిబంధనలను బ్యాంకు మనకు తెలియజేస్తుంది. వాటిని ఒకసారి పరిశీలించాలి. సాధారణంగా వీటిని చూడకుండానే సంతకాలు పెట్టేస్తుంటాం. ఇది సరికాదు. బ్యాంకులను బట్టి, ఈ నిబంధనలు మారుతుంటాయని మర్చిపోవద్దు. ముఖ్యంగా మీరు తరచూ నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌, డెబిట్‌ కార్డు లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటే.. బ్యాంకు వీటికి విధించే రుసుముల గురించి ముందుగానే తెలుసుకోవాలి.

లావాదేవీలు చూసుకున్నారా?

చాలామంది నెలనెలా తమ బ్యాంకు ఖాతా లావాదేవీల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక నెల, మూడు నెలలు, ఏడాది కాలంలో జరిగిన అన్ని లావాదేవీల గురించి బ్యాంకు ఖాతా వివరాల ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి, క్రమం తప్పకుండా మీ ఖాతా లావాదేవీలను పరిశీలించండి. ఏదైనా తేడా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించి, ఆ వివరాలను అడిగి తెలుసుకోవాలి. మీ ఖాతా నుంచి రూపాయి డెబిట్‌ అయినా.. అది స్టేట్‌మెంట్లో తెలిసిపోతుంది. రుసుములు విధించినా సులువుగానే అర్థం అవుతుంది. నెలాఖరున ఒకసారి అకౌంట్‌ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేసుకోవడం ఒక అలవాటుగా మారాలి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లేదా మొబైల్‌ యాప్‌ నుంచే ఈ వివరాలు చూసేందుకు వీలుంది.

బ్యాంకు రకరకాల రుసుములు విధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిర్ణీత సంఖ్యకు మించి నగదును జమ చేసినా, నగదును వెనక్కి తీసుకున్నా రుసుములు తప్పవు. కొన్ని బ్యాంకులు దీన్ని నెలకు మూడు సార్లకు పరిమితం చేశాయి. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి తరచూ డబ్బు తీస్తుంటే.. రుసుములు తప్పకపోవచ్చు.

పొదుపు ఖాతాలో కనీస నిల్వ ఉండాలి. వేతనం క్రెడిట్‌ అయ్యే ఖాతాలకు కనీస నిల్వ నిబంధన ఉండదు. ఇతర బ్యాంకుల్లో కొన్ని రుసుములు తప్పించుకునేందుకు  కనీస జమ తప్పనిసరి. కొన్ని నెలవారీ సగటు నిల్వను లెక్కిస్తే.. కొన్ని త్రైమాసిక నిల్వను పరిగణిస్తాయి. పొదుపు ఖాతాను ప్రారంభించే సమయంలో కనీస నిల్వ ఎంత ఉండాలి అన్నది తప్పనిసరిగా చూసుకోండి. చెక్కుబుక్కు, ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ, ఏటీఎం కార్డు, చెక్కు బౌన్స్‌ ఛార్జీలు, బ్యాంకు స్టేట్‌మెంట్‌ రుసుములు, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ రుసుములు విధిస్తుంటే వాటిని తప్పించుకునేందుకు ఎంత నిల్వ ఉండాలో బ్యాంకును అడిగి తెలుసుకోండి. డెబిట్‌ కార్డును విదేశాల్లో వాడినప్పుడు కరెన్సీ కన్వర్షన్‌ ఫీజునూ బ్యాంకులు వసూలు చేస్తాయి.


సమాచారం తెలుసుకోండి...

బ్యాంకు విధించే రుసుముల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉంటాయి. అయినప్పటికీ.. వీలైనప్పుడల్లా బ్యాంకు వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఏదైనా కొత్త రుసుములను ప్రకటించారా అన్నది చూస్తూ ఉండాలి. రుసుములకు సంబంధించిన వివరాలు మీ ఫోనులో జాగ్రత్త చేసుకోవచ్చు. మీకు వర్తించే, వర్తించని రుసుముల గురించి పూర్తి అవగాహన ఉండాలి.

సంబంధం లేని రుసుములు విధించినట్లు గమనిస్తే.. వెంటనే ఆ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలి. దాన్ని సరిచేసి, వసూలు చేసిన రుసుమును వెనక్కి ఇవ్వాలని కోరాలి. మీ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత బ్యాంకులు తగిన చర్య తీసుకుంటాయి.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని