గృహ రుణానికి సిద్ధమవ్వండి ఇలా..

సొంత ఇల్లు కొనుగోలు జీవితంలోని అత్యద్భుత ఘట్టం. ఈ బృహత్కార్యం తలపెట్టేముందు ఆర్థికంగా, మానసికంగా సంసిద్ధమవ్వడం అత్యంత అవసరం. ఇంటి కోసం ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టలేనివారు సాధారణంగా బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. బ్యాంకులు సైతం ఇంటి

Published : 18 Dec 2020 19:44 IST

సొంత ఇల్లు కొనుగోలు జీవితంలోని అత్యద్భుత ఘట్టం. ఈ బృహత్కార్యం తలపెట్టేముందు ఆర్థికంగా, మానసికంగా సంసిద్ధమవ్వడం అత్యంత అవసరం. ఇంటి కోసం ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టలేనివారు సాధారణంగా బ్యాంకు రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. బ్యాంకులు సైతం ఇంటి కొనుగోలుదారులకు రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గృహరుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసేముందు ఎలా సిద్ధమవ్వాలో చూద్దాం. ఆర్‌బీఐ సూచనల మేరకు మొత్తం గృహ నిర్మాణానికయ్యే ఖర్చులో 80శాతానికి మించి రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులకు అవకాశం లేదు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందేమిటంటే డౌన్‌పేమెంట్‌ కోసం 20శాతం సొమ్మును జమచేసుకొని ఉంచుకోవాలి. ఉదాహరణకు రూ.40లక్షల ఇల్లు కొనుగోలు చేయాలంటే రూ.8లక్షల డౌన్‌పేమెంట్‌ దగ్గరుంచుకోవాలి.

అప్పులు తీర్చేయండి:

గృహరుణానికి దరఖాస్తు చేసేముందు చిన్న చిన్న అప్పులు, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు, ఇతర బాకీలుంటే తీర్చేయడం మంచిది. భవిష్యత్తులో ఎక్కువ సొమ్ము గృహ రుణ వాయిదాలకే కేటాయించాల్సి వస్తుంది కాబట్టి అదనపు అప్పులు మరింత భారమవుతాయి.

క్రెడిట్‌ స్కోరు పెంచుకోండి:

బ్యాంకులు రుణాలు మంజూరు చేసేముందు వ్యక్తిగత క్రెడిట్‌ స్కోరును చూస్తాయి. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉండి రుణం తిరస్కరణకు గురికాకముందే మీరే స్వయంగా క్రెడిట్‌ స్కోరు కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది. తక్కువ స్కోరు ఉంటే దాన్ని పెంచుకునేందుకు వివిధ అవకాశాలను పరిశీలించండి. క్రెడిట్‌ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించడం, బ్యాంకు లావాదేవీలను తరచూ చేయడం లాంటివన్నీ క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకు దోహదం చేస్తాయి.

డౌన్‌పేమెంట్‌ కోసం సొమ్ము జమచేసుకోండి:

డౌన్‌పేమెంట్‌ కోసం ముందు నుంచే సిద్ధమవ్వాలి. సాధారణ వేతన జీవులకు రూ.10లక్షలు జమచేసుకునేందుకు మూడు లేదా నాలుగేళ్ల సమయం పడుతుంది. వివిధ ఈక్విటీ, డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారానో, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం ద్వారానో ఈ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. ఇది వరకే పెట్టుబడులు కొనసాగిస్తూ డౌన్‌పేమెంట్‌ కోసం సిద్ధమైనట్టు భావిస్తే… వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టినవారు వాటిని నగదుగా మార్చుకునే ప్రక్రియను ప్రారంభించాలి. ఇందుకోసం మొదటగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, షేర్లు, బాండ్లు, ఈక్విటీ, డెట్‌ ఫండ్లలోని సొమ్మును నగదుగా మార్చుకొని పెట్టుకోవాలి. ఈ మొత్తం సొమ్ము సరిపోదని భావిస్తే పీపీఎఫ్‌పై రుణం పొందొచ్చు లేదా పాక్షికంగా కొంత సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎండోమెంట్‌, యూలిప్స్‌ లాంటి పాలసీలుంటే వాటిపై రుణం కూడా పొందొచ్చు. ఇవన్నీ సరిపోకపోతే స్వల్ప మొత్తంలో స్నేహితుల దగ్గర అప్పు చేయవచ్చు. తల్లిదండ్రులు, బంధువులు బహుమతి రూపంలో ఇచ్చే బంగారం, స్థిరాస్తిని నగదుగా మార్చుకోవచ్చు.

బ్యాంకు రుణాలపై పరిశోధించండి:

గృహరుణం కోసం ఏ బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకోవడమూ ముఖ్యమే. తక్కువ వడ్డీ రేట్లు మాత్రమే మంచి ప్రామాణికంగా భావించవద్దు. గృహరుణం చెల్లించే కాలవ్యవధికి వడ్డీ రేట్లకు మధ్య సంబంధాన్ని పరిశీలించాలి. కొన్ని బ్యాంకులు ముందస్తు రుణచెల్లింపులకు అంగీకరించవు. ఆయా బ్యాంకులు రుణం ఇచ్చాక వర్తింపజేసే నియమనిబంధనల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి.

వాయిదాలను చెల్లించేందుకు సిద్ధం అవ్వండి:

గృహరుణం కోసం చెల్లించే వాయిదాలు రుణగ్రహీత నెలవారీ ఆదాయంలో 40శాతానికి మించకుండా ఉండాలి. ఈ అంశాన్ని పరిశీలనలోనికి తీసుకొని గృహరుణం కోసం దరఖాస్తు చేసుకునేవారు వాయిదా చెల్లించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి. నెలవారీ ఖర్చులను తగ్గించుకోవడమో లేదా ఆదాయాన్ని పెంచుకోవడమో చేయాలి. ఒక వేళ జీవితభాగస్వామి సంపాదిస్తున్నట్టయితే వారితో కలిసి ఉమ్మడిగా రుణం తీసుకోవడం మంచిది.

కావలసిన ముఖ్యమైన పత్రాలను అందుబాటులో ఉంచుకోండి:

గృహరుణానికి దరఖాస్తు చేసుకునేముందు అవసరమైన అన్ని గుర్తింపు, చిరునామా, పాన్‌ కార్డు పత్రాలను దగ్గరుంచుకోవాలి. ఇంటి ప్లాను, ప్లాటు వివరాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, పనిచేసే సంస్థ వివరాలు, ఇటీవలి వేతన పత్రం లాంటివన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి.

సొంత ఇల్లు కొనుగోలు ఒక్క రోజులో జరిగే పనికాదు. దీర్ఘకాలంపాటు కష్టపడి పెట్టుబడి పెడితే కానీ ఇది సాధ్యంకాదు. గృహరుణ వాయిదాలను చెల్లించే క్రమంలో ఎన్నో ఇతర ఆర్థిక ప్రణాళికలను కుదించుకోవడం, ముందుకుజరపడమో చేయాల్సి ఉంటుంది. రుణ వాయిదాలను చెల్లిస్తూనే మరో పక్క అత్యవసరాలకు కొంత సొమ్మును దాచిపెట్టుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని