పాలసీ ఇప్పిస్తుంది అప్పు!

అత్యవసరాల్లో ఎంతటివారికైనా అప్పు చేయక తప్పని పరిస్థితి. ఒకప్పడు రుణం దొరకడం అంటే ఎంతో కష్టం. కానీ, ఇప్పుడు క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాల పేరుతో అనుకున్న వెంటనే అప్పు చేయడం సులభం అయ్యింది. ఏదైనా హామీగా చూపించి రుణం పొందడం మరీ తేలిక

Published : 18 Dec 2020 22:09 IST

అనుకోని కష్టంలో ఆదుకునేది బీమా పాలసీ. కేవలం ఆ ఒక్క సమయంలోనే కాదు.. ఏదైనా అవసరం వచ్చినప్పుడూ వీటిని తాకట్టు పెట్టి రుణం తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి.

అత్యవసరాల్లో ఎంతటివారికైనా అప్పు చేయక తప్పని పరిస్థితి. ఒకప్పడు రుణం దొరకడం అంటే ఎంతో కష్టం. కానీ, ఇప్పుడు క్రెడిట్‌ కార్డులు, వ్యక్తిగత రుణాల పేరుతో అనుకున్న వెంటనే అప్పు చేయడం సులభం అయ్యింది. ఏదైనా హామీగా చూపించి రుణం పొందడం మరీ తేలిక. మీ దగ్గరున్న బీమా పాలసీల పత్రాలతోనూ సులువుగా రుణం పొందేందుకు వీలుందని మీకు తెలుసా?

అనుకోని కష్టంలో ఆదుకునేది బీమా పాలసీ. కేవలం ఆ ఒక్క సమయంలోనే కాదు… ఏదైనా అవసరం వచ్చినప్పుడూ వీటిని తాకట్టు పెట్టి రుణం తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి. కేవలం బీమా సంస్థలతోపాటు…బ్యాంకులు, బ్యాంకింగేతర రుణ సంస్థల్లోనూ వీటిని హామీగా చూపించి అప్పు తీసుకోవచ్చు. కేవలం నామమాత్రపు కొన్ని లాంఛనాలు పూర్తి చేయడం ద్వారా సులభంగా రుణం పొందేందుకు వీలవుతుంది.

అన్ని పాలసీలకూ ఇస్తారా?
స్వాధీన విలువ ఉన్న పాలసీలన్నింటికీ ఈ రుణం తీసుకోవచ్చు. టర్మ్‌ బీమా పాలసీలకు ఎలాంటి స్వాధీన విలువ ఉండదు. కాబట్టి, వాటిని తనఖా పెట్టడం సాధ్యం కాదు. యూనిట్‌ ఆధారిత పాలసీలను కూడా బ్యాంకులు అంగీకరించవు. ఎండోమెంట్‌ పాలసీలు, మనీ బ్యాక్‌ పాలసీలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.

వడ్డీ ఎంతుంటుంది?
పాలసీలను తాకట్టు పెట్టుకొని ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ బ్యాంకులను బట్టి మారుతుంది. సాధారణ వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇది తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. కొన్ని బ్యాంకులు 12శాతం వసూలు చేస్తుండగా… మరికొన్ని 13.5శాతం వరకూ వసూలు చేస్తున్నాయి. ముందుగానే రెండుమూడు బ్యాంకులను సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మేలు. పరిశీలన/నిర్వహణ రుసుములు కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.

అప్పు తీర్చకపోతే…
మీరు తీసుకున్న అప్పు తీర్చకపోతే బ్యాంకు మీరు పాలసీ తీసుకున్న జీవిత బీమా సంస్థ నుంచి బాకీ మొత్తాన్ని తీసేసుకుంటుంది. రుణం తీరిన తర్వాత ఏదైనా మొత్తం మిగిలితే అది మీకు ఇచ్చేస్తారు.

వ్యవధి ఎంత?
రుణం ఎంత వ్యవధికి తీసుకోవాలన్నది రుణదాత, రుణ గ్రహీతల మధ్య ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. అయితే, పాలసీ వ్యవధికి మించి రుణ వ్యవధిని అంగీకరించరు. కనీస వ్యవధి 6 నెలలు ఉంటుంది.

గడువుకు ముందే చెల్లిస్తే…
దాదాపు అన్ని బ్యాంకులూ గడువుకు ముందే రుణాన్ని చెల్లించే వెసులుబాటు కల్పిస్తాయి. దీనికోసం అదనపు రుసుములు కూడా ఏమీ విధించడం లేదు. అయితే, కొన్ని బీమా సంస్థలు నామమాత్రపు రుసుములు విధిస్తున్నాయి. కాబట్టి, రుణం తీసుకునేప్పుడు బ్యాంకు నుంచి తీసుకోవాలా? బీమా సంస్థ నుంచి తీసుకోవాలా? అన్నది దీన్ని బట్టి కూడా నిర్ణయించుకోవాలి.

ఎప్పుడు ఇస్తారు?
బీమా పత్రాలను హామీగా పెట్టి రుణం తీసుకోవాలంటే… ఆ పాలసీకి స్వాధీన విలువ రావాలి. అంటే, కనీసం మూడేళ్లపాటు వరుసగా ప్రీమియం చెల్లించి ఉండాలి. 
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది… బీమా లక్ష్యం… బీమా తీసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడం. ఒకవేళ పాలసీదారుడు పాలసీని తాకట్టుపెట్టి, రుణం తీసుకున్నాడనుకుందాం. అప్పు తీరకుండానే అతనికి ఏదైనా జరిగితే… అతని కుటుంబానికి పూర్తి పాలసీ మొత్తం అందే అవకాశం ఉండకపోవచ్చు. ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని, ఆ తర్వాతే బీమా పాలసీలపై అప్పు తీసుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని