స్వల్ప కాలిక రుణాలను పొందడం ఎలా?

ఒకవేళ మీ నెలవారీ జీతం పొందడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో ప్రస్తుతం మీరు తాత్కాలిక ద్రవ్య లోటులో ఉన్నారనుకుందాం. తక్కువ సమయానికి గాను, మీ చిన్న అవసరం కోసం దీర్ఘకాలిక రుణాన్ని తీసుకోవాలని మీరు అనుకోవడం లేదు. అలాగే దాని కోసం నెలలు పాటు

Published : 19 Dec 2020 18:28 IST

ఒకవేళ మీ నెలవారీ జీతం పొందడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో ప్రస్తుతం మీరు తాత్కాలిక ద్రవ్య లోటులో ఉన్నారనుకుందాం. తక్కువ సమయానికి గాను, మీ చిన్న అవసరం కోసం దీర్ఘకాలిక రుణాన్ని తీసుకోవాలని మీరు అనుకోవడం లేదు. అలాగే దాని కోసం నెలలు పాటు ఈఎంఐలను చెల్లించాలని కూడా మీరు భావించడం లేదు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు లేదా క్రెడిట్ చరిత్ర లేని వ్యక్తి అయితే, ఈ పరిస్థినిని ఎదుర్కోడానికి ఏమి చేస్తారు? దీని కోసం స్వల్ప కాలిక రుణాలను తీసుకోవడం సరైన పరిష్కారం.

స్వల్ప కాలిక రుణం తీసుకోండి:

చిన్న అవసరాలకు స్వల్పకాలిక రుణాలు సరైనవి. స్వల్పకాలిక రుణాలు వ్యక్తిగత రుణాల రూపంలో ఉంటాయి కానీ వ్యక్తిగత రుణాల మాదిరిగా కాకుండా, చిన్న టికెట్ పరిమాణంలో తక్కువ కాల వ్యవధితో ఉంటాయి. వీటిని పంపిణీ చేయడం చాలా సులభం. ఇవి దరఖాస్తులు లేకుండానే లభిస్తాయి. దీని కోసం రుణగ్రహీత మంచి క్రెడిట్ చరిత్రను కలిగి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ రుణాలు సాధారణంగా అంత సురక్షితమైనవి కావు. అలాగే మీరు పెద్ద మొత్తం కోసం చూస్తే తప్ప వీటి కోసమైతే హామీలు సమర్పించాల్సిన అవసరం కూడా లేదు.

స్వల్పకాలిక రుణాలు, తక్కువ సమయం:

స్వల్పకాలిక రుణాలు చిన్న పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా మీరు కనీసం రూ. 50,000 నుంచి రూ.1 లక్ష మొత్తాన్ని వ్యక్తిగత రుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ అవసరం కేవలం రూ. 10,000 అయితే అప్పుడు స్వల్పకాలిక రుణాలు మీ అవసరాలకు సరిగ్గా సరిపోతాయి. మీరు చిన్న మొత్తాన్ని రుణంగా తీసుకుని, త్వరగా తిరిగి చెల్లించవచ్చు. ఒకవేళ మీకు డబ్బు అవసరం లేకపోతే రుణాన్ని పొందకుండా ఉండడం మంచిది. ఒక వ్యక్తిగత రుణం ఒకటి నుంచి ఐదు సంవత్సరాల కాలవ్యవధితో లభిస్తుంది. అదే స్వల్పకాలిక రుణాల విషయంలో మాత్రం కాలవ్యవధి 15 రోజుల నుంచి కొద్ది నెలలు వరకు మాత్రమే ఉంటుంది.

త్వరగా రుణ పంపిణీ, తక్కువ పేపర్ వర్క్:

ప్రస్తుత రోజుల్లో వ్యక్తిగత రుణాలు పొందడం చాలా సులభం. మీరు ఇప్పటికే మీ క్రెడిట్ చరిత్ర, తిరిగి చెల్లింపు రికార్డుల ఆధారంగా ఏదైనా బ్యాంకు నుంచి రుణాన్ని పొంది ఉండవచ్చు. వ్యక్తిగత రుణాల మాదిరిగానే స్వల్పకాలిక రుణాలను కూడా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా త్వరగా రుణం లభిస్తుంది. దీని కోసం మీ పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్స్, చిరునామా రుజువు, గత మూడు నెలల జీతం స్లిప్ లు, యజమాని ఐడీ వంటివి అవసరం. ఒకసారి మీ దరఖాస్తును ప్రాసెస్ చేసిన తర్వాత కేవలం ఒక రోజు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే స్వల్ప కాలిక రుణాన్ని పంపిణీ చేస్తారు.

క్రెడిట్ స్కోరు ముఖ్యం:

మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు, రుణదాత మీ క్రెడిట్ స్కోర్ ను పరిశీలిస్తాడు. గతంలో మీరు తీసుకున్న రుణాలను, క్రెడిట్ కార్డులను ఎలా నిర్వహించారో పరిశీలించి, మీ విశ్వసనీయతను అంచనా వేస్తారు. ప్రస్తుతం బ్యాంకులు లేదా ఇతర నాన్ బ్యాంకింగ్ సంస్థలు క్రెడిట్ స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే అత్యుత్తమ రుణ ఆఫర్లు అందిస్తున్నాయి. అయినప్పటికీ, మంచి క్రెడిట్ స్కోరు లేని వారు చాలామంది ఉన్నారు, ఎందుకంటే వారు ఇప్పటి వరకు ఎలాంటి రుణం లేదా క్రెడిట్ కార్డును తీసుకుని ఉండరు. అలాగే మరికొందరు తీసుకున్న రుణాలను సరైన సమయానికి చెల్లించడంలో విఫలమై ఉండవచ్చు. ఇటువంటి సందర్భాల్లో, స్వల్పకాలిక రుణదాతలు, రుణగ్రహీత విశ్వసనీయతను గుర్తించేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తారు. ఉదాహరణకు, కొందరు రుణదాతలు మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను పరిశీలించి మీ విశ్వసనీయతను విశ్లేషించవచ్చు.

ఆదాయం, వయస్సు అర్హత:

చాలా స్వల్పకాలిక రుణదాతలు వారి అర్హతలకు తగిన వారికే రుణాలను అందిస్తుంటారు. ఉదాహరణకు, రుణగ్రహీత 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, నెలకు కనీసం రూ. 18,000 జీతం సంపాదిస్తూ ప్రస్తుత ఉద్యోగంలో కనీసం ఒక నెల పూర్తి చేసి ఉండాలని కొందరు రుణదాతలు భావిస్తారు. ఈ ప్రమాణాలు ఒక్కో రుణదాతకు ఒక్కోలా మారుతూ ఉంటాయి.

వడ్డీ రేటు:

స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటు వ్యక్తిగత రుణాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది సుమారు 20 శాతం నుంచి 40 శాతం మధ్య ఉంటుంది. వీటిని క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లతో పోల్చవచ్చు. ఏదేమైనా, రుణ కాలపరిమితి తక్కువగా ఉండటం వలన మీరు చెల్లించే పూర్తి వడ్డీ తక్కువగానే ఉంటుంది. రుణంపై ప్రాసెసింగ్ రుసుములు ఉండవచ్చు, దానిని మీకు పంపిణీ చేసే రుణ మొత్తం నుంచి వెంటనే వెనక్కి తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని