రుణం...ఇవన్నీ చూసాకే!

ఇల్లు కొనడం అంటే…జీవితం లో ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించినట్లే. సొంతింటి కలను నిజం చేసుకోవడానికి చాలా మంది గృహ రుణాలనే ఆశ్రయిస్తారు. చాలా మంది వడ్డీ రేట్లనే ప్రామాణికంగా రుణం తీసుకోవాలనే నిర్ణయానికి వస్తుంటారు. నిజానికి వడ్డీ రేట్ల కన్నా గమనించాల్సిన విషయాలు

Published : 22 Dec 2020 18:53 IST

ఇల్లు కొనడం అంటే…జీవితం లో ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించినట్లే. సొంతింటి కలను నిజం చేసుకోవడానికి చాలా మంది గృహ రుణాలనే ఆశ్రయిస్తారు. చాలా మంది వడ్డీ రేట్లనే ప్రామాణికంగా రుణం తీసుకోవాలనే నిర్ణయానికి వస్తుంటారు. నిజానికి వడ్డీ రేట్ల కన్నా గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. రుణమేదైనా సరే…తీసుకునే ముందు దాని అవసరం ఏంటి? ఎంత వరకూ దాన్ని భరించగలం? నెలసరి వాయిదాలను చెల్లించడం వల్ల కొత్తగా వచ్చే ఆర్ధిక భారం ఎంత? తదితర అంశాలను పరిశీలించాలి. ముఖ్యంగా గృహ రుణం ఒక దీర్ఘకాలిక అప్పు. జీవితం లో సింహ భాగాన్ని దీన్ని తీర్చడానికే ఖర్చు చేయాలి. ఇంత కాలం పాటు మన మీద ఆ రుణం చూపే ప్రభావాన్ని తెలుసుకున్నాకే…సొంతింటి కలను తీర్చుకునేందుకు గృహ రుణం కోసం ముందడుగు వేయాలి.

ప్రభావం ఏంటి?

సంపాదించే మొత్తం లో గృహం రుణం వాయిదాలకు ఎంత చెల్లించాల్సి వస్తుందనేది ముందుగా తెలుసుకోవాలి. మిగిలిన మొత్తం తో మన ముందున్న లక్ష్యాలు, ఇతర బాధ్యతలు ఎలా తీర్చుకోగలమో ఒక అంచనాకు రావాలి. అప్పుడే ఎంత ఈఎంఐ వరకు మనం భరించగలం అన్న స్పష్టత వస్తుంది. అంటే, ఎంత మేరకు మీరు చెల్లించగలరో దాన్ని బట్టే రుణ మొత్తాన్ని ఎంపిక చేసుకోవడం ముఖ్యం. ఎప్పటికప్పుడు పెరిగే వడ్డీ రేట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఆర్జించే ఆదాయం లో నుంచి నెలకు చెల్లించే ఈఎంఐ పోను మిగిలిన మొత్తాన్ని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకునేందుకు పక్కా బడ్జెట్ ను వేసుకోవాల్సిన అవసరమూ ఉంటుంది.

ఎంత రుణం రావచ్చు?

ఒక వ్యక్తికి ఎంత మేరకు రుణం ఇవ్వాలనేది బ్యాంకులు ఆ వ్యక్తి ఆర్ధిక పరిస్థితి, ఇప్పటికే చెల్లించిన రుణాల తీరు ఆధారంగా నిర్ణయిస్తాయి. సాధారణంగా మీ ఆదాయాన్ని బట్టి ఇంటి విలువలో 80 శాతం దాకా రుణం ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే…బ్యాంకులు మీ నికర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటాయి. వేతన వివరాల్లో కనిపించే అన్ని అంశాలనూ బ్యాంకులు లెక్కలోకి తీసుకోవు. వాస్తవంగా చెప్పాలంటే…తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించగలడా లేదా అనేది బ్యాంకులకు ప్రామాణికం. మీ నికర ఆదాయం లో నుంచి ఎల్టీఏ, ఇతర అలవెన్సులు తీసివేస్తే ఆ మేరకు మీ ఇంటి రుణం తగ్గినట్లే. అందుకే బ్యాంకులు, ఇతర వెబ్సైట్లు చూపించే రుణ మొత్తానికీ, అన్ని వ్యవహారాలూ పూర్తయ్యాక బ్యాంకులు మంజూరు చేసే రుణ మొత్తానికీ తేడా ఉంటుంది.

వడ్డీ రేట్ల మాటేమిటి?

రుణానికి మనం ఎంచుకున్న వడ్డీ విధానం ఏమిటనేది కూడా నెలవారీ ఈఎంఐ పై ప్రభావం చూపిస్తుంది. అందుకే, స్థిర వడ్డీ రేటు, చలన వడ్డీ రేట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. రుణ వ్యవధి మొత్తానికీ స్థిర వడ్డీ రేటును ఎంచుకున్నారనుకోండి…అప్పుడు మీ నెలవారీ వాయిదాలన్నీ ఒకే విధంగా ఉంటాయి. సాధారణంగా స్థిర వడ్డీ రేట్లు 1 నుంచి 2 శాతం వరకూ అధికంగా ఉంటాయి. వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు స్థిర వడ్డీ రేట్లు ఉపయోగపడతాయి. అయితే, ఇది అంత తేలిక కాదు. రుణ కాలవ్యవధి, అంటే ఒక 10 నుంచి 15 ఏళ్ళ లో ఎన్నో సార్లు వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. చలన వడ్డీ రేట్లను ఎంచుకోవడమే మేలు.

బేరమాడండి:

వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లలో వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి, ఏ బ్యాంకు ఏ రేటుకు రుణం అందిస్తుందో ముందుగా పరిశీలించండి. ఆ తర్వాత మీరు రుణం తీసుకోబోయే బ్యాంకుతో బేరమాడండి. అప్పుడు కొంచెం తక్కువ వడ్డీ కి మీరు రుణం పొందే వెసులుబాటు కలుగుతుంది.

వ్యవధీ కీలకమే!

రుణం మొత్తం, వడ్డీ రేటు, వ్యవధిని బట్టే నెలవారీ వాయిదా ఎంతన్నది నిర్ణయిస్తారు. రుణ వ్యవధి పెరుగుతున్న కొద్దీ…ఈఎంఐ భారం తగ్గుతుంది. అలాగే, వ్యవధి తగ్గితే, ఈఎంఐ పెరుగుతుంది. కాబట్టి, మీరు చెల్లించగలిగే ఈఎంఐ ని బట్టి వ్యవధి నిర్ణయించుకోవడం మంచిది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే…వ్యవధి పెరిగే కొద్దీ వడ్డీ భారం కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఈఎంఐ ని లెక్కించేటప్పుడు దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావచ్చు.

రుణ చరిత్ర తెలుసుకోండి:

గృహ రుణం ఎంత వస్తుందనేది ప్రధానంగా ఒక వ్యక్తి రుణ చరిత్ర మీద ఆధార పది ఉంటుంది. సిబిల్ లాంటి సంస్థలు క్రెడిట్ స్కోర్ ని తెలియజేస్తాయి. బ్యాంకు ఖాతాలను నిర్వహించే తీరు, చెక్కుల జారీ, ఇప్పటికే ఉన్న రుణాల వాయిదాలను చెల్లిస్తున్న తీరు, ఎన్ని సార్లు క్రెడిట్ కార్డు/రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు, తదితర వివరాలను ఇందులో నమోదై ఉంటాయి. సిబిల్ స్కోరు 700 పాయింట్లు దాటితే మంచిది. తేలిగ్గా రుణం వస్తుంది. మీరు గృహ రుణం లేదా క్రెడిట్ కార్డు కావాలని బ్యాంకులు దరఖాస్తు చేయగానే అది వెంటనే మీ క్రెడిట్ స్కోరు ఎంతో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే…రుణం కావాలని ఒకేసారి 2-3 బ్యాంకులను సంప్రదించడం. ఇలా చేయడం వల్ల బ్యాంకులు మీరు అప్పుడు చేయడానికి ఎక్కువ ఉత్సాహం చుపిస్తున్నారనుకుంటాయి. మీకు రుణం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సిబిల్ నివేదిక, మీ నికర ఆదాయం, ఇవన్నీ కూడా రుణ మంజూరు పై ప్రభావం చూపిస్తాయి. అందుకే, మీరు రుణం తీసుకోవాలని అనుకోగానే స్వయంగా మీ రుణ చరిత్ర నివేదిక ను తెప్పించుకొని పరిశీలించుకోవాలి.

సంతకం చేసే ముందు:

రుణ దరఖాస్తు ఒప్పందం లో ఎన్నో కీలకమైన విషయాలు ఉంటాయి. వీటిని తెలుసుకోకుండా అడిగిన చోటల్లా సంతకం చేస్తే చివరకు ఇబ్బంది మనకే. కాబట్టి, ఈ విషయం లో కాస్త జాగ్రత్తగా ఉండండి. సంతకం పెట్టే ముందు అసలు అందులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. పరిశీలనా రుసుములు, ఆలస్యంగా చెల్లిస్తే విధించే రుసుములు, ఇతర రుసుముల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకోండి. అప్పు తీసుకునే తొందరలో…ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆర్ధికంగా ఇబ్బంది తప్పదు. రుణం తీసుకునే ముందు అన్ని విషయాలనూ బేరీజు వేసుకోవాలి. అప్పుడే, సొంతింట్లో హాయిగా ఉండగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని