Insurance: మీకు ఏ పాలసీ సరిపోతుంది?

జీవితంలోని ప్రతి దశలోనూ వేర్వేరుగా బాధ్యతలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మన ఆర్థిక ప్రణాళికల రచన సాగాలి. కొన్నిసార్లు బాధ్యతలు ఒకదానితో ఒకటి పోటీ

Updated : 03 Sep 2021 09:05 IST

జీవితంలోని ప్రతి దశలోనూ వేర్వేరుగా బాధ్యతలు ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని మన ఆర్థిక ప్రణాళికల రచన సాగాలి. కొన్నిసార్లు బాధ్యతలు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు.. పిల్లల చదువుల ఖర్చులు వస్తుంటాయి. మనం ఒకటి అనుకుంటే..మరో ఖర్చు ఉండవచ్చు. అందుకే, ఆర్థిక ప్రణాళికలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. తమ లక్ష్యాల సాధనకు బీమా పాలసీలను ఎంచుకునే వారు.. అందుబాటులో ఉండే పాలసీల్లో ఏ రకం ఎంచుకోవాలన్నది ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే అవి వారికి అనుకున్న విధంగా సహాయపడతాయి.

స్థిర రాబడి రావాలనుకుంటే..

కొంతమందికి నష్టభయం భరించే సామర్థ్యం ఉండదు. ఇలాంటి వారికి తక్కువ హెచ్చుతగ్గులు ఉండే.. స్థిరంగా రాబడిని అందించే పాలసీలు అవసరం అవుతాయి. ఈ పాలసీలు సంప్రదాయ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర సురక్షిత పథకాలతో పోలిస్తే.. కాస్త అధిక రాబడిని అందిస్తాయి. తరచూ మారే వడ్డీ రేట్ల నుంచి ఈ పాలసీల ద్వారా రక్షణ పొందవచ్చు. వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలోనూ పాలసీదారులు తొలుత హామీ ఇచ్చిన వడ్డీని పొందేందుకు వీలవుతుంది. ఈ తరహా పాలసీల్లో ఇన్‌కం, ఒకేసారి మొత్తం వచ్చే ఆప్షన్లూ అందుబాటులో ఉంటాయి.

రక్షణ కోసం ప్రత్యేకంగా..

ఉద్యోగంలో చేరిన కొత్తలో బాధ్యతలు చాలా తక్కువగానే ఉంటాయి. అయితే, కుటుంబంలో ఆ వ్యక్తి మీద ఎవరైనా ఆధారపడిన వారున్నప్పుడు.. కచ్చితంగా రక్షణకే పరిమితమయ్యే టర్మ్‌ పాలసీని ఎంచుకోవాలి. వార్షిక ఆదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ టర్మ్‌ పాలసీని తీసుకోవాలన్నది నిపుణుల సూచన. దీంతోపాటు.. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు, డిజేబిలిటీ ఇన్సూరెన్స్‌లాంటివి తీసుకోవడమూ మర్చిపోవద్దు. సాధారణంగా ఉద్యోగంలో చేరిన తర్వాత వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, గృహరుణంలాంటివి తీసుకుంటారు. వీటికీ రక్షణ కల్పించేలా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీని ఎంచుకోవాలి. అనుకోకుండా రుణగ్రహీతకు ఏదైనా జరిగితే.. ఈ పాలసీలు ఆ రుణాన్ని తీర్చేస్తాయి. కుటుంబ సభ్యుల మీద ఆ రుణ భారం పడకుండా ఉంటుంది. చిన్న వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో రూ.50లక్షల పాలసీ కూడా దాదాపు రూ.6,000 దరిదాపుల్లో లభిస్తుంది.

నష్టభయం భరిస్తే..

మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం.. బీమా రక్షణ రెండూ కలిసి ఉండాలనుకున్నప్పుడు యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలను (యులిప్‌) పరిశీలించవచ్చు. వీటిలోనూ కాస్త నష్టభయం భరించగలిగితే.. పూర్తి ఈక్విటీ పెట్టుబడులు, లేకపోతే డెట్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. అయితే, ఈ పాలసీలకు తొలినాళ్లలో రుసుములు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత నుంచి తగ్గుతాయి. దీర్ఘకాలం ఎదురుచూడగలిగిన వారే యులిప్‌ల వైపు చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని