స్నేహితుల నుంచి తీసుకున్న గృహ రుణానికి పన్ను మినహాయింపు లభిస్తుందా?

ఇల్లు మరమత్తు, పునర్నిర్మాణం కోసం రుణం తీసుకున్నప్పటికీ పన్ను ప్రయోజనం అందుబాటులో ఉంటుంది

Published : 16 Dec 2020 17:11 IST

గుర్తింపు పొందని బ్యాంకులు, స్నేహితులు లేదా బంధువుల నుంచి తీసుకున్న గృహ రుణంపై వడ్డీకి, ప్రిన్సిపల్ రీపేంమెంట్ కి అందుబాటులో ఉన్న మినహాయింపులను అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్ మీకు సహాయపడుతుంది.

గృహ రుణంపై వడ్డీ తిరిగి చెల్లింపుకు మినహాయింపు:

గృహ రుణంపై వడ్డీ చెల్లింపుకు రూ. 2 లక్షల గరిష్ట పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది. ఒకవేళ చెల్లించాల్సిన వడ్డీ రూ. 2 లక్షల కన్నా తక్కువగా ఉన్నట్లయితే, ఆ మొత్తానికి మినహాయింపు లభిస్తుంది. ఇల్లు మరమత్తు, పునర్నిర్మాణం కోసం రుణం తీసుకున్నప్పటికీ పన్ను ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ తగ్గింపు రూ. 30,000 కు పరిమితం చేయడం జరిగింది. గృహ నిర్మాణం పూర్తయిన తరువాత లేదా దానిని స్వాధీనం చేసుకున్న తరువాత మాత్రమే వడ్డీ తిరిగి చెల్లింపుకు మినహాయింపు లభిస్తుంది. రుణం తీసుకున్న నెల నుంచి వడ్డీని తిరిగి చెల్లించాలని అనేక రుణ ఒప్పందాలు తెలియచేస్తున్నాయి. ఒకవేళ ఇప్పుడే నిర్మాణాన్ని ప్రారంభించినట్లయితే, నిర్మాణం పూర్తయ్యేంత వరకు తిరిగి చెల్లించిన వడ్డీని ఎవరూ క్లెయిమ్ చేయలేరు. ఇలాంటి సందర్భంలో, నిర్మాణం పూర్తయ్యే ముందు చెల్లించిన మొత్తం వడ్డీని తరువాతి ఐదు సంవత్సరాలలో 5 సమాన వాయిదాల రూపంలో మినహాయింపును పొందవచ్చు. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ మినహాయింపు అందుబాటులో ఉంటుందని ఆదాయ పన్ను చట్టం, 1961 ఎక్కడా పేర్కొనలేదు.

గృహ రుణంపై ప్రిన్సిపల్ రీపేంమెంట్ కి మినహాయింపు:

ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి తీసుకున్న రుణానికి సంబంధించిన ప్రిన్సిపల్ రీ పేమెంట్ కు మాత్రమే సెక్షన్ 80 సీ కింద రూ. 1.5 లక్షల మినహాయింపు లభిస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) వంటి సెక్షన్ 80 సీ కింద మినహాయింపుకు అర్హత పొందిన అన్ని పెట్టుబడులు, వ్యయాలను ఈ పరిమితి కలిగి ఉంటుంది. బ్యాంకులు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. అందువలన స్నేహితులు, బంధువులు లేదా ఎవరైనా రుణదాతల నుంచి తీసుకున్న రుణంపై ప్రిన్సిపల్ రీపేమెంట్ మినహాయింపును సెక్షన్ 80సీ కింద క్లెయిమ్ చేసుకోలేము.

ఉదాహరణకి రమేష్ అనే వ్యక్తి రూ. 20 లక్షలతో ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. దీని కోసం రమేష్ తన స్నేహితుడు సురేష్ నుంచి రుణం తీసుకున్నాడు. సంవత్సరానికి రూ. 5 వడ్డీతో 20 సమాన వాయిదాల్లో రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దానిలో భాగంగా 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. లక్ష అసలుతో పాటు రూ. లక్ష వడ్డీని రమేష్ తిరిగి చెల్లించారు. రమేష్ రూ. లక్ష వడ్డీ తిరిగి చెల్లించినందుకు గాను సెక్షన్ 24 కింద మినహాయింపును పొందుతాడు. స్నేహితుల నుంచి తీసుకున్న రుణం రీపేంమెంట్ కి మినహాయింపు అందుబాటులో లేదు కాబట్టి అతను సెక్షన్ 80సీ కింద ప్రిన్సిపల్ రీపేంమెంట్ కి మినహాయింపును పొందలేడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని