GST Collections: జనవరిలోభారీగా జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ వసూళ్లు (GST collections) జనవరిలో భారీగా పెరిగాయి. మరోసారి 1.30లక్షల కోట్ల మార్కును దాటాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఇది 15శాతం అధికమని...

Published : 01 Feb 2022 01:45 IST

దిల్లీ: జీఎస్టీ వసూళ్లు (GST collections) జనవరిలో భారీగా పెరిగాయి. మరోసారి 1.30 లక్షల కోట్ల మార్కును దాటాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఇది 15శాతం అధికమని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. సోమవారం (జనవరి 31న) మధ్యాహ్నం 3గంటల వరకు దేశవ్యాప్తంగా రూ.1,38,394 కోట్లు మేర జీఎస్టీ వసూలైనట్టు తెలిపింది. గత నెలలో ఈనెల వసూళ్లలో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.24,674 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) రూ.32,016 కోట్లు; సమ్మిళిత జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద మరో రూ.72,030 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.35,181కోట్లతో కలిపి) వసూలైంది. అలాగే, సెస్‌ రూపంలో రూ.9674 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.517 కోట్లతో కలిపి) వచ్చిందని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో గతేడాది ఏప్రిల్‌లో అత్యధికంగా 1,39,708 కోట్లు మేర వసూలైనట్టు తెలిపింది. మరోవైపు, గత నెలలో (డిసెంబర్‌) రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూలైన విషయం తెలిసిందే.

గత ఏడాది జనవరితో పోలిస్తే ఈసారి వసూళ్లు 15శాతం అధికం కాగా.. 2020 జనవరితో పోలిస్తే 25శాతం అధికమని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం చెందడంతో పాటు పన్ను ఎగవేత నిరోధక చర్యలు సఫలీకృతం కావడం వల్లే జీఎస్టీ వసూళ్లు పెరిగినట్టు విశ్లేషించింది. రేట్ల హేతుబద్ధీకరణ కూడా ఇందుకు దోహదపడుతోందని పేర్కొంది. రాబోయే నెలల్లోనూ సానుకూల ట్రెండ్‌ కొనసాగితే వసూళ్లు ఆశాజనకంగానే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని