Jet Airways: జెట్‌ ఎయిర్‌వేస్‌కు హోంమంత్రిత్వ శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌

Jet Airways: కమర్షియల్‌ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలనుకుంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు (Jet Airways) హోంమంత్రిత్వ శాఖ నుంచి గుడ్‌న్యూస్‌ అందింది. విమాన కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను మంజూరు చేసింది.

Published : 08 May 2022 19:34 IST

దిల్లీ: కమర్షియల్‌ విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలనుకుంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు (Jet Airways) హోంమంత్రిత్వ శాఖ నుంచి గుడ్‌న్యూస్‌ అందింది. విమాన కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను మంజూరు చేసింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ జెట్ ఎయిర్‌వేస్‌కు తెలియజేసింది. మే 6నే ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేయగా.. సంబంధిత డాక్యుమెంట్‌ ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆర్థికంగా కుదేలైన నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు గత మూడేళ్లుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్‌ 17న జెట్‌ ఎయిర్‌వేస్‌ తన చివరి విమానం నడిపింది. గతంలో నరేశ్‌ గోయల్‌ యజమానిగా ఉన్నారు. ప్రస్తుతం జలాన్- కర్లాక్‌ కన్సార్షియం జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌గా వ్యవహరిస్తోంది. ఈ ఏడాది నుంచి తిరిగి విమాన సర్వీసులను ప్రారంభించాలని జెట్‌ ఎయిర్‌ వేస్‌ భావిస్తోంది.

విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలంటే కావాల్సిన ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ను పొందడంలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌ విమానాశ్రయంలో టెస్ట్‌ ఫ్లైట్‌ను నడిపింది. విమానాలు దాని భాగాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడంలో భాగంగా దీన్ని నిర్వహించారు. తదుపరి ప్రూవింగ్‌ ఫ్లైట్లను విజయవంతంగా నడిపిస్తే పౌర విమానయాన శాఖ రెగ్యులేటర్‌ డీజీసీఏ.. ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తుంది. ప్రూవింగ్‌ ఫ్లైట్లు కూడా సాధారణ కమర్షియల్ విమానాల్లానే నడుస్తాయి. ఇందులో డీజీసీఏ అధికారులు, ఎయిర్‌లైన్స్‌ అధికారులు ప్రయాణికుల్లా వ్యవహరిస్తారు. కేబిన్‌ సిబ్బంది కూడా యథావిధిగా ఉంటారు. అన్నీ సజావుగా జరిగితే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని