Homebuyers Rights: ఇల్లు కొంటున్నారా? రెరా మీకిచ్చిన హక్కులు ఇవే..

ఇల్లు కొనేవారికి రెరా ఇచ్చిన హక్కులు ఇవే. వీటిని తెలుసుకొని మాత్రమే ఇల్లు కొనుగోలు చేయాలి...

Published : 03 Jun 2022 12:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంతిల్లు చాలా మందికి ఓ జీవిత లక్ష్యం. అందుకోసం చాలా కష్టపడి ప్రతి రూపాయి కూడబెడతారు. ఇది కూడా సరిపోక కొంత బ్యాంకు నుంచి రుణంగా తీసుకొంటారు. మరికొంత చేబదులు తెచ్చుకొంటారు. మొత్తానికి భవన నిర్మాణ సంస్థలకు కొంత మొత్తం చెల్లించి ఇంటిని లేదా ఫ్లాట్‌ను బుక్‌ చేసుకుంటారు. కానీ, కొందరు వారి చేతిలో మోసపోతున్నారు. ఇలాంటి మోసాల నుంచి రక్షించడానికే ప్రభుత్వం స్థిరాస్తి అభివృద్ధి, నియంత్రణ (RERA) చట్టాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల కొనుగోలుదారులకు కొన్ని హక్కులు లభించాయి.

ఆ నెంబరు ఉండాల్సిందే..

500 చ.మీ. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టే ప్రాజెక్టు లేదా 8 కంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మించే ప్రాజెక్టుకు రెరా అనుమతులు తప్పనిసరి. ఇది లేకుండా ప్రీ లాంచ్‌ ఆఫర్లు, ఇళ్ల విక్రయాలు ప్రారంభించకూడదు. 2017 జనవరి ఒకటో తేదీ తర్వాత ప్రారంభమై.. చట్టం పరిధిలోకి వచ్చే అన్ని వెంచర్లను రెరా కింద నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. కొనుగోలుదారులు కచ్చితంగా రెరా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు రెరాకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేయకపోతే.. ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.

మార్పులకు కుదరదు..

స్థిరాస్తి రంగంలో పారదర్శకత, కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ, కొనుగోలుదారులు-రియల్‌ సంస్థల మధ్య వివాదాల సత్వర పరిష్కారం, రియల్‌ వెంచర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండాలి. నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులో ఇల్లు కొనేముందు ఈ సమాచారాన్ని వినియోగదారులు చెక్‌ చేసుకోవాలి. అప్పుడే రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో పూర్తిస్థాయి ఒప్పందం కుదుర్చుకోవాలి. తర్వాత మీ అనుమతి లేకుండా అందులో ఎటువంటి మార్పులు చేయడానికి సంస్థలకు హక్కు ఉండదు. వసతులు, ఏర్పాట్ల విషయంలో ఏ మార్పులు చేయాలన్నా కనీసం మూడింట రెండొంతుల మంది కొనుగోలుదారుల అనుమతి తప్పనిసరి. ఒకవేళ అనుమతి లేకుండా మార్పులేమైనా చేస్తే న్యాయపరంగా వెళ్లడానికి కొనుగోలుదారులకు హక్కు ఉంటుంది.

సొమ్ము ఎలా ఖర్చు చేస్తున్నారు? 

రెరా చట్టంలోని సెక్షన్‌ 4 ప్రకారం.. ప్రమోటర్లు కొనుగోలుదారుల నుంచి స్వీకరించిన మొత్తంలో 70 శాతం ఏదైనా బ్యాంకు ఖాతాలో లేదా ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి. ప్రాజెక్టు పూర్తవుతున్న కొద్దీ అందులో నుంచి ఓ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ ధ్రువీకరణతో కొంత మొత్తాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి ముందు ఈ సొమ్మును ప్రమోటర్లు ఎలా వినియోగించారో అడిగి తెలుసుకునే హక్కు కొనుగోలుదారులకు ఉంటుంది. కొంతమంది ఒప్పందం ఖరారైన తర్వాత ఇంట్రెస్ట్‌ సబ్‌వెన్షన్‌ స్కీమ్‌లను అమలు చేస్తుంటారు. అంటే ఒప్పందంలో పేర్కొన్న ధరకు కాకుండా ప్రస్తుత ధరల ప్రకారం చెల్లింపులు చేయమని కోరతారు. పైగా పెరిగిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించొచ్చని ప్రోత్సహిస్తారు.

వివాదం తలెత్తితే..

సెక్షన్‌ 19 ప్రకారం.. ఒప్పందంలో పేర్కొన్న గడువులోగా ప్రమోటర్లు ప్రాజెక్టును పూర్తి చేసి ఇంటిని అప్పజెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో కొనుగోలుదారులు తమ దరఖాస్తును ఉపసంహరించుకొని చెల్లించిన నగదును వాపస్‌ ఇవ్వమని కోరే హక్కు ఉంది. ఏదైనా వివాదం తలెత్తితే మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదు. ఇతర న్యాయమార్గాలను కూడా ఆశ్రయించొచ్చు. సంస్థ పనితీరుకు అందులో పనిచేస్తున్న అధికారులంతా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts