ఫండ్లు డైవర్సిఫికేష‌న్ ఎలా చేస్తాయి?

మార్కెట్ సైకిల్ అనుకూలంగా ఉండే ద‌శలో ఎక్కువ‌గా మ్యూచువ‌ల్ ఫండ్ పోర్టుఫోలియోలు ఫోక‌స్డ్ వ్యూహంతో లార్జ్ క్యాప్ స్టాక్ ల‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు...

Published : 21 Dec 2020 13:12 IST

మార్కెట్ సైకిల్ అనుకూలంగా ఉండే ద‌శలో ఎక్కువ‌గా మ్యూచువ‌ల్ ఫండ్ పోర్టుఫోలియోలు ఫోక‌స్డ్ వ్యూహంతో లార్జ్ క్యాప్ స్టాక్ ల‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు

28 నవంబర్ 2018 మధ్యాహ్నం 4:33

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఉండే ప్ర‌త్యేక‌త ల‌క్ష‌ణం వైవిధ్య‌త‌. వివిధ ర‌కాల పెట్టుబ‌డుల‌లో కొంత‌కొంత పెట్టుబ‌డి పెట్టడాన్ని వైవిధ్య‌త అంటారు. ఈ విధంగా పెట్టుబ‌డుల‌ను వివిధ పెట్టుబ‌డుల్లో స‌ర్దుబాటు చేయ‌డం ద్వారా ఒక‌టి రాణించ‌కున్నా మ‌రొక పెట్టుబ‌డి రాణించేందుకు అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా మొత్తం పెట్టుబ‌డికి రిస్క్ త‌గ్గుతుంది. దీనికి గురించి మ‌రింత తెలుసుకునేందుకు వివిధ ర‌కాల ఫండ్లో వైవిధ్య‌త ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాలి. ఈక్విటీ ఫండ్లు : ఫండ్ పెట్టుబ‌డి చేసే సెక్యూరిటీల ఆధారంగా ఆ ఫండ్ వైవిధ్య‌త‌ను తెలుసుకోవ‌చ్చు. ఈక్విటీ ఫండ్ల‌లో ఫోక‌స్డ్ పోర్టుఫోలియో క‌లిగే ఫండ్లు సుమారు 25-30 కంపెనీల‌కు చెందిన షేర్ల‌లో పెట్టుబ‌డులు చేస్తాయి. ఈ త‌ర‌హా వ్యూహం మంచి రాబ‌డిని పొందేందుకు స‌హ‌క‌రిస్తుంది. డైవ‌ర్సిఫైడ్ పోర్టుఫోలియో అయితే సుమారు 40-60 కంపెనీల‌కు చెందిన షేర్ల‌లో పెట్టుబ‌డులు చేస్తుంటారు. దీని వ‌ల్ల న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంది. ఈ వ్యూహం లో ప్ర‌ధానంగా త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే విధంగా నిర్వాహ‌కులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు.

కేటాయింపులు:

పెట్టుబ‌డులు చేసే శాతాల ఆధారంగా కూడా వైవిధ్య‌త ఆధార‌ప‌డి ఉంటుంది. ఏ ర‌క‌మైన పెట్టుబ‌డిలో ఎంత శాతం పెట్టుబ‌డి పెట్టార‌నే దాని ఆధారంగా పోర్టుఫోలియోకు వైవిధ్య‌త వ‌స్తుంది. పోర్టుఫోలియోలో ఎక్కువ సంఖ్య‌లో సెక్యూరిటీలు ఉండి, వాటిలో 60-70 శాతం పెట్టుబ‌డులు తొలి ప‌ది లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబ‌డి చేసే పోర్టుఫోలియోల‌కు పూర్తి వైవిధ్య‌త ఉన్న‌ట్లు కాదు. ఉదాహ‌ర‌ణ‌కు హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్ లో మొత్తం 46 స్టాక్ లు ఉన్నాయి. ఆ పోర్టుఫోలియో లో మొత్తం 60 శాతం పెట్టుబ‌డులు ప‌ది స్టాక్ ల‌లో ఉంటుంది. మ్యూచువ‌ల్ ఫండ్లు త‌మ పెట్టుబ‌డి ల‌క్ష్యం, ఫండ్ ఉద్దేశం బ‌ట్టి పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఎంపిక‌ల‌ను చేసుకుంటాయి.

ఏ సెక్టార్ లో ఎంత?

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డుల‌కు సంబంధించి ఏ రంగానికి చెందిన పెట్టుబ‌డులు ఎంత శాతం క‌లిగి ఉన్నాయ‌నే దానిపైనా కూడా వైవిధ్య‌త‌ ఆధార‌ప‌డి ఉంటుంది. చాలా వ‌ర‌కూ డైవ‌ర్సిఫైడ్ ఫండ్లు 50 శాతం నిధుల‌ను మూడు సెక్టార్లలో పెట్టుబ‌డి చేస్తున్నాయి. అయితే మ్యూచువ‌ల్ ఫండ్లు వాటి పెట్టుబ‌డి వ్యూహాన్ని బ‌ట్టి వివిధ రంగాల‌కు చెందిన షేర్ల‌లో పెట్టుబ‌డులు పెడుతుంటాయి. సెక్టార్ ప్ర‌త్యేకిత ఫండ్లు అయితే సంబంధిత రంగానికి చెందిన పెట్టుబ‌డుల‌ను అధిక శాతం ఎంచుకుంటాయి. మార్కెట్ సైకిల్స్: మార్కెట్ సైకిల్ అనుకూలంగా ఉండే ద‌శలో మార్కెట్లలో పైకి వెళ్తున్న ధోరణి క‌నిపిస్తుంది. ఆ స‌మ‌యంలో ఎక్కువ‌గా మ్యూచువ‌ల్ ఫండ్ పోర్టుఫోలియోల్లో లార్జ్ క్యాప్ స్టాక్ ల‌లో ఫోక‌స్డ్ పోర్టుఫోలియోల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. క్ర‌మంగా మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్ ల‌లో పెట్టుబ‌డులు చేస్తుంటారు. మార్కెట్లో తిరోగ‌మ‌నం ఏర్ప‌డిన‌పుడు నాణ్య‌మైన కంపెనీల‌కు చెందిన షేర్లు, ఫోక‌స్డ్ పోర్టుఫోలియోలు క‌లిగి ఉంటాయి.

డెట్ ఫండ్లు:

అధిక మొత్తంలో ఆస్తులు క‌లిగి ఉండ‌టం డెట్ ఫండ్ల‌కు ఉండే అనుకూల‌త‌. దీంతో వీటికి వైవిధ్య‌త చేసేందుకు మంచి అవ‌కాశం ఉంటుంది. డెట్ ఫండ్లు మ‌నీ మార్కెట్, ప్ర‌భుత్వ సెక్యూరిటీలు త‌దిత‌ర వాటిలో ఎంత శాతం చేయాలి అనేది ఆ ఫండ్ ర‌కం, పెట్టుబ‌డి ల‌క్ష్యం త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు లిక్విడ్ ఫండ్లు పోర్టుఫోలియోలో అధిక భాగం స్వ‌ల‌కాలానికి ఉండే మ‌నీమార్కెట్ పెట్టుబ‌డి సాధ‌నాలు ట్రెజ‌రీ బిల్లుల్లో పెట్టుబ‌డి చేస్తుంది. దీర్ఘ‌కాల‌ప‌రిమితి ఉండే సాధ‌నాల్లో పెట్టుబ‌డి పెట్ట‌వు. కార్పోరేట్ బాండ్ ఫండ్లు అయితే లిక్విడిటీ, ఈల్డు బ్యాలెన్స్ కోసం కొంత భాగం ప్ర‌భుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబ‌డులు చేస్తారు. ప్ర‌స్తుతం ఈ కేట‌గిరీ కి చెందిన ఫండ్లు 4.5 శాతం ప్ర‌భుత్వ సెక్యురిటీల్లో మ‌దుపు చేస్తున్నాయి.

ఫండ్లు ఎలాగైతే డైవ‌ర్సిఫికేష‌న్ చేస్తాయో, మనం కూడా కనీసం 2-3 రకాల ఫండ్లలో మదుపు చేయడం మంచిది. అయితే, ఎక్కువ ఫండ్లు చేయడం వల్ల ఉపయోగం ఉండదు. మంచి ఫండ్లు ఎంచుకోవడమే ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని