గత 10 ఏళ్లలో ధరలు తగ్గాయా.. పెరిగాయా?  

ఆహారం, ఇంధ‌న ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది డిమాండ్/సరఫరాతో పాటు అనేక అంశాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

Published : 16 Jun 2021 14:18 IST

ఇటీవలే పెట్రోల్ ధరలు రూ. 100 దాటడంతో ప్రజలు ధరల పెరుగుదల గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. దాదాపు సోషల్ మీడియా, టీవీతో పాటు అన్ని చోట్ల ఇదే చర్చలు సాగుతున్నాయి. ముందుగా పెట్రోల్ ధరలు ఎంత వరకు పెరిగాయి అనేది చూద్దాం. దేశ రాజ‌ధాని ఢిల్లీలో చూస్తే.. 2010లో పెట్రోల్ ధర సుమారుగా రూ.47 ఉండేది. అదే సమయంలో పెట్రోల్ ధరల్ని అప్పటి ప్రభుత్వం (డి-రేగ్యులేట్) మార్కెట్‌తో అనుసంధానం చేసింది. ఆ తరవాత 2 ఏళ్ళల్లో, అంటే 2012లో పెట్రోల్ సుమారుగా 52 శాతం వరకు, అంటే గరిష్టంగా రూ.73 వరకు పెరిగింది. 2014 లో ఈ ధరలు సుమారుగా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ 7 ఏళ్లలో, పెట్రోల్ ధరలు సుమారు 40 శాతం వరకు పెరిగాయి, అంటే సగటున‌ ఏడాదికి 5 నుంచి 6 శాతం వరకు పెరిగాయి. 

ఇతర ధరల సంగతేంటి?
మార్కెట్‌లో మనం కొనుగోలు చేసే వస్తువులు వందల్లో ఉంటాయి. నూనె, పప్పులు, కూరగాయలు, పళ్ళు, ఇలా ప్రతి ఒక వస్తువుని మనం పోల్చడం సాధ్యం కాదు. కాబట్టి, ప్రభుత్వం 'ద్రవ్యోల్బణం'  లెక్కలు ఎప్పటికప్పుడు మనకి తెలియజేస్తూ ఉంటుంది. 2012 నుంచి ఇప్పటి వరకు ఈ లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం:
                                                               
ఈ గ్రాఫ్ లో మనం చూడచ్చు, 2012లో 7-8 శాతం ఉన్న ద్రవ్యోల్బణం 2014 లో గరిష్టంగా 12 శాతం దాటింది. ఆ తరువాత 2017 లో కనిష్టంగా 2 శాతం (సుమారుగా) ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది. 2015- 2019 వరకు సగటున‌ ఇది 4-6 శాతం మధ్యలో ఉంది. కోవిడ్ వలన ఇది మళ్ళీ 8 శాతానికి చేరుకుంది. (పాండెమిక్) మహమ్మారి సోకినప్పుడు ద్రవ్యోల్బణం పెరగడం సర్వ సాధారణం. ధరల తగ్గుగల ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే,  ఈ పెరుగుదలని నియంత్రణలో ఉంచడం ప్రభుత్వ బాధ్యత. ఈ 6 ఏళ్లలో ధరల పెరుగుదల నియంత్రణలో ఉన్నట్టు మనం ఈ లెక్కల ప్రకారం చెప్పచ్చు.    

ఆహార ధరల మాటేంటి?
ద్రవ్యోల్బణం లెక్కించేటప్పుడు ఆహార ధరల్ని లెక్కలో తీసుకోర‌నే అపోహ ఉంది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. పైన తెలిపిన ద్రవ్యోల్బణం లెక్కల్లో 40 శాతం వరకు ఆహార ధరలే లెక్కల్లో తీసుకుంటారు. ఈ కింది గ్రాఫ్ లో ఆహార ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం:
                                                           
దీని ప్రకారం 2012 నుంచి 2014 వరకు 5 నుంచి 15 శాతం వరకు పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. 2017 లో గరిష్టంగా 8 శాతం వరకు చేరుకుంది, 2019 లో కనిష్టంగా ఇది -3% నమోదు చేసుకుంది. 

చివరి మాట:
సాధారణంగా, పెట్రోల్ ధరల వల్ల రవాణాతో పాటు ఆహార ధరలు కూడా పెరుగుతాయి అన్నది వాస్తవమే. అయితే, ఇదొక్క కారణం వల్ల మాత్రమే ఆహార, ఇతర ధరలు పెరగడం లేదా తగ్గడం జరగదు. డిమాండ్/సరఫరాతో పాటు వీటి వెనక అనేక కారణాలు ఉంటాయి. ధరల నియంత్రణ విషయంలో ప్రభుత్వం సమయానుసారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే నియంత్రించగలిగారని చెప్పవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని