Updated : 20 Jan 2022 17:34 IST

Motor Insurance: మీ వాహనాన్ని దొంగిలించారా? బీమా ఎలా క్లెయిమ్‌ చేయాలి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ రోజుల్లో దాదాపు అంద‌రికీ సొంత వాహ‌నాలు ఉంటున్నాయి. భార‌త్‌లో రోడ్డుపై తిరిగే ప్ర‌తి మోటారు వాహ‌నానికి థ‌ర్డ్ పార్టీ  ఇన్సూరెన్స్‌ ఉండ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే ఇది మాత్ర‌మే స‌రిపోద‌ని స‌మ‌గ్ర బీమా ఉండ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతుంటారు. థ‌ర్డ్‌ పార్టీ బీమాలో కేవ‌లం ఎదుటి వ్య‌క్తులు, వాహ‌నాలు, ఆస్తుల వ‌ల్ల సంభ‌వించిన ప్ర‌మాదాల‌కు మాత్ర‌మే బీమా ర‌క్ష‌ణ ఉంటుంది. కానీ దొంగ‌త‌నం లేదా మీ స్వీయ త‌ప్పిదాల వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాల‌కు ఎలాంటి బీమా క‌వ‌రేజీ ఉండ‌దు. పేలుళ్లు, అగ్ని ప్ర‌మాదాలు, యాక్సిడెంట్ల వ‌ల్ల జ‌రిగే న‌ష్టాన్ని మాత్ర‌మే కాకుండా వాహ‌నం చోరీకి గురైనా స‌మ‌గ్ర బీమా క‌వ‌ర్ చేస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన న‌గరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వ‌ర‌కు వాహ‌న దొంగ‌త‌నాలు స‌ర్వ సాధార‌ణంగా మారిపోయాయి. జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ దొంగ‌త‌నాలు జ‌రుగుతూనే ఉన్నాయి. మీ వాహ‌నం దొంగతనానికి గురైతే మీ వాహ‌నానికి బీమా ఉంటే క్లెయిమ్ చేయొచ్చు. దీంతో కొంత వ‌ర‌కు న‌ష్ట‌ప‌రిహారం దొరుకుతుంది.

వాహన బీమా క్లెయిమ్ ప్రక్రియ..

ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి: క్లెయిమ్ చేసే ప్రక్రియలో ముందుగా వాహ‌నం దొంగతనానికి గురైనట్లు మీరు గుర్తించిన వెంట‌నే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయాలి. ద‌ర్యాప్తు కోసం వాహనం త‌యారు చేసిన సంస్థ పేరు, మోడల్, లైసెన్స్ ప్లేట్ నంబర్ మొదలైన అవసరమైన పూర్తి సమాచారాన్ని పోలీసులుకు అందించాలి.

బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి: ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక‌ ఈ విష‌యాన్ని బీమా సంస్థ‌కి తెలియప‌ర‌చాలి. ఎఫ్ఐఆర్ కాపీని బీమా సంస్థ‌కు ఇవ్వాలి. బీమా క్లెయిమ్ చేసేందుకు ఎఫ్ఐఆర్ అత్యంత ముఖ్య‌మైన ప‌త్రం.

ఆర్‌టీఓ: ఆ తర్వాత ఆర్‌టీఓకి సమాచారం అందించి డాక్యుమెంటేషన్ పనులు ప్రారంభించాలి. మోటారు వాహన చట్టం ప్రకారం, వాహన యజమాని వీలైనంత త్వరగా  ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్‌టీఓ)లో వాహ‌న దొంగ‌త‌నం గురించి తెలియజేయవలసి ఉంటుంది. “క్లెయిమ్ ప్రాసెస్ కోసం బీమా సంస్థ‌కు స‌మ‌ర్పించాల్సిన‌ సపోర్టింగ్ డాక్యుమెంట్‌లు, బదిలీ పేపర్ల‌ను ఆర్‌టీఓ కార్యాల‌యం నుంచి పొందొచ్చు.

ప‌త్రాలు: క్లెయిమ్ చేసేందుకు బీమా సంస్థ‌కు కొన్ని ప‌త్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని సిద్ధం చేసుకోవాలి. బీమా పాల‌సీ కాపీ, ఒరిజిన‌ల్‌ ఎఫ్ఐఆర్ కాపీ, క్లెయిమ్ ఫారం, డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, ఆర్‌సీ బుక్ కాపీ, ఆర్‌టీఓ బ‌దిలీ ప‌త్రాలు, సంబంధిత ఆర్‌టీఓ ఫారాలు వంటివి అవ‌స‌రం అవుతాయి. వీటితో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు ఇచ్చిన‌ ‘నో ట్రేస్ రిపోర్ట్’ని బీమా సంస్థ‌కు ఇవ్వాలి. వాహ‌నానికి సంబంధించి అన్ని సెట్ల 'కీ' ల‌ను ఇవ్వాలి.

ఎంత స‌మ‌యం ప‌ట్టొచ్చు..?: క్లెయిమ్ ఆమోదం కోసం 60 నుంచి 90 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఒక‌వేళ మీరు కావాల్సిన ప‌త్రాల‌ను, వాహ‌నానికి సంబంధించి అన్ని సెట్ల 'కీ' ల‌ను ఇవ్వ‌డంలో విఫ‌లం అయితే క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌కు గురికావ‌చ్చు.

క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ‌కు కార‌ణాలు: వాహనం దొంగతనానికి గురైన వెంటనే పోలీస్ స్టేష‌న్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయ‌క‌పోయినా, క్లెయిమ్ ప్రాసెస్ ప్రారంభించ‌డంలో జాప్యం జ‌రిగినా, అవ‌స‌ర‌మైన ప‌త్రాలు ఇవ్వ‌క‌పోయినా, ప‌త్రాలు స‌రిపోక‌పోయినా, క‌నీసం రెండు సెట్ల వాహ‌న 'కీ' ల‌ను ఇవ్వ‌క‌పోయినా, వాహ‌నం ర‌క్ష‌ణ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోలేద‌ని బీమా సంస్థ క్లెయిమ్ తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని