Fuel Sales: పెట్రో ఉత్పత్తులు.. మార్చి నెలలో రికార్డుస్థాయి అమ్మకాలు!

పెట్రోలియం ఉత్పత్తి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నప్పటికీ మార్చి నెలలో దేశంలో ఇంధన వినియోగం రికార్డు స్థాయిలో జరిగింది.

Published : 11 Apr 2022 17:30 IST

దిల్లీ: ఇటీవల కాలంలో భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తి ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాలుగున్నర నెలల విరామం తర్వాత మార్చి నెలలో మొదలైన ఇంధన ధరల పెరుగుదల ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరుకుంది. అయినప్పటికీ మార్చి నెలలో దేశంలో ఇంధన వినియోగం రికార్డు స్థాయిలో జరిగింది. గడిచిన మూడేళ్లలోనే పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం 4.2శాతం పెరిగి.. కొవిడ్‌ కంటే ముందున్న రోజులను దాటిపోయింది. దేశంలో కేవలం ఒక్క మార్చిలోనే 19.41 మిలియన్‌ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం జరిగింది. పెట్రోలియం మంత్రిత్వశాఖకు చెందిన ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ ప్రకారం, 2019 మార్చి నుంచి ఇదే అత్యధికం.

కొవిడ్‌ మూడోవేవ్‌ తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడంతో దేశవ్యాప్తంగా ఇంధన వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా దేశంలో అత్యధికంగా వినియోగించే డీజిల్‌ వాడకం గణనీయంగా పెరిగింది. కేవలం ఒక్క నెలలోనే 6.7శాతం పెరుగుదలతో 7.7మిలియన్‌ టన్నుల విక్రయాలు జరిగాయి. ఇలా పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు కొవిడ్‌ కంటే ముందున్న అమ్మకాలను దాటిపోయాయి. వ్యవసాయ రంగంలో డీజిల్‌ను భారీగా వినియోగించడంతోపాటు ధరల పెరుగుదల భయంతో పెట్రోల్‌ బంకుల్లో ముందస్తు నిల్వలు చేసుకోవడంతో వీటికి మరింత డిమాండ్‌ పెరిగింది. మరోవైపు, మార్చి నెలలో వంటగ్యాస్‌ (LPG) డిమాండ్‌ కూడా 9.8శాతం పెరిగి 2.48 మిలియన్‌ టన్నులకు చేరింది.

మొత్తంగా కేవలం మార్చిలోనే కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇంధన వినియోగం 202.72 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యింది. 2020 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అత్యధికం. 2021-22లో పెట్రోల్‌ వినియోగం 10.3శాతం పెరిగి 30.85 మిలియన్‌ టన్నులకు చేరింది. డీజిల్‌ మాత్రం 5.6శాతం పెరిగి 76.7 మిలియన్‌ టన్నుల విక్రయాలు జరిగాయి. గత మూడేళ్లలో వీటి అమ్మకాల్లో ఇవే గరిష్ఠం. మరోవైపు జెట్‌ ఫ్యుయెల్‌కు డిమాండ్‌ కూడా భారీగా పెరిగినప్పటికీ కొవిడ్‌ విజృంభణకు ముందుతో పోలిస్తే కాస్త తక్కువగానే నమోదయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని