Crude Oil: ‘భారత చమురు కొనుగోళ్లపై రాజకీయం వద్దు’

రష్యా నుంచి భారత్‌ రాయితీ ధరతో చమురు కొనుగోలు చేయడంపై అమెరికా స్పందించడాన్ని భారత్‌ పరిగణనలోకి తీసుకుంది....

Published : 18 Mar 2022 16:19 IST

పరోక్షంగా అమెరికాకు కేంద్ర ప్రభుత్వ హితవు

దిల్లీ: రష్యా నుంచి భారత్‌ రాయితీ ధరతో చమురు కొనుగోలు చేయడంపై అమెరికా స్పందించడాన్ని భారత్‌ పరిగణనలోకి తీసుకుంది. చట్టబద్ధమైన ఇంధన లావాదేవీలపై రాజకీయాలు చేయొద్దని స్పష్టం చేసింది. చాలినన్ని చమురు నిల్వలు ఉండి కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలు సలహాలివ్వొద్దంటూ పరోక్షంగా చురకలంటించింది.

ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. మరోవైపు గత కొన్ని నెలలుగా భారత్‌ తన చమురు దిగుమతి బిల్లు భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎక్కడ చౌకగా దొరికినా తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. పశ్చిమ దేశాల ఆంక్షల చట్రంలో ఇరుక్కున్న రష్యా.. భారత్‌కు ధర తగ్గించి సరఫరా చేసేందుకు సిద్ధమైంది. దీంతో రష్యా నుంచి దాదాపు 30 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్‌ చౌకధరకు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ఒక ట్రేడర్‌ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. ఆంక్షల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఈ చమురును భారత్‌ తీరానికి తీసుకొచ్చే బాధ్యత విక్రయదారుడిదే. ఇందుకు అనుగుణంగా ఒప్పందంలో ఐఓసీ షరతులు విధించింది. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే బ్యారెల్‌ బ్రెంట్‌ ధరలో 20-25 డాలర్ల తక్కువకే ఉరాల్‌ క్రూడ్‌ను రష్యా నుంచి ఐఓసీ కొనుగోలు చేసిందని ఈ పరిణామంతో సంబంధమున్న వర్గాలు తెలిపాయి.

ఈ వ్యవహారంపై ఇటీవల అమెరికా స్పందించింది. భారత్‌ ఒప్పందం.. ఆంక్షల పరిధిలోకి రాదని పేర్కొంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో తాము ఎటు పక్క నిలిచామో, రేపు చరిత్ర పుస్తకాల్లో తమ గురించి ఏమని రాస్తారో ప్రతి దేశమూ గుర్తుంచుకొని వ్యవహరించాలని అధ్యక్ష భవన ప్రెస్‌ కార్యదర్శి జెన్‌ సాకీ తెలిపారు. పుతిన్‌ నాయకత్వానికి సాయం చేయడమంటే ఉక్రెయిన్‌పై దండయాత్రను సమర్థించడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించారు.

దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి స్పందించారు. భారత చట్టబద్ధమైన ఇంధన లావాదేవీలను రాజకీయం చేయొద్దని హితవు పలికారు. పైగా ఓవైపు చమురు ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించి.. మరోవైపు రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాలు వాణిజ్య పరిమితుల గురించి మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయని.. దీంతో సహజంగానే తాము చౌక ధరకు ఇచ్చే ప్రత్యామ్నాయ ఉత్పత్తిదారులపై దృష్టి సారించామని వివరించారు.

ఇదే వ్యవహారంపై విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి సైతం గురువారం స్పందించారు. భారత్‌ చమురు అవసరాలకు పూర్తిగా దిగుమతులపై ఆధారపడుతోందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న అన్ని అవసరాలను అందిపుచ్చుకుంటామని స్పష్టం చేశారు. ఐరోపా సహా అనేక దేశాలు అదే పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో చౌకగా చమురు అందించే ఏ ఉత్పత్తిదారుణ్నీ తిరస్కరించే అవకాశం ఉండదని తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని