Insurance: ఆందోళ‌న‌ల‌కు దూరంగా ఉండాలంటే ఈ బీమా పాలసీలు త‌ప్ప‌నిస‌రి!

భ‌విష్య‌త్‌లో ఊహించని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు బీమా అవ‌స‌రం తెలుస్తుంది.

Updated : 15 Dec 2021 14:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భ‌విష్య‌త్‌ ఎలా ఉంటుందో మ‌న‌కు తెలియ‌దు. గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లు, ఎదుర్కొన్న ప‌రిస్థితుల ఆధారంగా.. భ‌విష్య‌త్‌లో మ‌ళ్లీ అలాంటి ప‌రిస్థితులు త‌లెత్తితే ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. అనారోగ్యాలు, ప్ర‌మాదాలు, ప్ర‌కృతి వైప‌రీత్యాలు, అవాంఛ‌నీయ ప‌రిస్థితులు.. ఎటువంటి హెచ్చ‌రిక‌లూ జారీ చేయ‌కుండానే వ‌స్తాయి. ఈ విష‌యం గ‌త రెండేళ్ల కాలం మ‌న‌కు అనుభ‌వ పూర్వ‌కంగా తెలియ‌జేసింది. ఇలాంటి ఊహించ‌ని ప‌రిస్థితులు మ‌న‌ల్ని మాన‌సికంగా, ఆర్థికంగా దెబ్బ‌తీస్తాయి. కొంత దూర‌దృష్టి, ప్ర‌ణాళిక‌తో వీటిని ఆర్థికంగా ఎదుర్కోవ‌చ్చు. బీమా పాల‌సీలు ఇందుకు స‌హాయ‌ప‌డ‌తాయి. బీమా అనేది ఆర్థిక ఆరోగ్యానికి పునాది లాంటిది. భ‌విష్య‌త్‌లో ఊహించని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు దీని అవ‌స‌రం తెలుస్తుంది. బీమా అవ‌స‌రం, ప్రాముఖ్య‌త తెలిసిన‌ప్ప‌టికీ కొంత మంది ఇత‌ర కార‌ణాల వ‌ల్ల బీమా కొనుగోలు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఎలాంటి సంద‌ర్భాల్లో బీమా ఆర్థిక ఆందోళ‌న‌లు దూరం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కుటుంబం గురించి ఆందోళ‌న ప‌డ‌కుండా: అనుకోని ప్ర‌మాదాల కార‌ణంగా కుటుంబానికి ఆధార‌మైన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే.. ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది ప‌డ‌కుండా ర‌క్ష‌ణ కల్పిస్తుంది ట‌ర్మ్ బీమా పాల‌సీ. త‌మ ప్రియ‌మైన వారి భ‌విష్య‌త్‌ గురించి ఆలోచించి ఆందోళ‌న చెందేవారు త‌ప్ప‌కుండా ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవాలి.

ఆసుపత్రి ఖర్చులు విష‌యంలో: వైద్య అత్యవసర పరిస్థితుల్లో, మెరుగైన‌ వైద్య సేవ‌లు అందాల‌ని అంద‌రూ కోరుకుంటారు. అయితే ఇందుకు చాలా ఖ‌ర్చ‌వుతుంది. స‌రిప‌డ‌నంత క‌వ‌రేజ్‌తో కూడిన స‌మ‌గ్ర ఆరోగ్య బీమా పాల‌సీ.. అత్య‌వ‌స‌ర స్థితిలో మీకు, మీ కుటుంబానికి నాణ్య‌మైన వైద్య సేవ‌లందిచ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఆ స‌మ‌యంలో డ‌బ్బు గురించి ఆందోళ‌న చెంద‌కుండా మీ కుటుంబ సభ్యుల‌పై దృష్టి పెట్టొచ్చు.

క్రిటిక‌ల్ ఇల్‌నెస్‌: ఈ రోజుల్లో జీవనశైలి సంబంధిత వ్యాధులు సర్వసాధారణం అయిపోయాయి. వీటి కార‌ణంగా చిన్న వ‌య‌సులో గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్స‌ర్ వంటి సంక్లిష్ట వ్యాధుల బారిన ప‌డుతున్న‌వారు ఎంద‌రో ఉన్నారు. వీటికి దీర్ఘ‌కాలం చికిత్స అవ‌స‌రం. అలాగే చాలా డ‌బ్బు ఖ‌ర్చ‌వుతుంది. ఈ ఖ‌ర్చులు అప్ప‌టి వ‌ర‌కు చేసిన పొదుపు, పెట్టుబ‌డుల‌ను హ‌రించి కుటుంబ ఆర్థిక ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తాయి. ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొనేందుకు సాధార‌ణ ఆరోగ్య బీమా పాల‌సీకి క్రిటికల్ ఇల్‌నెస్ రైడ‌ర్‌ని జ‌తచేసి అదనపు భద్రతను పొందొచ్చు. ఈ పాలసీలు త‌క్కువ ప్రీమియంకే ల‌భిస్తాయి. బీమా సంస్థ జాబితాలోని క్లిష్ట‌మైన అనారోగ్యం బారిన ప‌డితే ఖ‌ర్చుతో సంబంధం లేకుండా మొత్తం హామీని పాల‌సీదారునికి బీమా సంస్థ చెల్లిస్తుంది.

వృద్ధాప్యంలో: వృద్ధాప్యంలో అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఎక్క‌వ. ఆసుప‌త్రి ఖ‌ర్చులు, మందులకు చాలా ఖ‌ర్చ‌వుతుంది. మీ లేదా మీ త‌ల్లిదండ్రుల వ‌య‌సును దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకుంటే.. ఖ‌ర్చుల గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. త‌ల్లిదండ్రుల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌శాంత‌మైన జీవితాన్ని అందించ‌డం ప్ర‌తి బిడ్డ బాధ్యత. వయసు ఆధారంగా ప్రీమియం కూడా పెరుగుతుంది కాబట్టి వీలైనంత త్వరగా పాలసీ తీసుకోవడం మేలు.

విప‌త్తులు, ఊహించ‌ని సంఘ‌ట‌న‌ల గురించి: పెరుగుతున్న ప్ర‌కృతి వైప‌రీత్యాలు మ‌నిషి ఆరోగ్యానికే కాకుండా ఇల్లు, వ్యాపారాల‌కు కూడా బీమా ర‌క్ష‌ణ ఉండాలని గుర్తుచేస్తున్నాయి. అందువ‌ల్ల గృహం, వ్యాపారాల‌కు బీమా చేయ‌డం వ‌ల్ల అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆస్తి న‌ష్టం జ‌రిగినా బీమా ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

వాహ‌నాలు: భార‌త్‌లో థ‌ర్డ్ పార్టీ మోటార్ బీమా తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే ఇది మీ వాహ‌నానికి జ‌రిగే న‌ష్టాన్ని క‌వ‌ర్ చేయ‌దు. కాబ‌ట్టి స‌మ‌గ్ర మోటార్‌ బీమా పాల‌సీతో పాటు ముఖ్య‌మైన యాడ్‌-ఆన్‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మీ వాహ‌నానికి సంపూర్ణ రక్ష‌ణ ల‌భిస్తుంది. 

ఈ విధంగా రిస్క్‌ల‌ను బీమా పాల‌సీతో క‌వ‌ర్‌ చేయ‌డం వ‌ల్ల ఆర్థికపరమైన ఆందోళనలకు దూరంగా ఉండచ్చు. బీమా, పెట్టుబడి కలిపి ఉండే పాలసీల నుంచి దూరంగా ఉండడం మేలు. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి కూడా తక్కువగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని