Covid Policies: కొవిడ్ ప్ర‌త్యేక పాల‌సీల గడువు పొడిగింపు!

కొవిడ్‌ పాల‌సీల‌.. పునరుద్ధ‌ర‌ణ‌, విక్రయాల‌కు సెప్టెంబ‌రు 30, 2022వ‌ర‌కు బీమా సంస్థలను.. ఐఆర్‌డీఏఐ అనుమతిచ్చింది.

Updated : 30 Mar 2022 13:39 IST


కొవిడ్‌-19 చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆరోగ్య పాలసీలు కరోనా రక్షక్‌, కరోనా కవచ్‌ పాలసీల గ‌డువు తేదిని పొడిగిస్తున్న‌ట్లు బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ తెల‌పింది. ఈ మేర‌కు మార్చి 28న ప్రకటన చేసింది. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలతో పాటు మిగతా ఆరోగ్య బీమా సంస్థలు సెప్టంబ‌రు 30, 2022 వరకు ఈ పాల‌సీల‌ను పునరుద్ధరించేందుకు, విక్రయించేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతినిచ్చింది.

కొవిడ్-19 చికిత్స కోసం ప్ర‌త్యేకంగా అందించే క‌రోనా క‌వ‌చ్‌, క‌రోనా ర‌క్ష‌క్ పాల‌సీల‌ను మొద‌ట జూన్ 2020 నుంచి మార్చి 31, 2021 వ‌ర‌కు అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే క‌రోనా సెకండ్‌, థ‌ర్డ్ వేవ్‌ల కార‌ణంగా పాల‌సీ గ‌డువును పెంచుతూ వ‌చ్చారు. ఈ పాల‌సీ విక్ర‌య‌, పున‌రుద్ధ‌ర‌ణ గ‌డువు మార్చి 31తో ముగియ‌నుండ‌గా, తాజాగా గ‌డ‌వు తేదిని మ‌రోసారి పొడిగిస్తున్న‌ట్లు ఐఆర్‌డీఏఐ తెలిపింది.

కరోనా కవచ్..

క‌రోనా క‌వ‌చ్ న‌ష్ట‌ప‌రిహార ఆధారిత ఆరోగ్య బీమా. కొవిడ్-19 బారిన ప‌డిన‌ప్పుడు ఈ పాలసీ పరిమితి వరకు ఖర్చులను తిరిగి చెల్లిస్తుంది. పాలసీ కనీసం రూ.50 వేలు, గరిష్ఠంగా రూ.5 లక్షల బీమా మొత్తాన్ని అందిస్తుంది. వ్యక్తగ‌తంగానూ, కుటుంబం కోసం ఫ్లోటర్ ప్లాన్‌గా కూడా పాల‌సీ అందుబాటులో ఉంటుంది. కొవిడ్ కార‌ణంగా.. క‌నీసం 24 గంట‌ల‌పాటు ఆసుప‌త్రిలో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఈ పాల‌సీ వ‌ర్తిస్తుంది.

కరోనా రక్షక్..

కరోనా రక్షక్.. ఒక ప్రామాణిక ప్రయోజన ఆధారిత (స్టాండ‌ర్డ్ బెనిఫిట్ బేస్డ్‌ ) ఆరోగ్య బీమా పథకం. పాల‌సీ తీసుకున్న వ్య‌క్తికి కొవిడ్-19 నిర్ధారణ అయితే, హామీ మొత్తాన్ని చెల్లిస్తారు. క‌నీసం రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.2.50 లక్షల క‌వ‌రేజ్‌తో ఈ పాల‌సీ అందుబాటులో ఉంది. వ్య‌క్తిగ‌తంగా మాత్ర‌మే ఈ పాలసీ తీసుకునే వీలుంది. కొవిడ్ కార‌ణంగా పాల‌సీదారుడు ఆసుప‌త్రిలో చేరి క‌నీసం 72 గంట‌ల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందితే ఈ పాల‌సీ వ‌ర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని