Year Ender 2021: సూచీల దూకుడు.. టెలికామ్‌కు జోష్‌.. ఈ ఏడాది కీలక పరిణామాలివే!

ఓ వైపు కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి.. మరోవైపు లాక్‌డౌన్లతో కాలగమనంలో మరో ఏడాది కలిసిపోయింది. గతేడాదిలానే ఈ సారి కూడా ప్రజలు కొన్ని నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు.

Updated : 23 Dec 2021 10:29 IST

ఓ వైపు కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి.. మరోవైపు లాక్‌డౌన్లతో కాలగమనంలో మరో ఏడాది కలిసిపోయింది. గతేడాదిలానే ఈ సారి కూడా ప్రజలు కొన్ని నెలలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, గతేడాది మాదిరిగా వాణిజ్య రంగం ఈసారి తీవ్ర ఒడుదొడుకులకు గురికాలేదు. దేశంలో సాధారణ పరిస్థితులే నెలకొన్నాయా అన్నంతగా స్టాక్‌ మార్కెట్‌ సూచీలు, జీఎస్టీ వసూళ్లు దూసుకెళ్లాయి. ఐపీవోలు సైతం మార్కెట్లో సందడి చేశాయి. ఎన్నడూ లేని స్థాయిలో స్టాక్‌ మార్కెట్‌వైపు యువరక్తం పరుగులు పెట్టింది. డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇదే సమయంలో పెట్రో ధరలు సామాన్యుడి జేబును గుల్ల చేయగా.. కేంద్రానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరింది. టెలికాం ఛార్జీల పెంపు సామాన్యుడికి ఖేదం మిగల్చగా.. కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాలు టెలికాం రంగంలో కొత్త జోష్‌కు కారణమయ్యాయి. మొత్తంగా ఈ ఏడాది వాణిజ్య రంగంలో చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలివే..


స్టాక్‌ కొత్త మైలురాళ్లు: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. కొవిడ్‌ భయాలున్నా సూచీలు జోరు చూపించాయి. సెన్సెక్స్‌ చరిత్రలో కీలకమైన 50 వేలు, 60వేల మైలురాళ్లను ఈ ఏడాదే అందుకోవడం విశేషం. గతేడాది మార్చిలో కనిష్ఠంగా 26 వేల స్థాయికి చేరుకున్న సెన్సెక్స్‌.. ఈ ఏడాది జనవరి 21న 50వేల మార్కు, సెప్టెంబర్‌ 24న 60వేల మార్కును అందుకుంది. గరిష్ఠంగా అక్టోబర్‌ 19న 62,245 పాయింట్లను తాకడం గమనార్హం. నిఫ్టీ సైతం ఈ ఏడాది జనవరిలో 14 వేల పాయింట్ల నుంచి 18,400 పాయింట్లకు ఎగబాకింది. ప్రస్తుతం 17 వేల వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్‌కు ముందు, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఫిబ్రవరి, ఏప్రిల్‌ నెలల్లో స్టాక్‌ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడినా అవేవీ రికార్డులను అధిగమించడంలో సూచీలను నిలువరించలేకపోయాయి.


సెంచరీ కొట్టిన పెట్రోల్‌: కొవిడ్‌ తర్వాత ఈ ఏడాది ఎక్కువగా ప్రజలు మాట్లాడుకుంది పెట్రోల్‌, డీజిల్‌ ధరల గురించే. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వీటి ధరలు సెంచరీ కొట్టాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు దేశీయ సుంకాలు తోడై సామాన్యుడి ‘చేతి చమురు’ బాగా వదిలింది. అయితే, ఈ ఏడాది దీపావళికి ముందు కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. పలు రాష్ట్రాలు సైతం వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంతమేర దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్‌ తగ్గించకపోవడంతో ఇక్కడి ప్రజలకు పెద్దగా ఊరట దక్కలేదు.


బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు: బంగారం ధరలు ఈ ఏడాది స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర ఎక్కువ కాలం రూ.47వేలు- రూ.49 వేల (పన్నులు లేకుండా) మధ్య కదలాడింది. జనవరి 1న బంగారం ధర రూ.49,940గా ఉండగా.. డిసెంబర్‌ 17న రూ.48,720 పలికింది. మార్చిలో రూ.44 వేల స్థాయికి వచ్చినప్పటికీ ధరలు నిలకడగా లేవు. వెండి సైతం హెచ్చుతగ్గులకు లోనైంది. జనవరి 1న కిలో వెండి రూ.72 వేలు పలకగా.. మే నెలలో గరిష్ఠంగా రూ.78,600కు చేరింది. ప్రస్తుతం రూ.66 వేలు పలుకుతోంది.


డీమ్యాట్‌ ఖాతాల జూమ్‌: రోజులు గడుస్తున్నకొద్దీ జనాల్లో ఆర్థిక అవగాహన పెరుగుతోంది. మదుపునకు ఉన్న మేలైన మార్గాలను ఎంపిక చేసుకోవడంలో తెలివిగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌.. ప్రజలకు చాలా ఆర్థిక పాఠాలు నేర్పింది. అందులో పెట్టుబడుల నిర్వహణ ఒకటి. ఇప్పటి వరకూ తక్కువ రాబడి అయినా సరే.. నష్టభయం మాత్రం ఉండొద్దనే ధోరణి అవలంబించేవారు. కానీ, కొవిడ్‌ సమయంలో వడ్డీరేట్లు ఒక్కసారిగా పడిపోవడంతో మేల్కొన్నారు. ఎక్కువ రాబడి, ఎక్కువ రిస్కు ఉండే స్టాక్ మార్కెట్‌ వైపు మళ్లారు. అందుకే చాలా మంది డీమ్యాట్‌ ఖాతాలు తెరిచి మార్కెట్లలో మదుపు చేయడం ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌ తదితర రంగాల్లో ఆదాయాలు పెరగడం, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండడం, ఇంతకు ముందులా కాకుండా డీమ్యాట్‌ అకౌంట్లతో సులభంగా ట్రేడింగ్‌ చేసే అవకాశం ఉండడం.. వంటి అంశాలు అన్నీ కలిసి డీమ్యాట్‌ ఖాతా పెరుగుదలకు కారణమయ్యాయి. 2018-19లో 3.5 కోట్లుగా ఉన్న డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 2019-20లో 4.09 కోట్లకు, 2020-21లో 5.5 కోట్లకు 2021-22 (అక్టోబరు 31వరకు)లో 7.3 కోట్లకు చేరింది. అంటే మూడేళ్లలో డీమ్యాట్‌ ఖాతాలు దాదాపు రెండింతలయ్యాయి.


ఐపీఓల సందడే సందడి: కొవిడ్‌ సంక్షోభ సమయంలో గతేడాది స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పాతాళానికి పడిపోయాయి. ఈ ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో తిరిగి పుంజుకున్నాయి. వ్యాక్సినేషన్‌ పెరిగి మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ సూచీలు పరుగులు పెట్టాయి. జీవితకాల గరిష్ఠాలకు చేరుకొని రికార్డులు సృష్టించాయి. దీన్ని అదునుగా భావించిన అనేక కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి మార్కెట్‌ విలువ పెంచుకొన్నాయి. చరిత్రలోనే అత్యధిక ఐపీఓలు ఈ ఏడాది నమోదయ్యాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 80 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. దాదాపు రూ.1.50 లక్షల కోట్లు సమీకరించాయి. ముఖ్యంగా ఇంటర్నెట్‌ ఆధారిత కంపెనీల హవా కొనసాగింది. వీటిలో కొన్ని బాగా రాణించగా.. మరికొన్ని మదుపర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పరాస్‌ డిఫెన్స్‌, ఎంటార్‌ టెక్‌, న్యురేకా, లేటెంట్‌ వ్యూ, ఈజీ ట్రిప్‌ వంటి కంపెనీలు 200 శాతం వరకు రిటర్న్స్‌ ఇచ్చాయి. ఇక సూర్యోదయ స్మాల్‌ ఫినాన్స్ బ్యాంక్‌, కార్‌ ట్రేడ్‌, పేటీఎం, విండ్లాస్ వంటి సంస్థలు మాత్రం మదుపర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి.


తయారీకి ఊతం: కొవిడ్‌తో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ 3.0 పేరుతో కొన్ని పథకాలను ప్రకటించింది.  ఇందులో ఉత్పత్తి రంగానికి ఊతమిచ్చేలా పలు ప్రోత్సాహకాలను తీసుకొచ్చింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ) కింద దాదాపు 13 రంగాలకు ఇప్పటి వరకు రూ.1.5 లక్షల కోట్లు విలువ చేసే ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇటీవల సెమీకండక్టర్ల పరిశ్రమకు రూ.76 వేల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంతకుముందు వైట్‌ గూడ్స్‌ (ఏసీలు, రిఫ్రిజిరేటర్లు), టెక్స్‌టైల్స్‌, టెలికాం, పునరుత్పాదక ఇంధనం, ఔషధ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఈ పథకం కింద ఎంపికైన సంస్థలకు పలు రాయితీలు లభిస్తాయి. తద్వారా ఉత్పత్తి పెరిగి స్వయం సమృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.


జీఎస్టీ.. వసూళ్ల జోరు: గతేడాది కొవిడ్‌ మహమ్మారి కారణంగా పడిపోయిన జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది భారీగా పుంజుకున్నాయి. మే (రూ.97వేల కోట్లు), జూన్‌ (రూ.92 వేల కోట్లు) నెలలు మినహాయిస్తే అన్ని నెలలూ రూ.లక్ష కోట్ల మేర వసూళ్లు సాధించాయి. జనవరిలో రూ.1.19 లక్షల కోట్లు వసూలు కాగా.. ఏప్రిల్‌లో గరిష్ఠంగా రూ.1.39 లక్షల కోట్లు మేర జీఎస్టీ రూపంలో ఖజానాకు చేరింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం. నవంబర్‌లో సైతం రూ.1.31 లక్షల కోట్లు వసూలయ్యాయి.


20 నెలల కనిష్ఠానికి రూపాయి: ఏడాదంతా చురుగ్గా కదలాడిన రూపాయి సంవత్సరాంతంలో డీలా పడింది. ఈ ఏడాది జనవరిలో డాలరుతో రూపాయి మారకం విలువ  రూ.73గా ఉంది. ఏడాదంతా దాదాపు 73 నుంచి 75 మధ్యే కదలాడింది. అయితే, డిసెంబర్‌ 16న 76.28కి చేరింది. గతేడాది ఏప్రిల్‌ 24 తర్వాత రూపాయి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడ్‌ సిద్ధమవవ్వడానికి తోడు ఒమిక్రాన్‌ భయాలు రూపాయి విలువ పతానికి కారణమయ్యాయి. రూపాయి మరింత పడిపోయే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. రూపాయి విలువ పతనం అయితే విదేశాలకు ఎగుమతులు చేసే వారికి లాభిస్తుంది. చమురు వంటి దిగుమతులపైనా, విదేశాల్లో చదువుకునే వారిపైనా దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది.


టెలికాం రంగానికి జోష్‌: 2021 సంవత్సరం.. టెలికాం రంగానికి కొత్త జోష్‌ను ఇచ్చింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల చెల్లింపులపై నాలుగేళ్లపాటు మారటోరియం విధించడం ద్వారా టెలికాం కంపెనీలకు కేంద్రం తీపికబురు చెప్పింది. దీనికి తోడు నూరు శాతం ఎఫ్‌డీఐలకు ఓకే చెప్పింది. దీంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న టెలికాం రంగంలో తిరిగి జవసత్వాలు వచ్చాయి. దేశంలో మున్ముందు 5జీ నెట్‌వర్క్‌ విస్తరణకు అవసరమైన పెట్టుబడులు పోటెత్తేందుకు ఈ చర్య దోహదపడే అవకాశముంది. అదే సమయంలో ఇటీవల టెలికాం కంపెనీలు ఒక వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ఆర్పు) పెంచుకునేందుకు దాదాపు అన్ని కంపెనీలూ (బీఎస్‌ఎన్‌ఎల్‌ మినహా) 20 శాతం ప్రీపెయిడ్‌ ఛార్జీలను పెంచాయి. దీంతో ఆయా కంపెనీల ఆదాయం బాగా పెరగనుంది. అదే సమయంలో సగటు వినియోగదారుడికి మొబైల్‌ వినియోగం భారంగా మారింది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని