
Stock Market: ఆరంభ లాభాలు ఆవిరి!
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం నుంచి దాదాపు చివరి గంటన్నర వరకు భారీ లాభాల్లో పయనించిన సూచీలకు గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. దీంతో ఉదయపు సెషన్‌లో వచ్చిన లాభాలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి.
సూచీల పయనం సాగిందిలా...
ఉదయం సెన్సెక్స్ 57,795.11 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైంది. ఓ దశలో 800 పాయింట్లకు పైగా లాభపడి ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అక్కడి నుంచి దాదాపు చివరి గంటన్నర వరకు లాభాల జోరు కొనసాగింది. కానీ ఒక్కసారిగా మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. చివరకు 76.71 పాయింట్ల నష్టంతో 57,200.23 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 58,084.33 - 57,119.28 మధ్య కదలాడింది. నిఫ్టీ 17,208.30 వద్ద లాభాలతో ప్రారంభమైంది. రోజులో 17,373.50 - 17,077.10 మధ్య కదలాడింది. చివరకు 8.20 పాయింట్ల నష్టంతో 17,101.95 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.03 వద్ద నిలిచింది.
కనిష్ఠాల వద్ద కొనుగోళ్లు.. గరిష్ఠాల వద్ద అమ్మకాలు..
వడ్డీ రేట్ల పెంపునకు ఫెడ్ సంకేతాలివ్వడంతో గురువారం మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. పైగా గత కొన్ని రోజులుగా మార్కెట్లు భారీగా దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో గరిష్ఠాల నుంచి పోలిస్తే చాలా స్టాక్‌ల విలువ తగ్గడంతో కీలక రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో ఉదయం సెషన్‌లో సూచీలు లాభాల్లో పరుగులు తీశాయి. బలమైన త్రైమాసిక ఫలితాలు దీనికి దోహదం చేశాయి. కానీ, బడ్జెట్‌పై అస్థిరత, ఫిబ్రవరి సీజన్‌పై అనుమానం, వారాంతం భయాల వంటి పరిణామాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్ సెక్టార్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
మరిన్ని విశేషాలు...
* సెన్సెక్స్ 30 సూచీలో ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, విప్రో, భారతీఎయిర్‌టెల్, ఐటీసీ, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. మారుతీ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి.
* చంబల్ ఫెర్టిలైజర్స్ మూడో త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో ఈరోజు కంపెనీ షేర్లు 5 శాతం వరకు పతనమయ్యాయి. కంపెనీ నికర ఆదాయంలో 14 శాతం కోత పడటం గమనార్హం.
* ఎయిర్‌టెల్‌లో గూగుల్ 1 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనుంది. దీంతో ఎయిర్‌టెల్ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో దాదాపు 2 శాతం వరకు లాభపడ్డాయి.
* నిఫ్టీ 50 సూచీలో 31 షేర్లు లాభపడగా.. 19 షేర్లు నష్టపోయాయి.