Mahindra Group: ఆర్‌బీఎల్‌ వాటాలపై మహీంద్రా గ్రూప్‌ దృష్టి..!

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో వాటాలు కొనేందుకు పారిశ్రామిక దిగ్గజ సంస్థ మహీంద్రా గ్రూప్‌ యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Published : 26 Jul 2023 14:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (RBL Bank)లో దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం మహీంద్రా గ్రూప్‌ (Mahindra Group) వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. దాదాపు 4శాతం వాటాను ఓపెన్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించడానికి ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నిరాకరించింది. ఈ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటాదారుగా ఉండేందుకు అనుమతి లభిస్తే 15-20శాతం వాటాను దక్కించుకోవాలని మహీంద్రా భావిస్తోంది.

ప్రస్తుతం ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం దిగ్గజ పారిశ్రామిక సంస్థలు అత్యధికంగా ఏదైనా బ్యాంక్‌లు 10శాతం వరకూ వాటాలను కొనుగోలు చేయవచ్చు. కానీ, ప్రమోటర్లుగా మాత్రం ఉండకూడదు. అంతేకాదు.. ఈ సంస్థలకు బ్యాంకింగ్‌ లైసెన్స్‌లను ఇవ్వడాన్ని కూడా నిషేధించింది. వాస్తవానికి ఈ గ్రూప్‌ గతంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షాయల్‌ సర్వీస్‌ ద్వారా ఆర్థిక సేవల రంగంలోకి అడుగు పెట్టింది. 

వేర్వేరు ఈపీఎఫ్‌ ఖాతాలు ఉన్నాయా? విలీనం చేయకపోతే ఏమవుతుంది?

మరోవైపు ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ గత కొన్నేళ్లుగా ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. పదవీకాలం పొడిగించకపోవడంతో బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా విశ్వేశ్వర్‌ అహూజా వైదొలగారు. ఆయన హఠాత్తుగా వైదొలగడం, ఆర్‌బీఐ ఈ బ్యాంక్‌ కార్యకలాపాలు, ఆర్థిక పటిష్టతపై దృష్టి పెట్టింది. ఈ బ్యాంక్‌లో బేరింగ్స్ ఏషియాకు 10శాతం వాటా, గజా క్యాపిటల్‌, సీడీసీలు ఈ బ్యాంక్‌లో వాటాదారులగా ఉన్నారు. 

ఇటీవల ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.288 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వచ్చిన లాభంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ.1,246 కోట్లకు చేరింది. రుణాలు 21 శాతం వృద్ధి చెందడంతో నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) కూడా 0.48 శాతం పెరిగి 4.84 శాతానికి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని