Anand mahindra: కుంభకోణం వెలుగులోకి వచ్చే ఏడాది ముందే రామలింగరాజును కలిశా: ఆనంద్‌ మహీంద్ర

‘సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ను విలీనం చేసుకునే ప్రతిపాదనతో ఆ కంపెనీ ఛైర్మన్‌ రామలింగ రాజును సంప్రదించాను. అయితే ఇది ఆ సంస్థ కుంభకోణం వెలుగులోకి వచ్చే ఏడాది ముందే జరిగింది.

Updated : 21 Jan 2023 08:14 IST

కుంభకోణం బయటపడే ఏడాది ముందే విలీనాన్ని కోరా: ఆనంద్‌ మహీంద్రా

ముంబయి: ‘సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ను విలీనం చేసుకునే ప్రతిపాదనతో ఆ కంపెనీ ఛైర్మన్‌ రామలింగ రాజును సంప్రదించాను. అయితే ఇది ఆ సంస్థ కుంభకోణం వెలుగులోకి వచ్చే ఏడాది ముందే జరిగింది. అయితే నా ప్రతిపాదనకు రామలింగరాజు నుంచి స్పందన రాలేదు. ఆ కంపెనీ ఖాతాల్లో పొరబాట్లు ఆయనకు ముందే తెలుసు కాబట్టే స్పందించలేదేమో’.. అని అప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు.

రూ.5,000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఎక్స్ఛేంజీలకు రామలింగరాజు లేఖ రాయడం మొదలుకుని.. సత్యం కంప్యూటర్స్‌ను విలీనం చేసేందుకు, టెక్‌ మహీంద్రాను ప్రభుత్వ బోర్డు ఎంపిక చేసినంత వరకు జరిగిన 100 రోజుల ప్రయాణంపై రాసిన పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంలో రామలింగరాజు కీలక పాత్ర పోషించారు. అలా ఆయన నాకు బాగా తెలుసు. ఆ చనువుతోనే టెక్‌ మహీంద్రా, సత్యం కంప్యూటర్స్‌ విలీన ఆఫర్‌తో ఆయన ముందుకు వెళ్లాను. అప్పటికి టెక్‌ మహీంద్రా ఆదాయం 1 బిలియన్‌ డాలర్లుగా ఉండేది. సత్యంనూ కలుపుకుంటే మరింత పెద్ద సంస్థగా మారుతుందన్న ఆలోచనతో ఆ విధంగా చేశాను. ఆ తర్వాత ఏడాదికి సత్యంలో కుంభకోణం బయటపడింది. సత్యం అమ్మకం సమయంలో, కుంభకోణం అనంతరం ఉన్న సంక్లిష్టతల దృష్ట్యా ఎల్‌ అండ్‌ టీ మినహా ఏ కంపెనీ కూడా మాకు పోటీలో నిలవలేదు. చివరకు ఎల్‌ అండ్‌ టీ వేసిన రూ.45.90(ఒక్కో షేరుకు) బిడ్‌తో పోలిస్తే ఎక్కువగా రూ.58తో బిడ్‌ వేసి విజయవంతమయ్యామ’ని ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని