Satya Nadella: విండోస్‌ ఫోన్లను ఆపేయడం తప్పే.. అంగీకరించిన సత్య నాదెళ్ల

Satya Nadella: విండోస్‌ ఫోన్లను ఆపేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ 2017లో ప్రకటించింది. అయితే, తాను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఇదొకటని సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. అయితే, అది తప్పుడు నిర్ణయమని కూడా ఆయన విచారం వ్యక్తం చేశారు.

Updated : 25 Oct 2023 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Microsoft CEO Satya Nadella) తాను తీసుకొన్న ఓ తప్పుడు నిర్ణయాన్ని బహిరంగంగా అంగీకరించారు. విండోస్‌ మొబైల్‌ (Windows Mobile) వ్యాపారం నుంచి నిష్క్రమించడం పట్ల తాను ఇప్పటికీ విచారిస్తున్నట్లు వెల్లడించారు. పర్సనల్‌ కంప్యూటర్లు, ట్యాబ్లెట్ల మధ్య ఉన్న గ్యాప్‌ను పూడ్చడానికి మొబైల్‌ ఓ మంచి మార్గమని అభిప్రాయపడ్డారు. దాన్ని మరింత సమర్థంగా నిర్వహించి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఇటీవల ‘బిజినెస్‌ ఇన్‌సైడర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌ నుంచి నిష్క్రమించాలన్న తన నిర్ణయంపై విస్తృత చర్చ జరిగినట్లు సత్య నాదెళ్ల (Satya Nadella) తెలిపారు. చాలా విమర్శలు వచ్చాయన్నారు. సీఈఓ అయిన తర్వాత తాను తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో అదొకటని పేర్కొన్నారు. ఇతర మార్గాల్లో మొబైల్‌ ఫోన్‌ వ్యాపారాన్ని కొనసాగించడంపై ఆలోచించాల్సి ఉండిందని అభిప్రాయపడ్డారు. విండోస్‌ 10 మొబైళ్లకు కొత్త ఫీచర్లు, హార్డ్‌వేర్‌ ఇవ్వబోమని 2017లో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) ప్రకటించిన విషయం తెలిసిందే. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ ఆధారిత ఫోన్లు మార్కెట్‌లో దూసుకెళ్లడంతో విండోస్‌ ఫోన్ల (Windows Mobile)కు గిరాకీ తగ్గింది. 2019 డిసెంబర్‌ తర్వాత విండోస్‌ 10 మొబైల్‌ యూజర్లకు ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్లు, బగ్‌ ఫిక్స్‌లు అందలేదు. దీంతో క్రమంగా విండోస్‌ ఫోన్లు కనపడకుండా పోయాయి.

2014లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల (Satya Nadella) కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. 2015లో దాదాపు 7,800 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించాలని నిర్ణయించారు. వీరిలో అత్యధిక మంది మొబైల్‌ ఫోన్ల విభాగం నుంచే కావడం గమనార్హం. అలాగే నోకియా ఫోన్‌ బిజినెస్‌ కొనుగోలుకు వెచ్చించిన 7.6 బిలియన్‌ డాలర్లను రైటాఫ్‌ చేశారు. తద్వారా మొబైల్‌ వ్యాపారం నుంచి వైదొలగి కేవలం విండోస్‌ ఓఎస్‌ ఆధారిత బిజినెస్‌పైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. విండోస్‌ మొబైల్‌ తర్వాత మైక్రోసాఫ్ట్‌.. సర్ఫేస్‌ డ్యుయో, సర్ఫేస్‌ డ్యుయో 2 అనే రెండు ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్లను తీసుకొచ్చింది. కానీ, వాటి సీక్వెల్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ల విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో సర్ఫేస్‌ డ్యుయో భవిష్యత్‌పై స్పష్టత కొరవడింది.

ఇలా మొబైల్‌ బిజినెస్‌ విషయంలో మైక్రోసాఫ్ట్‌ తప్పు చేసిందంటూ అంగీకరించిన మూడో సీఈఓ సత్య నాదెళ్ల. ఆండ్రాయిడ్‌ను కోల్పోడం మైక్రోసాఫ్ట్‌ చేసిన అతిపెద్ద తప్పిదాల్లో ఒకటని మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ గతంలో ఓసారి అన్నారు. ఆండ్రాయిడ్‌ను గూగుల్‌ 2005లో 50 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మరో మాజీ సీఈఓ స్టీవ్‌ బామర్‌ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల ప్రాధాన్యతను ముందుగా గుర్తించడంలో తాను విఫలమైనట్లు అంగీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని