Microsoft: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టెక్ దిగ్గజం

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి జీతాలను దాదాపు రెండింతలు చేస్తామని వెల్లడించింది.

Updated : 17 May 2022 14:18 IST

వాషింగ్టన్‌: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వారి జీతాలను దాదాపు రెండింతలు చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సత్యనాదెళ్ల సిబ్బందికి ఈ మెయిల్ ద్వారా వెల్లడించారు. 

‘మన వినియోగదారులు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంలో మీరు అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారు. అందుకే మన సంస్థ ఉద్యోగులకు అధిక డిమాండ్ ఉంది. సంస్థపై మీ ప్రభావాన్ని గుర్తించాం. ఈ విషయంలో మీకు నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే మీపై దీర్ఘకాలిక పెట్టుబడి పెడుతున్నాం. ఆ నిమిత్తం మేం గ్లోబల్ మెరిట్ బడ్జెట్‌ను రెట్టింపు చేస్తున్నాం. ఈ పెంపు స్థానిక డేటా ఆధారంగా వివిధ దేశాల్లో ఒక్కోరకంగా ఉంటుంది’ అంటూ నాదెళ్ల వెల్లడించారు. ఈ క్రమంలో సిబ్బందికి స్టాక్స్ రూపంలో ఇచ్చే సౌలభ్యాలు పెరగనున్నాయి. ఇటీవల కాలంలో సంస్థలో చేరినవారు,  కెరీర్ మధ్యలో ఉన్నవాళ్ల జీతాల్లో ఈ పెరుగుదల ప్రధానంగా కనిపించనుంది. 

తమ టాలెంట్‌ బయటకు వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు పలు సంస్థలు ఇదే తరహా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో కార్పొరేట్, టెక్ ఉద్యోగుల మూల వేతనాన్ని అమెజాన్‌ సంస్థ దాదాపు రెట్టింపు చేసింది. జనవరిలో గూగుల్ తన నలుగురు టాప్‌ ఎగ్జిక్యూటివ్స్ జీతాలను భారీగా పెంచింది. వారి మూల వేతనం 6,50,000 డాలర్ల నుంచి ఒక మిలియన్‌ డాలర్లకు పెరిగింది. 

ఈ కరోనా కాలంలో గ్రేట్ రెజిగ్నేషన్ ఎక్కువగా వినిపిస్తోంది. ఉద్యోగులు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ, అధిక వేతనం వచ్చే వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ పరిస్థితి అగ్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మరోపక్క కార్యాలయాలకు రావడం కంటే ఇంటి నుంచి పనికే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. కార్యాలయాలకు రమ్మంటే ఉద్యోగాలను వీడటానికి సిబ్బంది వెనకాడటం లేదు. వీటికి ద్రవ్యోల్బణ పరిస్థితులు తోడయ్యాయి. ఇవన్నీ కలిసి ఈ భారీ స్థాయి పెంపునకు దోహదం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని