Budget 2022: రిట‌ర్నుల‌లో ఏదైనా ఆదాయం తెల‌ప‌డం మ‌ర్చిపోయారా?

2022-23 బ‌డ్జెట్‌లో స‌వ‌రించిన ఐటీఆర్ ఫైలింగ్ కోసం కొత్త విధానాన్ని ప్ర‌తిపాదించారు.

Published : 02 Feb 2022 01:21 IST

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేసేట‌ప్పుడు పొదుపు ఖాతా లేదా మ‌రేదైనా ఆదాయాన్ని తెల‌ప‌డం మ‌ర్చిపోయారా? రిట‌ర్నుల‌ను స‌రిచేసుకోవ‌చ్చు. 2022-23 బ‌డ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స‌వ‌రించిన ఐటీఆర్ ఫైలింగ్ కోసం కొత్త విధానాన్ని ప్ర‌తిపాదించారు. అదే అప్‌డేటెడ్ ట్యాక్స్ రిటర్న్‌. ఈ విధానం ప్ర‌కారం ప‌న్ను చెల్లింపుదారుడు ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు స‌మ‌యంలో ఏదైనా ఆదాయాన్ని తెల‌ప‌డం మ‌ర్చిపోయినా లేదా త‌ప్పుగా న‌మోదు చేసినా..సంబంధిత అసెస్‌మెంట్ సంవ‌త్స‌రం ముగిసిన 2 ఏళ్ల లోపు స‌వ‌రించుకునే వెసులుబాటు క‌ల్పించింది. ఇందుకోసం సెక్ష‌న్ 139 లో స‌బ్ సెక్ష‌న్ 8ఏను చేర్చాల‌ని ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది.

ఆదాయ‌పు ప‌న్ను సెక్ష‌న్ 139 ప్ర‌కారం ప‌న్ను చెల్లింపుదారులు జులై 31 లోపు అసెస్‌మెంట్ సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ రిట‌ర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ప్ర‌భుత్వం ఏదైనా కార‌ణం చేత రిట‌ర్నుల దాఖ‌లు గ‌డువును పెంచితే ఆ తేది లోపు ఐటీఆర్ దాఖ‌లు చేయాలి. 

ఐటీఆర్ ఆల‌స్యం అయితే.. 
aపన్ను చెల్లించాల్సి ఉంది, గ‌డువు తేది లోపు ఐటీఆర్ ఫైల్ చేయని వారు సెక్ష‌న్ 139 లోని స‌బ్ సెక్ష‌న్ (4) ప్ర‌కారం అసెస్‌మెంట్ సంవ‌త్స‌రం ముగియ‌డానికి 3 నెల‌ల ముందు లేదా అసెస్‌మెంట్ ముగింపు.. ఏది ముందు అయితే ఆ తేది నాటికి ఆల‌స్య రుసుముతో ఐటీఆర్ ఫైల్ చేయ‌వ‌చ్చు. 

స‌వ‌రించిన ఐటీఆర్‌..
ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 139, స‌బ్ సెక్ష‌న్ (5) ప్రకారం.. స‌బ్‌సెక్ష‌న్‌(1), స‌బ్ సెక్ష‌న్‌(4) కింద దాఖ‌లు చేసిన ఐటీఆర్‌లో ఏదైనా త‌ప్పులు ఉంటే స‌వ‌రించుకునే అవ‌కాశం ఉంది. అయితే, స‌వ‌ర‌ణ‌లు అసెస్‌మెంట్ సంవ‌త్స‌రం ముగియ‌డానికి మూడు నెల‌ల ముందు లేదా అసెస్‌మెంట్ ముగింపు.. ఏది ముందు అయితే ఆ తేది నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. 

అద‌న‌పు ప‌న్ను చెల్లించాల్సి రావ‌చ్చు..

ఈ గ‌డువు ముగిసిన త‌ర్వాత ఐటీఆర్‌లో ఏదైనా ఆదాయం నివేదించ‌క‌పోయినా లేదా త‌ప్పులు ఉన్నా అప్‌డేటెడ్ ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌డం అనేది చాలాకాలం నుంచి కోరుతున్న ప‌న్ను సంస్క‌ర‌ణ‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విధానం చ‌ట్టంలో లేదు. ప‌న్ను దాఖ‌లు చేసేట‌ప్పుడు ఆదాయం, ఖ‌ర్చుల‌ను స‌రిపోల్చ‌డంలో స‌వాళ్ల‌ను ఎదుర్కొనే ప‌న్ను చెల్లింపుదారుల‌కు తాజా నిర్ణ‌యంతో కొంత‌ రిట‌ర్నుల విష‌యంలో కొంత వెసులుబాటు ల‌భిస్తుంది.  

అయితే ఈ వెసులుబాటు ఉన్న‌ప్ప‌టికీ ప‌న్ను చెల్లించాల్సిన భాద్య‌త ఉన్న వారు చెల్లింపుల విష‌యంలో అప్ర‌మ‌త్తంగానే ఉండాలి. ఒక‌వేళ మీరు ఆదాయం తెల‌ప‌డం మ‌ర్చిపోయి.. ఆ ఆదాయంపై ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తే.. మీరు చెల్లించాల్సిన ప‌న్ను మొత్తంపై 25 నుంచి 50 శాతం వ‌ర‌కు అద‌న‌పు ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. అందువ‌ల్ల, అద‌న‌పు ప‌న్ను ప‌డ‌కుండా రిట‌ర్నుల స‌మ‌యంలో త‌ప్పులు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని