విజ్ఞాన రాజధానిగా భారత్‌: పీయూష్‌ గోయల్‌

జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్దికి బాటలు వేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఎఫ్‌ఐసీసీఐ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌

Published : 26 Feb 2021 22:40 IST

నూతన జాతీయ విద్యా విధానంతో సాధ్యమన్న కేంద్రమంత్రి

దిల్లీ: జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్దికి బాటలు వేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఎఫ్‌ఐసీసీఐ హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో ఆయన శుక్రవారం ప్రసంగించారు. ఈ నూతన విధానం మన విద్యార్థుల దృక్పథాన్ని మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. మనం చేసే ఈ ప్రయత్నంతో ప్రపంచానికి భారత్‌ విజ్ఞాన రాజధానిగా మారుతుందన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో నాణ్యమైన విద్యను పొందేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని ఆయన వెల్లడించారు.

‘‘ఈ నూతన విధానంతో దేశంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన సమాన విద్యను పొందుతారు. మనం ముందుగా మన పిల్లలకు జీవన నైపుణ్యాలు నేర్పించాలి. వ్యక్తిత్వ వికాసం, బాధ్యతగా ఉండటం వంటివి నేర్పండి. జాతీయ స్ఫూర్తిని పెంచండి. మంచి పౌరులుగా వారిని సిద్ధం చేయండి. అదే మనం వారికి నేర్పే అసలైన విద్య. జీవితంలో మనం ఏదొకటి నేర్చుకోవడం, మన జ్ఞానాన్ని సమాజానికి పంచడం ముఖ్యం’’ అని ఆయన తెలిపారు.

అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లోని విదేశీ విద్యార్థులు మన దేశంలోని ఐఐటీలు, ఐఐఎంలలోనే కాకుండా ఇతర విద్యాసంస్థల్లో కూడా చేరే స్థాయికి భారత విద్యావ్యవస్థ చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ నిర్మాణంలో, పేదరికాన్ని ఎదుర్కోవడంలో పాఠశాలలు, ఉపాధ్యాయులు చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు. విద్య ద్వారానే మిగతావన్నీ వస్తాయని ఆయన అన్నారు. ఎందరో నిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టామని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

లగేజ్‌ లేకపోతే.. విమాన టికెట్‌పై డిస్కౌంట్

పర్వతశ్రేణులు.. ఎన్నో అందాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని