ఈ ఏడాది టాప్‌ ఎస్‌యూవీలు ఇవే..

కొవిడ్‌ వ్యాప్తి తీవ్రం కావడంతో లాక్‌డౌన్‌ విధించినా భారత్‌లో స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ డిమాండ్‌ పై ఎటువంటి ప్రభావం చూపలేదు. కొత్త ఎస్‌యూవీల విడుదల అంశంలో మాత్రం కొంత ఆలస్యమైంది. దీంతోపాటు పలు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లు కూడా మార్కెట్‌ను తాకాయి. ముఖ్యంగా ద.కొరియా, జపాన్‌, అమెరికాలకు చెందిన కంపెనీలు

Published : 30 Dec 2020 16:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ వ్యాప్తి తీవ్రం కావడంతో లాక్‌డౌన్‌ విధించినా భారత్‌లో స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ డిమాండ్ పై ఎటువంటి ప్రభావం చూపలేదు. కొత్త ఎస్‌యూవీల విడుదల అంశంలో మాత్రం కొంత ఆలస్యమైంది. దీంతోపాటు పలు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లు కూడా మార్కెట్‌ను తాకాయి. ముఖ్యంగా ద.కొరియా, జపాన్‌, అమెరికాలకు చెందిన కంపెనీలు ఎస్‌యూవీలను విడుదల చేయడం విశేషం. కొత్త నిబంధనల ప్రకారం అన్నీ బీఎస్‌-6 ఇంజిన్లతో మార్కెట్లోకి వచ్చాయి.

అదరగొట్టిన కియా ‘సోనెట్‌’..

దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ భారత్‌లో మరో కారును విడుదల చేసింది. సోనెట్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ కారు.. సెల్టోస్‌లోనే కొంచెం చిన్న వెర్షన్‌. అతితక్కువ కాలంలో భారీగా అమ్ముడుపోయింది. మొత్తం 11,417 కార్లను విక్రయించింది. ఇది కంపెనీ మొత్తం విక్రయించిన కార్లలో సగానికి సమానం.  ఈకారును మొత్తం మూడు ఇంజిన్లలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు ఫీచర్లను బట్టి పలు వేరియంట్ల రూపంలో అందిస్తోంది.

నిస్సాన్‌ మాగ్నైట్‌

నిస్సాన్‌ సంస్థ ఈ నెలలో విడుదల చేసిన మాగ్నైట్‌ రకం భారీ బుకింగ్స్‌ను సొంతం చేసుకొంది. అత్యధిక ఫీచర్లతో వచ్చిన ఈ కారు కేవలం ఐదు రోజుల్లో 5 వేల బుకింగ్స్‌ను సొంతం చేసుకొంది. దాదాపు 50వేల ఎంక్వైరీలు వచ్చాయి. ఈ కారు టాప్‌ ట్రిమ్‌లకు అత్యధిక డిమాండ్‌ ఉంది.  ఈ కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. దీంతోపాటు వైర్‌లెస్‌ యాపిల్‌ కార్‌ప్లే, అండ్రాయిడ్‌ ఆటో, 7 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్‌, ఆటోమేటిక్‌ ఏసీ, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్‌ ఓఆర్‌వీఎంలు, పుష్‌బటన్‌ స్టార్ట్‌, క్రూజ్‌కంట్రోల్‌, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇక ఎక్స్‌వీ, ఎక్స్‌వీ ప్రీమియంలో టెక్‌ప్యాక్‌ను అందిస్తుంది. రక్షణ కోసం ఏబీఎస్‌, ఈబీడీ, యాంటీరోల్‌ బార్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్‌, సీట్‌బెల్ట్‌ రిమైండర్‌, రియర్‌ విండో డీఫాగర్‌, అత్యవసర సమయాల్లో మరింత రక్షణ ఇచ్చే 3పాయింట్‌ రియర్‌ సీట్‌ బెల్ట్‌ వంటివి ఉన్నాయి. రియర్‌ వ్యూ 360డిగ్రీ కెమెరా, హిల్‌స్టార్ట్‌ అసిస్ట్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, హైడ్రాలిక్ బ్రేక్‌ అసిస్ట్‌, రిమోట్‌ కీలెస్‌ ఎంట్రీని ఇచ్చారు. అధిక ఫీచర్లు, ఆకర్షణీయమైన ధర ఉండటంతో డిమాండ్‌ బాగుంది.

విటార బ్రెజా ఫేస్‌లిఫ్ట్‌..

మారుతీసుజుకీ సంస్థ తన విటార బ్రెజా మోడల్‌ కారుకు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి ఈ కారు విడుదలైనప్పటి నుంచి అద్భుతమైన అమ్మకాలను సొంతం చేసుకొంది. అత్యంత వేగంగా 5.5లక్షల విక్రయాల మార్కును దాటేసింది. చిన్నచిన్న మార్పులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. డేటైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌, ఏఎంటీ, హిల్‌హోల్డింగ్‌ అసిస్ట్‌ ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

సరికొత్త క్రెటా..

హ్యూందాయ్‌కు ఎస్‌యూవీ విభాగంలో క్రెటా భారీ విజయాన్ని అందించింది. భారత్‌లో బెస్ట్ సెల్లింగ్‌  కాంపాక్ట్‌ ఎస్‌యూవీ రికార్డును సొంతం చేసుకొంది. ఈ ఏడాది మార్చిలో రిలీజైన సరికొత్త వెర్షన్‌ అక్టోబర్‌ నాటికి 1.15 లక్షల బుకింగ్స్‌ను సొంతం చేసుకొంది. మొత్తం విక్రయాల్లో 60శాతం డీజిల్‌ క్రెటానే ఉండటం విశేషం. ఇది మూడు రకాల ఇంజిన్లలో లభించడం,  బ్లూలింక్‌ టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండటం వినియోగదారులను ఆకర్షిస్తోంది.

దేశీయ ఆఫ్‌రోడ్‌ ‘థార్‌’

భారత్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా సంస్థ ‘థార్‌’లో సరికొత్త మోడల్‌ను అక్టోబర్‌లో విడుదల చేసింది. కొన్ని నెలల్లో ఇది దాదాపు 20వేల బుకింగ్స్‌ను సొంతం చేసుకొంది. ప్రస్తుతం సరికొత్త థార్‌ చేతికి అందాలంటే కనీసం 5 నెలలు ఎదురు చూడాల్సిందే. ఎల్‌ఎక్స్‌, ఏఎక్స్‌ ట్రిమ్‌లలో ఈ కారును మహీంద్రా ఆఫర్‌ చేసింది. ఇప్పుడు కేవలం ఎల్‌ఎక్స్‌కు మాత్రమే బుకింగ్స్‌ను స్వీకరిస్తోంది. 2.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, 2.2లీటర్‌ డీజిల్‌ ఇంజిన్లలో ఈ కారు లభిస్తోంది. ఎన్‌సీఏటీ క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారుకు ఫోర్‌స్టార్‌ రేటింగ్‌ లభించింది. 

సరికొత్త ఎండీవర్‌..

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్డు సరికొత్త ఎండీవర్‌ వెర్షన్‌ను విడుదల చేసింది. గతంలో ఉన్న 3.2 లీటర్‌ , 2.2 లీటర్‌ ఇంజిన్లను మార్చేసి పూర్తిగా 2.0లీటర్‌ ఇంజిన్‌ను అమర్చింది. ప్రపంచలోనే తొలిసారి 10స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను ఈ కారుకు అమర్చింది. దీంతోపాటు లుక్స్‌లో కొన్ని మార్పులు చేసింది. 

టాటా సరికొత్త హారియర్‌..

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజ సంస్థ టాటా తన ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ కారు హారియర్‌లో మార్పులు చేసింది. మార్చిలో సరికొత్త కారును తీసుకొచ్చింది. 17 అంగుళాల డ్యూయల్‌ టోన్‌ అలాయ్ ‌వీల్స్‌, దీంతో పాటు హ్యూందాయ్‌ 2.0 లీటర్‌ ఇంజిన్‌తో దీనిని మార్కెట్లోకి తెచ్చింది.

ఇవీ చదవండి

భారత మార్కెట్లోకి మాగ్నైట్‌ ఎస్‌యూవీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని