భౌతిక బంగారం Vs సావ‌రిన్ గోల్డ్ బాండ్స్.. పెట్టుబ‌డికి ఏది మంచిది?

గోల్డ్ బాండ్స్‌లో ఒక గ్రాము బంగారానికి రూ. 100 దాకా సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ పెట్టుబ‌డిదారునికి లాభం రావచ్చు.

Updated : 04 Dec 2021 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 24 క్యారెట్ల భౌతిక బంగారం ధ‌ర ప్ర‌స్తుతం ఒక గ్రాముకు రూ.4,882 వ‌ర‌కు ఉంది. అదే సావ‌రిన్ గోల్డ్ బాండ్‌లో ధ‌ర ఆఫ్‌లైన్ వినియోగ‌దారుల‌కు గ్రాముకు రూ.4,791 ఉండ‌గా.. ఆన్‌లైన్లో కొనుగోలు చేసేవారికి రూ.4,741కు లభిస్తుంది. గోల్డ్ బాండ్స్‌లో ఒక గ్రాముకి రూ.100 దాకా లాభం వ‌స్తుంది. సాధార‌ణంగా బంగారాన్ని బిస్కెట్ రూపంలో కాకుండా ఆభ‌ర‌ణాల రూపంలో కొన‌డానికే వినియోగ‌దారులు ఇష్ట‌ప‌డుతుంటారు. ఆభ‌ర‌ణాల త‌యారీ ఛార్జీలు, త‌రుగు లాంటివి ఉంటాయి. నాణ్య‌త విష‌యంలో బంగారం ఆభ‌ర‌ణాల‌కు 24 క్యారెట్స్ ఉండ‌దు, 22 క్యారెట్స్ మాత్ర‌మే ఉంటుంది. మరి కొందరు వ్యాపారులు 22 క్యారెట్స్ బంగారం రేటును వ‌సూలు చేస్తారు. అయితే, త‌రుగు ఖ‌ర్చులు 6% నుంచి 18% దాకా వినియోగ‌దారుని నుంచి వ‌సూలు చేస్తారు. ఇదంతా కూడా భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసే వారికి అధిక ఖ‌ర్చు కావ‌డ‌మే కాకుండా న‌ష్టం కూడా. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసే విష‌యంలో స్వ‌చ్ఛ‌త ఆందోళ‌న క‌లిగించే అంశం. అదే సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ బంగారం 99.9% స్వ‌చ్ఛ‌త‌కు హామీ ఇస్తుంది.

భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసిన‌పుడు బంగారు వ‌స్తువుల‌ను సుర‌క్షితంగా ఇంట్లో ఉంచ‌డానికి అభ‌ద్ర‌త భావం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. దొంగ‌త‌నం లాంటివి జ‌రిగిన‌ప్పుడు పూర్తిగా వ‌స్తువులు రిక‌వ‌రీ అవుతాయ‌ని గ్యారెంటీ లేదు. బ్యాంక్ లాక‌ర్‌ను వినియోగించుకుని బంగారాన్ని సేఫ్ డిపాజిట్ చేసిన‌పుడు లాక‌ర్ల‌ను అద్దెకు తీసుకోవ‌డం, ఆ బంగారానికి బీమాను తీసుకోవ‌డం లాంటివి చేయాల్సి ఉంటుంది. ఇవి కూడా ఖ‌ర్చుతో కూడుకున్న‌వే. అయితే సావ‌రిన్ గోల్డ్ బాండ్స్‌ విష‌యంలో బంగారం డిజిట‌ల్‌గా సర్టిఫికెట్ రూపంలో ఉంటుంది. భార‌త ప్ర‌భుత్వానికి చెందిన గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబ‌డులు పెడ‌తారు. భ‌ద్ర‌తా, సుర‌క్షిత‌మైన విష‌యాల గురించి ఢోకా ఉండదు. దొంగ‌ల భ‌యం కూడా ఉండ‌దు.

భౌతిక బంగారం లేదా బంగారు ఆభ‌ర‌ణాల విక్ర‌యం స‌మ‌యంలో మూల‌ధ‌న లాభం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ పెట్టుబ‌డిదారులు మెచ్యూరిటీపై లాభం విష‌యంలో ఎటువంటి ప‌న్నూ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. బంగారు ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసేటప్పుడు వ‌స్తు సేవ‌ల ప‌న్ను (జీఎస్‌టీ) విధిస్తారు. అయితే సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ పెట్టుబ‌డిలో ‘జీఎస్‌టీ’ చెల్లించ‌న‌క్క‌ర్లేదు. భౌతిక బంగారాన్ని త‌న‌ఖా పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్న‌ట్లు, ఈ సావ‌రిన్ గోల్డ్ బాండ్స్‌పై కూడా ‘కొలేట‌ర‌ల్‌’గా ఉప‌యోగించి రుణం తీసుకోవ‌చ్చు. భౌతిక బంగారంపై ఎటువంటి వ‌డ్డీ ల‌భించదు. గోల్డ్ బాండ్స్‌పై పెట్టుబ‌డిదారుడు సంవ‌త్స‌రానికి 2.5% వ‌డ్డీని పొందొచ్చు.

కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం ద్వారా రూ.31 వేల కోట్ల‌కు పైగా నిధుల‌ను సేక‌రించింది. డిజిట‌ల్ బంగారంపై పెట్టుబ‌డులు పెరిగేకొద్దీ భార‌త్‌కు భౌతిక బంగారం దిగుబ‌డులు త‌గ్గిన‌ట్లే. దీంతో దేశానికి విదేశీ మార‌క‌ద్ర‌వ్యం ఆదా అవుతుంది. దీనివల్ల దేశానికి ద్ర‌వ్య‌లోటు అదుపులో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని