Rupee Value: రూపాయి పతనం ఇంకెంత దూరం? ఆర్‌బీఐ జోక్యం చేసుకోదా?

Rupee Value: డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. శుక్రవారం తొలి సెషన్‌లో రూ.81 మార్క్‌ను కూడా దాటేసి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

Updated : 23 Sep 2022 12:41 IST

ముంబయి: డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. శుక్రవారం తొలి సెషన్‌లో రూ.81 మార్క్‌ను కూడా దాటేసి సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ఖాయమని తేలడంతో బుధవారం నుంచి డాలర్‌ బలపడుతూ వస్తోంది. వడ్డీరేట్లను 75 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నామని.. భవిష్యత్తులో మరిన్ని పెంపులు తప్పవని ఫెడ్‌ ప్రకటించడంతో రూపాయికి డిమాండ్‌ పూర్తిగా పడిపోయింది. ఉదయం 9:25 గంటల సమయంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.25 వద్ద జీవనకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. ఉదయం 11.50 గంటల సమయంలో రూ.80.91 వద్ద ట్రేడవుతోంది. గురువారం రూపాయి ఏకంగా 1.1 శాతం పడిపోయి 80.87 వద్ద రికార్డు ముగింపును నమోదు చేసిన విషయం తెలిసిందే.

బుధవారం నుంచే రూపాయి పతనం ప్రారంభమైంది. దీంతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ జోక్యం చేసుకొని రూపాయికి మద్దతుగా నిలుస్తుందని మదుపర్లు భావించారు. కానీ, ఆ దిశగా ఆర్‌బీఐ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో రూపాయి పతనం అంతకంతకూ దిగజారుతూ వస్తోంది. 2022లో రూపాయి ఇప్పటి వరకు 8.5 శాతం నష్టపోయింది. అదే సమయంలో యూఎస్‌ డాలర్‌ సూచీ 16 శాతం బలపడి గురువారానికి 111.41కి చేరింది. ప్రభుత్వ బాండ్లు సైతం బుధవారం నుంచి నష్టాల్ని చవిచూస్తున్నాయి. పదేళ్ల బెంచ్‌మార్క్‌ బాండ్‌ రాబడి ఏడు బేసిస్‌ పాయింట్లు పెరిగి 7.38 శాతం వద్ద ట్రేడవుతోంది. అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడమే దీనికి కారణం.

Also Read: మాంద్యం తప్పదేమో!

రూపాయి భారీగా పతనమవడం గురువారం నుంచి ప్రారంభమైంది. అంతకుముందు వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయే బలంగా ఉంది. విదేశీ పెట్టుబడులు తిరిగి భారత్‌కు రావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు దిగిరావడం, ఆర్‌బీఐ జోక్యం.. రూపాయికి దన్నుగా నిలిచాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీల కంటే రూపాయి మారకం విలువే బలంగా కనిపించింది. కానీ, నిన్నటి నుంచి మాత్రం ఇతర దేశాల కరెన్సీ కంటే మన రూపాయే దారుణమైన పతనాన్ని చూస్తోంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌బీఐ జోక్యం చేసుకోకపోవడంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికాలో సుదీర్ఘకాలం వడ్డీరేట్లు ఎగువస్థాయిల్లో ఉండనున్న నేపథ్యంలో తదనుగుణంగా రూపాయి విలువ దానికదే సర్దుబాటు కావాలనే ఉద్దేశంతోనే ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి రూపాయి నేలచూపులు చూస్తుండడంతో కేంద్ర బ్యాంకు పలుసార్లు జోక్యం చేసుకుంది. దీంతో విదేశీ మారక నిల్వలు 550 బిలియన్‌ డాలర్ల వద్ద రెండేళ్ల కనిష్ఠానికి చేరాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత 80 బిలియన్‌ డాలర్ల నిల్వలు తరిగిపోయాయి. రూపాయి పడిపోతున్న సమయంలో ఆర్‌బీఐ డాలర్లు విక్రయించి ద్రవ్యలభ్యతను నియంత్రిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే నిల్వలు వేగంగా తగ్గుతున్నాయనే వాదన ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని