75,100 పైన మరిన్ని సానుకూలతలు!

సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి.

Published : 06 May 2024 02:08 IST

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. దేశీయంగా చూస్తే.. ఏప్రిల్‌లో తయారీ పీఎంఐ 58.8గా నమోదైంది. మార్చిలో కీలక రంగాల వృద్ధి 5.2 శాతానికి నెమ్మదించింది. ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు గరిష్ఠమైన రూ.2.1 లక్షల కోట్లకు చేరాయి. బ్యారెల్‌ ముడిచమురు 7.3 శాతం తగ్గి 83 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా.. వరుసగా ఆరో సమీక్షలోనూ అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఏప్రిల్‌లో అమెరికాలో కొత్త ఉద్యోగాలు అంచనాల కంటే తక్కువగా 1,75,000గా నమోదయ్యాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.2% లాభంతో 73,878 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.2% తగ్గి 22,476 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.1211 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.5,253 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) నికరంగా రూ.8,700 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. మేలో రెండు ట్రేడింగ్‌ రోజుల్లో రూ.1,156 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 3:5గా నమోదు కావడం..
కొన్ని పెద్ద షేర్లలో లాభాల స్వీకరణను సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: గతవారం సెన్సెక్స్‌ జీవనకాల గరిష్ఠమైన 72,124 పాయింట్లకు చేరువై, మళ్లీ వెనక్కి వచ్చింది. స్వల్పకాలంలో 75,100 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. ఇది అధిగమిస్తే మరిన్ని లాభాలకు అవకాశం ఉంటుంది. మరోవైపు 73,000 వద్ద మద్దతు దక్కొచ్చు.

ప్రభావిత అంశాలు: దేశీయ సూచీలపై అంతర్జాతీయ సంకేతాల ప్రభావం కొనసాగొచ్చు. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు కీలకం కానున్నాయి. ఈ నెల 7న లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ జరగనుండటంతో ఓటింగ్‌ శాతంపై దృష్టిపెట్టొచ్చు. ఈ వారం లుపిన్‌, మారికో, డాక్టర్‌ రెడ్డీస్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌, వోల్టాస్‌, పిడిలైట్‌, టాటా పవర్‌, హీరో మోటోకార్ప్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, సిప్లా, టాటా మోటార్స్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, టీవీఎస్‌, కెనరా బ్యాంక్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. అంతర్జాతీయంగా.. ఆస్ట్రేలియా, బ్రిటన్‌ కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను ప్రకటించనున్నాయి. బ్రిటన్‌ జీడీపీ, చైనా ఎగుమతుల గణాంకాలపై కన్నేయొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. చమురు ధరలు మరింత తగ్గితే దేశీయ సెంటిమెంట్‌ బలపడనుంది.

తక్షణ మద్దతు స్థాయులు: 73,227, 72,365, 71,816
తక్షణ నిరోధ స్థాయులు: 74,450, 75,095, 75,600
సెన్సెక్స్‌ 75,100 ఎగువన ముగిస్తే మరింత లాభపడొచ్చు.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని