మాంద్యం తప్పదేమో

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీరేట్లు పెంచాల్సి వస్తున్నందున, వృద్ధి నెమ్మదించడం, అధిక నిరుద్యోగిత, ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలు లేకపోలేదని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. 40 ఏళ్ల గరిష్ఠస్థాయులకు చేరిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కీలక రేట్లను ఫెడ్‌ పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Published : 23 Sep 2022 02:54 IST

అమెరికా ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌

‘మేము తీసుకుంటున్న చర్యల వల్ల మాంద్యం సంభవిస్తుందా.. లేదా? ఒకవేళ మాంద్యం చోటుచేసుకుంటే, అది ఎంత తీవ్రతతో ఉంటుందనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నాం’

- పావెల్‌  

వాషింగ్టన్‌: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వడ్డీరేట్లు పెంచాల్సి వస్తున్నందున, వృద్ధి నెమ్మదించడం, అధిక నిరుద్యోగిత, ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలు లేకపోలేదని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది. 40 ఏళ్ల గరిష్ఠస్థాయులకు చేరిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కీలక రేట్లను ఫెడ్‌ పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మంగళ, బుధవారాల్లో నిర్వహించిన సమీక్ష అనంతరం కీలకరేట్లను మరో 0.75 శాతం పెంచి, 3-3.25 శాతానికి చేర్చింది.   ఈ నేపథ్యంలో ఫెడ్‌ ఛైర్మన్‌ పావెల్‌ మాట్లాడుతూ ‘సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అన్నారు. ఇక్కడ సాప్ట్‌ల్యాండింగ్‌ అంటే.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే క్రమంలో, వృద్ధి నెమ్మదించినప్పటికీ అది ఆర్థిక మ్యాంద్యానికి దారి తీయకుండా చూసుకోవడం. ఆ పరిస్థితి ఏర్పడే అవకాశాలు తగ్గిపోతున్నాయని పావెల్‌ పేర్కొన్నారు. ఆగస్టులో 8.3 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణాన్ని తిరిగి తాము లక్షిత స్థాయి అయిన 2 శాతానికి తీసుకెళ్లాల్సి ఉందని, ఇందుకు తీసుకునే చర్యల ఫలితంగా ఎలాంటి దుష్ఫలితాలూ చోటుచేసుకోవద్దనే తాము కోరుకుంటున్నామని అన్నారు. వడ్డీరేట్లను మరింత పెంచి, ఈ ఏడాది ఆఖరుకు 4.4 శాతానికి చేరుస్తారనే అంచనాలున్నాయి. వచ్చే ఏడాదిలోనూ వడ్డీరేట్ల పెంపు కొనసాగి 4.6 శాతానికి చేరుతుందని, 2007 తరవాత అదే గరిష్ఠం అవుతుందని పేర్కొంటున్నారు. కొన్ని నెలల పాటు కనుక నిరుద్యోగిత రేటు 0.5 శాతం చొప్పున పెరిగితే, తదుపరి మాంద్యం తప్పదని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.


27 ఏళ్ల గరిష్ఠానికి  బ్రిటన్‌ వడ్డీ రేట్లు

బ్రిటన్‌ కేంద్రీయ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ కీలక ప్రామాణిక రేటును గురువారం మరో అర శాతం పెంచి  2.25 శాతానికి చేర్చింది. ఇది  27 ఏళ్ల గరిష్ఠం. కీలక రేట్లను పెంచడం వరుసగా  ఏడోసారి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే దిశగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే అమెరికా ఫెడ్‌, ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల మాదిరి రేట్ల పెంపు విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ మరింత దూకుడుగా వెళ్లడం లేదు.


జపాన్‌ రేట్లు యథాతథంగానే

మిగతా కేంద్ర బ్యాంకులకు భిన్నంగా జపాన్‌ తన కీలక రేటును యథాతథంగా -0.1% వద్దే కొనసాగించింది.  ఇందువల్ల అమెరికా డాలరుతో పోలిస్తే యెన్‌ మారకపు విలువ క్షీణించి, 24 ఏళ్ల కనిష్ఠమైన 146 యెన్‌లకు దిగివచ్చింది. యెన్‌ క్షీణతను అడ్డుకునేందుకు జపాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ జోక్యం చేసుకోవడంతో డాలర్‌ విలువ 142 యెన్‌లకు పరిమితమైంది. యెన్‌ విషయంలో జోక్యం చేసుకున్న విషయాన్ని జపాన్‌ మంత్రి ధ్రువీకరించారు.


స్విట్జర్లాండ్‌ తొలిసారిగా

స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంకు కూడా కీలక వడ్డీ రేట్లను 0.75% పెంచింది. ఈ స్థాయిలో పెంచడం ఇదే మొదటిసారి. తాజా పెంపుతో స్విట్జర్లాండ్‌ కీలక వడ్డీ రేటు -0.25 శాతం నుంచి 0.50 శాతానికి పెరిగింది. తద్వారా ఏడేళ్ల పాటు మైనస్‌లో కొనసాగిన వడ్డీ రేట్లకు ముగింపు పలికింది.


భిన్నంగా టర్కీ..

చాలా దేశాల కేంద్ర బ్యాంకులు కీలక రేట్లను పెంచుతుండగా, టర్కీ మాత్రం తగ్గించింది. ప్రామాణిక రుణ రేటును 1% తగ్గించి 12 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఆ దేశ సెంట్రల్‌ బ్యాంకు గురువారం ప్రకటించింది. టర్కీ ద్రవ్యోల్బణం 80 శాతానికి పైన ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం తీసుకోవడం  గమనార్హం. రేట్ల కోత నేపథ్యంలో, టర్కీ కరెన్సీ లిరా విలువ క్షీణించింది.


అయ్యో..రూపాయి  
ఇంట్రాడేలో డాలర్‌ విలువ రూ.80.96కు
సూచీలకు ఫెడ్‌ వడ్డీ రేట్ల భారం

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఎన్నడూ లేనంత కనిష్ఠానికి పతనమైంది. గురువారం ఇంట్రాడేలో 90 పైసలు కోల్పోయి రికార్డు కనిష్ఠమైన 80.96కు చేరడం స్టాక్‌మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. చివరకు 83 పైసలు తగ్గి 80.79 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 (99 పైసల క్షీణత) తర్వాత రూపాయికిదే అతిపెద్ద ఒకరోజు నష్టం. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను 0.75 శాతం పెంచిన నేపథ్యంలో, వర్థమాన ఈక్విటీ మార్కెట్లలో గురువారం విక్రయాలు అధికమయ్యాయి. ఫలితంగా మన సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మాంద్యం భయాలతో ఐటీ, లోహ, ఔషధ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 0.55 శాతం పెరిగి 90.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు ప్రతికూలంగానే ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 59,073.84 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. అనంతరం అదే ధోరణి కొనసాగించిన సూచీ.. ఒకదశలో 624 పాయింట్లు నష్టపోయి 58,832.78 వద్ద కనిష్ఠానికి చేరింది. మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీ నష్టాలు తగ్గించుకోగలిగింది. చివరకు 337.06 పాయింట్ల నష్టంతో 59,119.72 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 88.55 పాయింట్లు కోల్పోయి 17,629.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,532.45- 17,722.75 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 18 నష్టపోయాయి. పవర్‌గ్రిడ్‌ 2.80%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.18%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.09%, హెచ్‌డీఎఫ్‌సీ 1.69%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.67%, కోటక్‌ బ్యాంక్‌ 1.39%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.37%, అల్ట్రాటెక్‌ 1.24%, టెక్‌ మహీంద్రా 1.06% చొప్పున డీలాపడ్డాయి. టైటన్‌ 2.73%, హెచ్‌యూఎల్‌ 2.64%, ఏషియన్‌ పెయింట్స్‌ 2.41%, మారుతీ 1.68%, ఐటీసీ 1.19% రాణించాయి. రంగాల వారీ సూచీల్లో బ్యాంకింగ్‌ 1.44%, ఆర్థిక సేవలు 1.22%, ఇంధన 0.42% పడ్డాయి. ఎఫ్‌ఎమ్‌సీజీ, వినియోగ, కమొడిటీస్‌, పరిశ్రమలు పెరిగాయి. బీఎస్‌ఈలో 1764 షేర్లు నష్టాల్లో ముగియగా, 1676 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 149 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని