Samsung: దేశీయంగా ల్యాప్‌టాప్‌ల తయారీ.. ఈ ఏడాది నుంచే!

ఈ ఏడాది నుంచే దేశీయంగా ల్యాప్‌టాప్‌ల తయారీని ప్రారంభించనున్నట్లు శాంసంగ్‌ వెల్లడించింది. 

Published : 29 Jan 2024 18:59 IST

గురుగ్రామ్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) ఈ ఏడాది నుంచి భారత్‌లో ల్యాప్‌టాప్‌లు తయారుచేయనుంది. సంస్థ ఉన్నతోద్యోగి ఒకరు సోమవారం ఈవిషయాన్ని వెల్లడించారు. నోయిడాలోని తయారీ యూనిట్‌లో వీటి ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు  తెలిపారు. ‘‘శాంసంగ్‌ సంస్థకు భారత్‌లోని తయారీ కేంద్రాలు ఎంతో కీలకమైనవి. సంస్థ ప్లాంట్‌లలో నోయిడా యూనిట్‌ రెండో అతి పెద్దది. దీని ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎంతగానో సహకరించాయి. ఈ ఏడాది నుంచే ఇందులో ల్యాప్‌టాప్‌ల తయారీ ప్రారంభిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రపంచ స్థాయి డిమాండ్‌కు తగినట్లు ఉత్పత్తుల తయారీకి ప్లాంట్‌లో కొన్ని మార్పులు చేస్తాం’’ అని శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్‌ టీఎమ్‌ రోహ్‌ తెలిపారు. 

తాత్కాలిక బడ్జెట్‌పైనా ఆశలు ఇందుకే.. గత అనుభవాలివీ..!

ఇప్పటికే నోయిడా ప్లాంట్‌లో ఫీచర్‌ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్యాబ్‌లెట్లను సంస్థ తయారుచేస్తోంది. ఇటీవల కొత్తగా మార్కెట్లోకి విడుదలైన గెలాక్సీ ఎస్‌24 మోడల్‌ను ఇక్కడ తయారుచేస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. విదేశాల నుంచి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, పర్సనల్‌ కంప్యూటర్ల దిగుమతులపై గతేడాది కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించింది. స్మార్ట్‌ఫోన్‌ తరహాలోనే వాటి తయారీని దేశీయంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌లో విక్రయించే ల్యాప్‌టాప్‌ బ్రాండ్‌లలో చాలావరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. దీంతో ఆయా సంస్థలు భారత్‌లోనే తయారీ ప్రారంభించాలని నిర్ణయించాయి. దేశీయంగా మొబైల్ తయారీ యూనిట్లు ఉన్న సంస్థలు వాటిలో ల్యాప్‌టాప్‌లు ఉత్పత్తి చేసేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన సంస్థలు కొత్తగా ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని భావిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని