Stock Market Update: వరుసగా రెండోరోజూ సూచీలకు లాభాలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి....

Updated : 24 Jun 2022 16:04 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలిచాయి. ఆటో, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు రాణించాయి. కమొడిటీ ధరలు తగ్గడం సూచీలకు కలిసొచ్చింది. మరోవైపు అమెరికాలో బాండ్ల రాబడులు తగ్గడం, చమురు ధరలు ఇటీవలి గరిష్ఠాల నుంచి దిగిరావడం సూచీల సెంటిమెంటును పెంచింది. ఆసియా-పసిఫిక్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సైతం సానుకూలంగా కదలాడుతున్నాయి.  

ఉదయం సెన్సెక్స్‌ 52,654.24 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 52,909.87 - 52,447.25 మధ్య కదలాడింది. చివరకు 462.26 పాయింట్ల లాభంతో 52,727.98 వద్ద ముగిసింది. 15,657.40 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 142.60 పాయింట్లు లాభపడి 15,699.25 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,749.25 - 15,619.45 మధ్య చలించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.78.31 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, విప్రో, సన్‌ ఫార్మా షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, మారుతీ షేర్లు రాణించిన వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర సంగతులు.. 

* 2023 ఆర్థిక సంవత్సరంలో రుణాల ద్వారా రూ.9,000 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. కంపెనీ షేరు విలువ ఈరోజు 2.23 శాతం పెరిగింది.

* థామస్‌ కుక్‌ షేరు ధర ఈరోజు ఏకంగా 8.50 శాతం పెరిగి రూ.61.25కు స్థిరపడింది. ప్రమోటర్లు తమ వాటా పెంచుకోనున్నారనే వార్తలే అందుకు కారణం.

* వచ్చే మూడేళ్లలో రేమండ్స్‌ను రుణరహిత కంపెనీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో కంపెనీ షేర్లు ఈరోజు 5 శాతం పెరిగాయి.

* రూట్‌ మొబైల్‌ షేర్లు ఈరోజు 8.04 శాతం లాభపడ్డాయి. షేర్ల బైబ్యాక్‌ నిమిత్తం ఈ కంపెనీ బోర్డు జూన్‌ 28న భేటీ కానుండడమే ఇందుకు కారణం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని