Sovereign gold bond scheme: ఈ ఏడాది మొద‌టి విడ‌త సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు జారీ.. ఎప్ప‌టినుంచంటే..?

ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేవారికి గ్రాము బంగారం రూ. 5,041 కే ల‌భిస్తుంది.

Updated : 18 Jun 2022 14:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)కి సంబంధించి మొద‌టి విడత సార్వభౌమ పసిడి బాండ్ల ఇష్యూ ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు జరుగుతుందని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్ర‌వారం వెల్లడించింది. గ్రాము ధ‌ర రూ.5,091గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ.50 ప్రత్యేక తగ్గింపు ఉంటుంది. అంటే, ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేవారికి గ్రాము బంగారం రూ. 5,041కే ల‌భిస్తుంది. ఇక ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి రెండో విడ‌త (2022-23 సిరీస్‌ II) ప‌సిడి బాండ్ల‌ను 2022 ఆగ‌స్టు 22 నుంచి 26 వ‌ర‌కు జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ పెట్టుబ‌డుదారుల‌కు ఇది ఉత్తమమైన మార్గమని నిపుణుల అభిప్రాయం. దీనిలో పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల‌ పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై సంవత్సరానికి 2.50 శాతం స్థిర వడ్డీని పొందడంతో పాటు, బంగారం ధ‌ర పెరిగితే ఆ లాభాన్ని కూడా పొందొచ్చు. అంతేకాకుండా ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

సార్వభౌమ పసిడి పథకాల గురించి ముఖ్య విషయాలు..

  • గోల్డ్ బాండ్లను ఒక గ్రాము బంగారం ధరతో మొదలుకుని జారీ చేస్తారు. అంటే, ఈ పథకంలో జారీ చేసే ఒక్కో బాండ్ ఒక గ్రాము బంగారంతో సమానం.
  • ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ప్రచురించిన ధర ఆధారంగా మదుపర్లు బాండ్లలో పెట్టుబడి చేయాలి. 999 స్వచ్ఛత గల బంగారం ధర స‌బ్‌స్క్రిప్ష‌న్‌ ముందు వారం చివరి మూడు పని దినాల్లో ఉన్న ధరకు సగటు లెక్కించి ధర నిర్ణయిస్తారు.
  • ఆన్‌లైన్లో పెట్టుబడి పెట్టి, డిజిటల్ మోడ్ ద్వారా చెల్లించే పెట్టుబడిదారులకు 50 రూపాయల డిస్కౌంటును ఆర్‌బీఐ అందిస్తుంది. దరఖాస్తుదారుడు పాన్ నంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
  • జారీ చేసిన ధరపై పెట్టుబడిదారులకు 2.50 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఆరునెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు.
  • పెట్టుబడి పెట్టిన రోజు నుంచి 8 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం, చివరి మూడు పని దినాల్లో ఉన్న ధరకు సగటు లెక్కించి దాని ప్రకారం చెల్లింపులు చేస్తారు.
  • మెచ్యూరిటీ సమయం కంటే ముందుగా తీసుకోవాలనుకున్న వారు జారీ చేసిన రోజు నుంచి 5 సంవత్సరాలు పూర్తైన తరువాత విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • ఈ బాండ్ల ద్వారా రుణ సదుపాయం కూడా పొందవచ్చు.
  • గోల్డ్ బాండ్లపై వచ్చే వడ్డీపై పన్ను వర్తిస్తుంది.
  • మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే మూలధన లాభాలపై పన్ను వర్తించదు. ఈ పన్ను ప్రయోజనం ప్రత్యేకించి పసిడి పథకాలకు మాత్రమే అందుబాటులో ఉంది. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, భౌతిక బంగారం వంటి ఇతర పెట్టుబడులకు అందుబాటులో లేదు.
  • కాలపరిమితి కంటే ముందు గానే బాండ్ల నుంచి నిష్క్రమించాలనుకుంటే రెండు విధాలుగా చేయవచ్చు. ఎక్స్ఛేంజీలలో లిస్టయిన బాండ్లను ఎక్స్చేంజీల ద్వారా విక్రయించడం. జారీ చేసిన తేదీ నుంచి ఐదో సంవత్సరం తర్వాత బాండ్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ రెండు సందర్భాల్లో మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది.
  • ప్రభుత్వం తరఫున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈ బాండ్లను జారీ చేస్తుంది. ఈ బాండ్లు వ్య‌క్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు), ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు ప‌రిమితుల‌కు లోబ‌డి కొనుగోలు చేయ‌వ‌చ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని