Stock Market Update: ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపుతో పతనమైన మార్కెట్లు

అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చివరకు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి....

Updated : 04 May 2022 16:10 IST

ముంబయి: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య బుధవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు చివరకు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. కీలక వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన అనూహ్య నిర్ణయం మార్కెట్ల భారీ పతనానికి ప్రధాన కారణమైంది. అనుకోకుండా అత్యవసరంగా ఆర్‌బీఐ భేటీ కావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. జూన్‌లో జరిగే పరపతి సమీక్ష వరకు రేట్ల పెంపుపై వేచిచూస్తారని భావించినప్పటికీ.. అంతుకుముందే ప్రకటించడం మార్కెట్లను కలవరపెట్టింది. మరోవైపు 25 బేసిస్‌ పెంపును అంచనా వేయగా.. ఒకేసారి 40 పాయింట్లు పెంచడం కూడా మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది. దీంతో వరుసగా మార్కెట్లు మూడో రోజు నష్టాలను చవిచూశాయి.

మరోవైపు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా నుంచి చమురు దిగుమతిని నిషేధించాలని ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు ప్రతిపాదించారు. ఈ అంశం ఉదయం నుంచీ మార్కెట్లను కలవరపెట్టింది. అంతలోనే ఆర్‌బీఐ నిర్ణయం వెలువడడంతో సూచీలు మరింత దిగజారి మదుపర్లకు భారీ నష్టాలను మిగల్చాయి.

ఉదయం సెన్సెక్స్‌ 57,124.91 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 55,501.60 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 1306.96 పాయింట్ల నష్టంతో 55,669.03 వద్ద ముగిసింది. 17,096.60 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 391.50 పాయింట్లు నష్టపోయి 16,677.60 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 16,623.95 వద్ద కనిష్ఠాన్ని తాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.76.38 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ, డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

  • టాటా స్టీల్‌ షేర్లు ఈరోజు 3.72 శాతం లాభపడ్డాయి. కంపెనీ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడంతో పాటు డివిడెండ్‌ పాలసీని సమీక్షించనున్నట్లు ప్రకటించడం సెంటిమెంటును పెంచింది.
  • మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చడంతో సీజీ పవర్‌ షేర్లు వరుసగా రెండోరోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు కంపెనీ షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. దీంతో గత రెండు రోజుల్లో 25 శాతం పతనం నమోదైంది.
  • గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో జేబీఎం ఆటో షేర్లు ఈరోజు 3.62 శాతం మేర లాభపడ్డాయి.
  • డిక్సన్‌ టెక్నాలజీ షేర్లు ఇంట్రాడేలో 5 శాతానికి పైగా నష్టపోయాయి. దీంతో గత రెండు సెషన్లలో షేర్లు 13 శాతం మేర పతనమయ్యాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని