Stock Market Update: మార్కెట్లకు మందగమన భయాలు!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి....

Updated : 09 May 2022 15:52 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. రోజంతా నష్టాల్లోనే కదలాడాయి. మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నానికి కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. కానీ, తిరిగి అమ్మకాలు ఎదురుకావడంతో మళ్లీ నష్టాల్లోకే జారుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేయడం, మందగమన సూచనలు సూచీలపై ప్రభావం చూపాయి.

ఉదయం సెన్సెక్స్‌ 54,188.21 వద్ద భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 53,918.02 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 364.91 పాయింట్ల నష్టంతో 54,470.67 వద్ద ముగిసింది. 16,227.70 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 109.40 పాయింట్లు నష్టపోయి 16,301.85 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 16,142.10 వద్ద కనిష్ఠాన్ని తాకింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.77.46 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్‌, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* విలీన ఒప్పందాన్ని ప్రకటించిన ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, మైండ్‌ట్రీ షేర్లు సోమవారం 5 శాతానికి పైగా నష్టపోయాయి.

* డిమార్ట్‌ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేర్లు 8 నెలల కనిష్ఠానికి చేరాయి. గత రెండు రోజుల్లో ఈ కంపెనీ షేర్లు 12 శాతానికి పైగా పడిపోయాయి.

* రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేయాలన్న జీ-7 ప్రతిపాదనకు జపాన్‌ కూడా మద్దతు ప్రకటించింది.

* క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ షేర్లు ఈరోజే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పటికీ.. ఈ కంపెనీ షేర్ల ఆరంభం అదిరిపోవడం విశేషం. ఇష్యూ ధరపై 23 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. చివరకు 29.76 శాతం లాభంతో రూ.378.90 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని