Stock Market: దలాల్‌ స్ట్రీట్‌లో కొనుగోళ్ల కళ.. సూచీలకు భారీ లాభాలు

Stock Market Closing Bell: గురువారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్‌ సూచీలు భారీ లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు ఎగబాకగా.. నిఫ్టీ 21,650 మార్క్‌ పైన స్థిరపడింది.

Updated : 04 Jan 2024 16:07 IST

ముంబయి: దలాల్‌ స్ట్రీట్‌ మళ్లీ లాభాలతో కళకళలాడింది. గత రెండు సెషన్లలో వరుస నష్టాల నుంచి తేరుకున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు గురువారం రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. కంపెనీల అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సెన్సెక్స్‌ (Sensex) దాదాపు 500 పాయింట్లు ఎగబాకగా.. నిఫ్టీ (Nifty) 21,650 మార్క్‌ పైన స్థిరపడింది.

రోజంతా లాభాల్లోనే..

ఈ ఉదయం 71,678.93 వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ (BSE).. ట్రేడింగ్ ఆద్యంతం అదే జోరును కొనసాగించింది. ఒక దశలో 71,954 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 490.07 పాయింట్ల లాభంతో 71,847.57 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (NSE) కూడా 141.26 పాయింట్లు ఎగబాకి 21,658.60 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసలు లాభపడి 83.22 వద్ద ముగిసింది.

రంగాల వారీగా రియల్టీ సూచీ అత్యధికంగా 6.6శాతం మేర లాభపడింది. విద్యుత్‌ రంగ సూచీ 2 శాతం పెరిగింది. బ్యాంక్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, హెల్త్‌కేర్‌, చమురు, గ్యాస్‌ రంగ సూచీలు 0.5-1 శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, టాటా కన్జ్యూమర్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు రాణించగా.. భారత్‌ పెట్రోలియం, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హీరో మోటార్స్‌ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని