Updated : 18 May 2022 09:39 IST

Stock Market Update: కొనసాగుతున్న లాభాల జోరు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్నటి భారీ లాభాల జోరు నేటి ఉదయం ట్రేడింగ్‌లోనూ కనిపిస్తోంది. మరోవైపు అమెరికా, ఐరోపా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు మిశ్రమంగా కదలాడుతున్నాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం 15.08% చేరడం ఆందోళన కలిగించే అంశం. ఫలితంగా ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరోసారి పెంచే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు ఫెడరల్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ సోమవారం మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అవసరమైతే వడ్డీరేట్లను మరింత వేగంగా పెంచుతామని తెలిపారు. ఇది మార్కెట్లకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 366 పాయింట్ల లాభంతో 54,684 వద్ద, నిఫ్టీ (Nifty) 101 పాయింట్లు లాభపడి 16,360 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.49 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, బార్బెక్యూ నేషన్‌ హాస్పిటాలిటీ, అర్వింద్‌ లిమిటెడ్‌, బ్రూక్‌ఫీల్డ్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ ట్రస్ట్‌ రీట్‌, ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌, గుజరాత్‌ పివవవ్‌ పోర్ట్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా, ఇంద్రప్రస్త గ్యాస్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, ఇండియన్ ఓవర్సీస్‌ బ్యాంక్‌, ఐటీసీ లిమిటెడ్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, లుపిన్‌, మణప్పురం ఫైనాన్స్‌

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

టెలికాం కంపెనీలు: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రతిపాదనను తుది ఆమోదం కోసం వచ్చే వారంలో కేంద్ర మంత్రివర్గానికి  టెలికాం విభాగం పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) సూచించిన స్పెక్ట్రమ్‌ ప్రాథమిక ధరనే డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (డీసీసీ) ఖరారు చేసిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఎయిర్‌టెల్‌: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం(జవనరి-మార్చి)లో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం రూ.2,008 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.759 కోట్లతో పోలిస్తే ఇది 164 శాతానికి పైగా అధికం. వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) పెరగడంతో పాటు టవర్ల విక్రయం తదితరాల కారణంగా వచ్చిన అసాధారణ లాభాలు ఇందుకు కారణం.

అబాట్‌ ఇండియా: ఔషధ సంస్థ అబాట్‌ ఇండియా మార్చి త్రైమాసికానికి రూ.211 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే కాల లాభం రూ.152 కోట్లే. ఇదే సమయంలో ఆదాయం     రూ.1096 కోట్ల నుంచి రూ.1255 కోట్లకు పెరిగింది. ప్రతి షేరుపై రూ.145 తుది డివిడెండ్‌, రూ.130 ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించాలని డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: గత ఆర్థిక సంవత్సరం (2021-22) నాలుగో త్రైమాసికంలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.128.95 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.723.36 కోట్లతో పోలిస్తే ఈసారి తగ్గింది. మొత్తం ఏకీకృత ఆదాయం రూ.1,697.71 కోట్ల నుంచి రూ.1,386.96 కోట్లకు పరిమితమైంది.

బీపీసీఎల్‌: భారత పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లో ప్రభుత్వం తన మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించడానికి బదులు 20-25 శాతం మేర వాటా విక్రయానికే బిడ్లు ఆహ్వానించాలని తాజాగా భావిస్తున్నట్లు ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. పూర్తి వాటా కొనుగోలుకు బిడ్డర్లను ఆకర్షించడంలో విఫలం కావడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

ఐఓసీ: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.6,021.88 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.8,781.30 కోట్లతో పోలిస్తే ఇది 31.4 శాతం తక్కువ. ఒక్కో షేరుకు రూ.3.60 తుది డివిడెండ్‌ను (ప్రీ-బోనస్‌) సంస్థ ప్రకటించింది.

సాగర్‌ సిమెంట్స్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాగర్‌ సిమెంట్స్‌ ఇతర సిమెంటు కంపెనీలను కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నాటికి దీన్ని పూర్తి చేయాలనేది కంపెనీ యాజమాన్యం ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం రూ.500 కోట్ల రుణ నిధులను సిద్ధంగా పెట్టుకుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని