Published : 23 May 2022 09:42 IST

Stock Market Update: ఊగిసలాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కాసేపటికే అమ్మకాల సెగ తగిలి నష్టాల్లోకి జారుకుని తిరిగి కోలుకున్నాయి. తిరిగి గరిష్ఠాల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో ఊగిసలాట ధోరణిలో పయనిస్తున్నాయి. ఆర్థిక మందగమన భయాలతో గతవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. చైనాలో లాక్‌డౌన్‌ల ఎత్తివేత, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం మార్కెట్లకు సానుకూలాంశాలు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ భయాలు, ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలపై మదుపర్లు ఇంకా ఓ కన్నేసి ఉంచినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గరిష్ఠాల వద్ద సూచీలకు అమ్మకాల ఒత్తిడి ఎదురు కావొచ్చని విశ్లేషించారు.

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:33 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 38 పాయింట్ల లాభంతో 54,364.69 వద్ద, నిఫ్టీ (Nifty) 5 పాయింట్లు నష్టపోయి 16,260.55 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.66 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, ఎన్‌టీపీసీ, నెస్లే ఇండియా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టాటా స్టీల్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

* నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, డేటా ప్యాటర్న్స్‌, పటేల్‌ ఇంజినీరింగ్‌, రామ్‌కో సిమెంట్స్‌, సెయిల్‌, థామస్‌ కుక్‌, టీటీకే హెల్త్‌కేర్‌, జొమాటో

ఈరోజు గమనించాల్సిన స్టాక్‌లు..

ఇన్ఫోసిస్‌: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఎండీ, సీఈఓగా మరో అయిదేళ్ల పాటు సలీల్‌ పరేఖ్‌ కొనసాగనున్నారు. 2027 మార్చి 31 వరకు సలీల్‌ పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఇన్ఫోసిస్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.

స్టీల్‌ కంపెనీల స్టాక్‌లు: ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలు పెంచడం పెట్టుబడిదార్లకు ప్రతికూల సంకేతాలు పంపుతుందని, దీంతో పీఎల్‌ఐ పథకం కింద సామర్థ్య విస్తరణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఉక్కు పరిశ్రమ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్కు తయారీకి వినియోగించే కోకింగ్‌ కోల్‌, ఫెర్రోనికెల్‌, పీసీఐ కోల్‌, కోక్‌, సెమీ కోక్‌ వంటి ముడి పదార్థాలపై కస్టమ్స్‌ సుంకాన్ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొంది.

ఎల్‌అండ్‌టీ: కంపెనీ తమ ఇంజినీరింగ్‌, విద్యుత్తు రంగాలపై పెట్టుబడులను తగ్గించి డిజిటల్‌ ఈ-కామర్స్‌ వ్యాపారంపై దృష్టి సారించాలని యోచిస్తున్నట్లు తెలిపింది.

పేటీఎం: పేటీఎం మొబైల్‌ లావాదేవీలను పర్యవేక్షించే పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు కొత్త వినియోగదారులను స్వీకరించేందుకు ఆర్‌బీఐ తిరిగి అనుమతించే అవకాశం ఉందని కంపెనీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

ఎన్‌టీపీసీ: మార్చి త్రైమాసికానికి ఏకీకృత పద్ధతిలో రూ.5,199.51 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.4,649.49 కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.31,687.24 కోట్ల నుంచి రూ.37,724.42 కోట్లకు పెరిగింది.

అమరరాజా బ్యాటరీస్‌: గత ఆర్థిక సంవత్సరం (2021-22) నాలుగో త్రైమాసికంలో అమరరాజా బ్యాటరీస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.98.85 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.189.38 కోట్లతో పోలిస్తే ఇది 47.80 శాతం తక్కువ.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని